బాలకృష్ణ, బోయపాటి శ్రీను హిట్ కాంబినేషన్‌లో తెరకెక్కిన సినిమా ‘అఖండ 2’ విడుదలపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ ప్రభావం చిన్న సినిమాలపై పడనుంది. డిసెంబర్ నెలలో మోగ్లీ, శంబాల, ఛాంపియన్ వంటి చిన్న సినిమాలు ఉన్నాయి. వీటితో పాటుగా అఖండ బరిలోకి దిగితే నష్టపోయేది ఆయా నిర్మాతలే.. అయితే, తాజాగా అఖండ2 గురించి ప్రముఖ నిర్మాత విశ్వ ప్రసాద్ స్పందించారు.
అఖండ వాయిదా.. దురదృష్టకరం
విడుదలకు ముందు సినిమాలు ఆగిపోవడం దురదృష్టకరమని విశ్వ ప్రసాద్ ఆవేదన చెందారు. 'కొన్ని గంటల్లో సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న సమయంలో ఇలా ఆగిపోవడం చాలా బాధాకరం. ఇలాంటి సమస్య వచ్చినప్పుడు పరిశ్రమలోని ఇతర వ్యక్తులపై ప్రభావం చూపడం మరింత దురదృష్టకరం. పెద్ద సినిమాల విడుదల తేదీలను దృష్టిలో ఉంచుకుని చిన్న సినిమా నిర్మాతలు తమ సినిమాలను రిలీజ్ చేయాలని ప్లాన్ వేసుకుంటారు. కానీ, ఇలా చివరి నిమిషంలో విడుదలకు అంతరాయం కలిగించడానికి ప్రయత్నించడం నన్ను చాలా కలవరపెట్టింది.
ఇటువంటి చర్యలను అందరూ ఖండించాలి. ఇలా అర్థాంతరంగా వాయిదా వేయడం అనేది నిర్మాతలతో పాటు డిస్ట్రిబ్యూటర్స్, సాంకేతిక నిపుణులు ఈ వ్యవస్థలోని వేలాది మంది జీవనోపాధిపై కూడా ప్రభావితం చూపుతుంది. ఫైనాన్స్ చేసే వారు ఇలా చివరి నిమిషంలో అంతరాయం కలిగించకుండా ఏదైనా స్పష్టమైన చట్టపరమైన మార్గదర్శకాలను రూపొందించడం చాలా అవసరం. భవిష్యత్తులో ఇలాంటివి మళ్లీ జరగకుండా తగిన చట్టపరమైన చర్యలను వాటాదారులు కూడా రూపొందించాల్సి వుంటుంది. ఒక సినిమా విషయంలో ఎలాంటి సమస్యలు ఉన్న సరే ముందుగానే వాటిని క్లియర్ చేసుకోవాల్సిన బాధ్యత ఇరువురిపై ఉంది. అన్ని సమస్యలు దాటుకొని అఖండ 2 పెద్ద ఎత్తున విడుదల కావాలని ఎదురుచూస్తున్నాము’ అని ట్వీట్ చేశారు.
రాజాసాబ్.. వడ్డీతో సహా క్లియర్ చేస్తాం
రాజాసాబ్ విడుదల చుట్టూ అనేక ఊహాగానాలు ఉన్నాయని నిర్మాత విశ్వ ప్రసాద్ అన్నారు. అనుకున్న సమయానికే సినిమా ఉంటుందన్నారు. రాజాసాబ్ కోసం సేకరించిన పెట్టుబడులన్నీ అంతర్గత నిధుల ద్వారా పూర్తిగా క్లియర్ చేయబడతాయని ఆయన తెలిపారు. పెట్టుబడికి సంబంధించిన వడ్డీ కూడా త్వరలోనే క్లియర్ అవుతుందన్నారు. సినిమా వ్యాపారం ప్రారంభించగానే ఇవన్నీ క్లియర్ చేయబడుతాయని ఆయన అన్నారు. ప్రభాస్- మారుతి కాంబినేషన్ సినిమా రాజాసాబ్ జనవరి 9న విడుదల కానున్న విషయం తెలిసిందే.


