
రజనీకాంత్(Rajinikanth) హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం కూలీ. ఈ సినిమాను లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో నాగార్జున, ఉపేంద్ర, శ్రుతీహాసన్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. రజనీకాంత్ కెరీర్‌లో ఇది 171వ చిత్రంగా నిలవనుంది. లియో చిత్రం తర్వాత లోకేష్ కనగరాజ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీని రూ. 350 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.
ఈ మూవీ బడ్జెట్‌తో పాటు తలైవా రజినీకాంత్ పారితోషికం సైతం భారీగానే ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా కోలీవుడ్‌లో వినిపిస్తోన్న టాక్ ప్రకారం ఆయనకు ఏకంగా రూ.150 కోట్ల రెమ్యునరేషన్ ఇవ్వనున్నట్లు సమాచారం. దీంతో రజినీకాంత్ కెరీర్‌లో కూలీ మూవీ అత్యధిక పారితోషికం చెల్లించిన చిత్రాల్లో ఒకటిగా నిలవనుంది. అంతేకాకుండా ఈ చిత్రానికి డైరెక్టర్ కనగరాజ్ సైతం రూ.50 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నట్లు ఓ నివేదికలో వెల్లడైంది. మిగిలిన రూ.150 కోట్లతో సినిమా బడ్జెట్, ఇతర నటీనటులకు ఖర్చు చేయనున్నారు. ఇది కాకుండా నిర్మాతలు పబ్లిసిటీ కోసం దాదాపు రూ. 25 కోట్లు పక్కన పెట్టారని సమాచారం. ఇవన్నీ కలిపితే కూలీ బడ్జెట్ రూ.375 పైగానే ఉండనుంది.
భారీ ధరకు కూలీ ఓటీటీ రైట్స్..
ఈ చిత్రానికి సంబంధించిన డిజిటల్ రైట్స్ ను ఇప్పటికే ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోస్ భారీ ధరకు కొనుగోలు చేసినట్లు సమాచారం. అమెజాన్ ప్రైమ్ వీడియో రూ.120 కోట్లకు ఓటీటీ రైట్స్ కొనుగోలు చేసినట్లు కోలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు శాటిలైట్ హక్కులు రూ. 90 కోట్లు, మ్యూజిక్ రైట్స్ రూ. 20 కోట్లకు అమ్ముడైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే నాన్-థియేట్రికల్ బిజినెస్ రూ. 240 కోట్లకు చేరుకుంది. ఈ సినిమా ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా తమిళం, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల కానుంది. ఈ మూవీ తర్వాత రజనీకాంత్ నెల్సన్ దిలీప్‌కుమార్‌తో 'జైలర్ 2లో నటించనున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది థియేటర్లలో విడుదల కానుంది.