
ప్రముఖ నటి, అభినయ సరస్వతి బి.సరోజా దేవి (87) కన్నుమూశారు. బెంగళూరులోని తన నివాసంలో సోమవారం (జూలై 14న) ఉదయం తుదిశ్వాస విడిచారు. ఈమె తెలుగు, కన్నడ, తమిళ సినిమాల్లో అనేక చిత్రాలు చేశారు. ఎన్టీఆర్, ఏఎన్‌ఆర్, ఎంజీఆర్, శివాజీ గణేశన్ వంటి స్టార్ హీరోలతో కలిసి నటించారు. తెలుగులో భూకైలాస్, పెళ్లి సందడి (1959), జగదేక వీరుని కథ, సీతారామ కల్యాణం, శ్రీ కృష్ణార్జున యుద్ధం, ఆత్మ బలం, శకుంతల, ఉమా చండీ గౌరీ శంకరుల కథ, పండంటి కాపురం, సీతారామ వనవాసం, దాన వీర శూర కర్ణ వంటి అనేక సినిమాల్లో నటించి మెప్పించారు.
200కి పైగా సినిమాలు
బీ సరోజాదేవి (B.Saroja Devi) 1938 జనవరి 7న బెంగళూరులో జన్మించారు. "అభినయ సరస్వతి" అనే బిరుదుతో ప్రసిద్ధి పొందిన ఆమె, తమిళ, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో సుమారు 200కి పైగా చిత్రాల్లో నటించారు. 1955లో కన్నడ చిత్రం మహాకవి కాళిదాసుతో ఆమె సినీ రంగ ప్రయాణం ప్రారంభమైంది. పాండురంగ మహత్యం (1957) ద్వారా తెలుగు చిత్రసీమలో ప్రవేశించారు. నాడోడి మన్నన్ (1958) ఆమెను తమిళ చిత్రసీమలో స్టార్‌గా నిలిపింది. హిందీలో పైఘామ్ (1959), ససురాల్ (1961) వంటి చిత్రాల్లో నటించారు.
1955 నుండి 1984 వరకు 161 సినిమాల్లో ప్రధాన పాత్రధారిగా నటించి ప్రపంచ రికార్డు నెలకొల్పారు. ఆమె కెరీర్‌లో.. కిట్టూరు రాణి చెన్నమ్మ (1961) దేశభక్తి భావనను ప్రతిబింబించే చిత్రంగా గుర్తింపు పొందింది. సినీ రంగంలో ఆమె కృషికిగానూ కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ (1969), పద్మభూషణ్ (1992) పురస్కారాలతో సత్కరించింది. అలాగే సరోజా దేవికి కలైమామణి పురస్కారం దక్కింది. అంతేకాకుండా బెంగళూరు విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ పొందారు.
కుటుంబ నేపథ్యం
సరోజా దేవి తండ్రి భైరప్ప పోలీసు శాఖలో ఉద్యోగి, తల్లి రుద్రమ్మ గృహిణి. 1967లో శ్రీ హర్ష అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు. ఆయన 1986లో మరణించారు. సరోజాదేవి ఇద్దరు పిల్లలను దత్తత తీసుకుని వారికి రామచంద్రన్, ఇందిరా అని పేర్లు పెట్టి పోషించారు.

చదవండి: ఫ్రెండ్స్‌తో బండ్ల గణేశ్.. 'ఆయన పొద్దున్నే కదా చనిపోయారు, ఇంతలోనే సిట్టింగా?