
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం 'గేమ్ చేంజర్' (Game Changer Movie). జనవరి 10న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో చిత్రయూనిట్ ప్రమోషన్స్ జోరు పెంచింది. శనివారం రాజమహేంద్రవరంలో ప్రీ రిలీజ్ వేడుక ఘనంగా జరిగింది. ఈ వేడుకకు కాకినాడ జిల్లా గైగోలుపాడుకు చెందిన ఆరవ మణికంఠ (23), తోకాడ చరణ్ (22) అనే ఇద్దరు హాజరయ్యారు. వాళ్లిద్దరూ బైకు మీద ఇంటికి తిరిగి వెళుతున్న సమయంలో వడిశలేరులో ప్రమాదవశాత్తు ఒక వ్యాన్ ఢీ కొట్టడంతో మరణించారు.
సంతాపం ప్రకటించిన చరణ్
అభిమానుల మృతిపై రామ్ చరణ్ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఆ ఘటన గురించి తెలిసిన వెంటనే అభిమానుల ఇంటికి తన మనుషులను పంపించి ధైర్యం చెప్పించారు. మృతి చెందిన అభిమానుల రెండు కుటుంబాలకు చెరొక ఐదు లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు.
అర్థం చేసుకోగలను
రామ్ చరణ్ మాట్లాడుతూ...''ఈవెంట్ చూసేందుకు వచ్చిన అభిమానులు సురక్షితంగా ఇంటికి వెళ్లాలని కోరుకుంటాం. ఇటువంటి ఘటన జరగడం దురదృష్టకరం. అభిమానుల కుటుంబాలు ఎంత బాధ పడతాయో అర్థం చేసుకోగలను. నాకూ అంతే బాధగా ఉంది. అభిమానుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నాను'' అన్నారు.
సినిమా
గేమ్ ఛేంజర్ సినిమా విషయానికి వస్తే ఇందులో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. శ్రీకాంత్, అంజలి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఎస్‌జే సూర్య విలన్‌గా నటిస్తున్నాడు. తమన్ సంగీతం అందించాడు. ఈ చిత్రంలో కేవలం ఐదు పాటల కోసమే ఏకంగా రూ.75 కోట్లు ఖర్చు పెట్టారు. ఓ నిజాయితీ ఐఏఎస్ ఆఫీసర్‌కి, అవినీతి పరుడైన రాజకీయ నాయకుడికి మధ్య జరిగే పోరాటమే గేమ్ ఛేంజర్ కథ.