
బాలీవుడ్లో ఎప్పుడు వివాదాల్లో ఉన్న జంట ఎవరైనా ఉన్నారంటే వాళ్లే. ఆ కపుల్ మరెవరో కాదు.. బాలీవుడ్ భామ శిల్పాశెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రా. గతంలో ఓ కేసుతో సంచలనంగా మారిన రాజ్ కుంద్రా.. మరో కేసులో చిక్కుకున్నారు. తనను రూ.60 కోట్ల మోసం చేశారంటూ రాజ్ కుంద్రా, శిల్పాశెట్టిపై ఓ వ్యాపారవేత్త ఫిర్యాదు చేశారు. దీంతో ముంబయి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అయితే ఇటీవల రాజ్ కుంద్రా, శిల్పా శెట్టి కలిసి ప్రేమానంద్ మహారాజ్ ఆశ్రమాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆధ్యాత్మిక గురువైన ప్రేమానంద్ మహారాజ్‌కు ఏకంగా తన కిడ్నీని దానం చేస్తానని రాజ్ కుంద్రా మాటిచ్చారు. ఇది విని అక్కడున్న వారంతా ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ వీడియోను ప్రేమానంద్ భజన్ మార్గ్ యూట్యూబ్ ఛానెల్‌లో పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా రాజ్ కుంద్రాకు ప్రేమానంద్ ధన్యవాదాలు తెలిపారు. మథురలోని ప్రేమానంద్ మహారాజ్ ఆశ్రమాన్ని శిల్పాశెట్టి దంపతులు సందర్శించిన వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్గా మారింది. వ్యాపారవేత్తను రూ.60 కోట్ల మోసం చేశారనే ఆరోపణలు వచ్చిన సమయంలో ఈ వీడియో బయటకి రావడం విశేషం.
రాజ్ కుంద్రా మాట్లాడుతూ.. 'నేను గత రెండేళ్లుగా మిమ్మల్ని అనుసరిస్తున్నా. నాకు ఏవైనా సందేహాలు, భయాలకు మీ వీడియోలు ఎల్లప్పుడూ సమాధానం ఇస్తాయి. ఇప్పుడు నాకు ఎటువంటి ప్రశ్నలు లేవు. మీరు అందరికీ ప్రేరణ. మీ ఆరోగ్య పరిస్థితి గురించి నాకు తెలుసు. అందుకే నేను సహాయం చేయగలిగితే నా రెండు కిడ్నీలలో ఒకటి మీదే." అని అన్నారు.
అయితే ప్రేమానంద్ మహారాజ్‌కు రెండు కిడ్నీలు చెడిపోయినట్లు తెలుస్తోంది. గత పదేళ్లుగా ఈ వ్యాధితో బాధపడుతున్నారని సమాచారం. ఈ విషయం తెలుసుకున్న రాజ్ కుంద్రా కిడ్నీ ఆఫర్ చేశారు. ఈ నిర్ణయం శిల్పాశెట్టిని ఆశ్చర్యానికి గురిచేసింది.