
సూపర్‌స్టార్ రజనీకాంత్ జీవితాన్ని ఒక సినిమాగా తెరకెక్కిస్తే బ్లాక్‌బస్టర్ సినిమా అని చెప్పవచ్చు. తలైవా గతం అంతా కష్టాలతోనే నిండి ఉందని అందరికీ తెలుసు.. ఎన్నో ఆటుపోట్లతో పాటు అవమానాలు భరించి నేడు ఆయన ఈ స్థానంలో ఉన్నారు. బస్ కండక్టర్గా, కార్పెంటర్ గా కూడా పనిచేశారు. రజనీకాంత్ నటించిన కొత్త సినిమా 'కూలీ' విడుదల సందర్భంగా జరిగిన కార్యక్రమంలో తన గతాన్ని ఒక్కసారి గుర్తుచేసుకున్నారు. తన కుటుంబం కోసం ఒకసారి కూలీగా లగేజ్ మోయాల్సి వచ్చిందని, తాను ఎదుర్కొన్న హేళనను గుర్తుచేసుకున్నారు.
సినీ పరిశ్రమకు రాకముందు తాను కూలీగా కూడా పనిచేశానని రజనీకాంత్ గుర్తుచేసుకున్నారు. 'కాలేజీ రోజులు పూర్తి అయిన తర్వాత ఒకరోజు నేను రోడ్డుపై ఉండగా.. అటుగా వెళ్తున్న ఒక వ్యక్తి పిలిచాడు. తన లగేజ్ను కారు వరకు తీసుకెళ్తావా అని అడిగాడు. దీంతో నేను కూడా సరేనన్నాను. అతని మాటలు నాకు చాలా పరిచయంగా ఉన్నట్లు అనిపించింది. కొంత సమయం తర్వాత మేమిద్దరం ఒకే కాలేజీలో చదువుకున్నట్లు అర్థం అయింది. కాలేజీ రోజుల్లో అతన్ని సరదాగా ఏడ్పించేవాడిని. అయితే, లగేజ్ను కారు వద్దకు తీసుకెళ్లిన తర్వాత అతడు రూ. 2 చేతిలో పెడుతూ ఒక మాటన్నాడు. మనం చదువుకుంటున్న రోజుల్లో నీకు చాలా అహంకారం ఉండేదన్నాడు. అంత అహంకారంతో ఎవరూ ఉండేవారు కాదన్నాడు.. ఆపై నీకు ఆరోజులు గుర్తుకున్నాయా..? అన్నాడు. దీంతో మొదటిసారి జీవితంలో ఏడ్చాను. నేను కూలీగా ఉన్నప్పుడు చాలాసార్లు ఇలాంటి అవమానాలు ఎదుర్కొన్నాను.
నేను జీవించడానికి అలాంటి చిన్న చిన్న పనులు ఎన్నో చేశాను. నేను పేద కుటుంబంలో పుట్టాను కాబట్టి ఇదంతా చేశాను. పేదరికం అంటే ఏమిటో నాకు మాత్రమే తెలుసు.. దానిని చూడటం, వివనడం ద్వారా కాదు. అనుభవించడం ద్వారానే తెలుసుకున్నాను.' అని పేర్కొన్నారు. ఒకప్పుడు డబ్బు కష్టాల వల్ల కార్పెంటర్గా, బస్ కండక్టర్గా రజనీ పనిచేశారు. జీవితంలో ఎదురయ్యే కష్టాలు, నిరాశల వల్ల తీవ్రంగా బాధపడ్డారు. ఒకసారి ఆత్మహత్య చేసుకోవాలని కూడా రజనీ నిర్ణయించుకున్నారట, అయితే, తనకు రాఘవేంద్ర స్వామికి సంబంధించిన పెయింటింగ్ ఒకటి కనిపించడం.. అందరూ అక్కడ నమస్కరించి వెళ్తుండటంతో తనలోని ఆధ్యాత్మిక మార్పుకు తొలి అడుగు అక్కడే పడిందట. దీంతో ఆయన జీవితం మలుపు తిరిగిందని రజనీ చెప్పుకొచ్చారు.