
అవును మీరు విన్నది నిజమే. దాయాది దేశం పాకిస్థాన్‌లోని కరాచీలో 'రామాయణ' గాథని నాటకంగా ప్రదర్శించారు. ఈ స్టేజీ షోకు అద్భుతమైన ఆదరణ కూడా వచ్చినట్లు తెలుస్తోంది. దాదాపు మూడు రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమానికి జనాలు కూడా బాగానే వచ్చారండోయ్. ఇంతకీ అసలెలా ఇది సాధ్యమైంది? నాటకం వేసింది ఎవరు?
పాకిస్థాన్ పేరు చెప్పగానే ఉగ్రదాడులు, మత కల్లోలాలు లాంటివే గుర్తొస్తాయి. కానీ ఆ దేశంలోనూ ఇప్పుడు రామాయణ గాథని నాటకం వేయడం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. కరాచీ నగరానికి చెందిన యోగేశ్వర్ కరేరా, రాణా కజ్మాలతో పాటు మరికొందరు నాటక రంగంపై ఉన్న ఇష్టంతో థియేటర్ ఆర్ట్స్‌తో పాటు వివిధ విభాగాల్లో శిక్షణ తీసుకున్నారు. వీళ్లంతా తన బృందానికి 'మౌజ్' అని పేరు పెట్టుకున్నారు.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 15 సినిమాలు రిలీజ్)

గతేడాది నవంబరులో తొలిసారి ఓ ఆర్ట్ గ్యాలరీలో రామాయణ నాటకాన్ని ప్రదర్శించారు. దీనికి మంచి స్పందన వచ్చింది. ఈ క్రమంలోనే తాజాగా మరిన్ని హంగులు జోడించి, ఏఐ టెక్నాలజీని కూడా కాస్త ఉపయోగించి తాజాగా మూడు రోజుల పాటు నాటకాన్ని కరాచీలోని ఆర్ట్స్ కౌన్సిల్‌లో మరోసారి ప్రదర్శించారు. దీనికి కూడా విశేష స్పందన వచ్చింది.
రామాయణ నాటకాన్ని ప్రదర్శించినందుకు తమకు ఎలాంటి విమర్శలు, బెదిరింపులు రాలేదని దర్శకుడు యోగేశ్వర్ కరేరా చెప్పుకొచ్చారు. ఈ పురాణ గాథకు విశేషాదరణ దక్కిందని అన్నారు. ఏదైతేనేం పాక్ దేశంలో రామాయణ నాటకం ప్రదర్శించడం ఇప్పుడు హాట్ టాపిక్ అయిపోయింది.
(ఇదీ చదవండి: ప్రముఖ నటి సరోజా దేవి కన్నుమూత)
