Raghava Lawrence: నా జీవితంలో ఆ ముగ్గుర్నీ ఎప్పుడూ మర్చిపోను

Raghava Lawrence Comments On Rajinikanth And Chiranjeevi - Sakshi

రాఘవ లారెన్స్ హీరోగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా ర‌నౌత్ టైటిల్ పాత్ర‌లో న‌టించిన భారీ బ‌డ్జెట్ మూవీ 'చంద్రముఖి 2'. లైకా ప్రొడక్షన్స్ భారీ ఎత్తున నిర్మించిన ఈ చిత్రానికి పి. వాసు దర్శకత్వం వహించారు. రజనీకాంత్‌ హిట్‌ చిత్రం 'చంద్రముఖి'కి సీక్వెల్‌గా సెప్టెంబర్‌ 28న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని జె.ఆర్‌.సి. కన్వెన్షన్స్‌లో ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను మేకర్స్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. ప్రభాస్‌  'రెబల్‌' తర్వాత తెలుగులో మరో సినిమాను డైరెక్ట్‌ చేయడం కుదర్లేదని. 'చంద్రముఖి 2' ద్వారా తెలుగు ప్రేక్షకులు, అభిమానులను కలుసుకుంటుంన్నందుకు సంతోషంగా ఉందని లారెన్స్‌ చెప్పాడు.

(ఇదీ చదవండి: ఆ సంఘటనతో బాడీగార్డ్‌ కావాలని అనుకున్నా: శృతిహాసన్‌)

ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బుతో టికెట్‌ కొనుక్కుని సినిమా చూస్తున్నారు. అంతేకాకుండా తమ నుంచి ఏం ఆశించకుండానే అభిమానం చూపిస్తారని ఫ్యాన్స్‌ గురించి లారెన్స్‌ తెలిపాడు. అభిమానుల ప్రేమలోనే తాను దేవుణ్ని చూస్తున్నానని ఆయన పేర్కొన్నాడు. తాను చాలామంది హీరోలకు కొరియోగ్రఫీలో డ్యాన్స్‌ చేశాను.. ఆ హీరోలందరి ఫ్యాన్స్‌ కూడా తనను కూడా అభిమానించడం చాలా ఆనందాన్ని ఇస్తుందని ఆయన తెలిపాడు. తనకు అలాంటి అవకాశం ఇచ్చిన హీరోలందరికీ ధన్యవాదాలు అని లారెన్స్‌ చెప్పాడు.

'వాసుగారు 'చంద్రముఖి2' మూవీ చేస్తున్నామ‌ని అనౌన్స్ చేయ‌గానే రజినీకాంత్‌గారితో చేస్తున్నారేమోనని అనుకున్నా. తర్వాత డైరెక్టర్‌ నాకు కథ చెప్పగానే రజనీకాంత్‌కు ఫోన్‌ చేశాను. 'అన్నయ్యా.. చంద్రముఖి- 2 సినిమా చేస్తున్నా' అని చెప్పగానే ఆయన ఎంతో సంతోషంతో ఆల్‌ ది బెస్ట్‌ చెప్పారు. అంతే కాకుండా రాఘవేంద్ర స్వామీ ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయని చెప్పారు. దీంతో ఆయనకు ధన్యవాదాలు చెబుతున్నా.  ఆయన లేకపోతే నేనీ వేదికపై ఉండేవాడినే కాదు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఇంతమంది అభిమానులను సొంతం చేసుకున్నానంటే దానికి ప్రధాన కారణం చిరంజీవి అన్నయ్య. ఆయన నుంచే నేను డ్యాన్స్‌ నేర్చుకున్నా.. నన్ను డైరెక్టర్‌ని చేసిన నాగార్జునను ఎప్పటికీ మరిచిపోను.

ఇక కంగ‌నా ర‌నౌత్ వంటి పెద్ద స్టార్‌తో న‌టించ‌టం నేను ఎంతో ల‌క్కీ. ఆమె సెట్స్‌లోకి అడుగు పెట్ట‌గానే ఆమెకున్న సెక్యూరిటీని చూసి భ‌య‌ప‌డ్డాను. ఆ విష‌యం ఆమెకు చెప్ప‌గానే ఆమె సెక్యూరిటీని బ‌య‌ట‌కు పంపేశారు. తర్వాత చ‌క్క‌గా ఇద్దరం కలిసిపోయి న‌టించాం. చంద్ర‌ముఖి పాత్ర‌లో ఆమె ఎంతగానో భ‌య‌పెట్టారు. వాసుగారితో ఇది వ‌ర‌కు శివ‌లింగ అనే సినిమా చేశాను. ఆ సినిమాకు పూర్తి భిన్నంగా 'చంద్రముఖి2' చేశాం.' అని లారెన్స్‌ చెప్పారు.

కంగ‌నా ర‌నౌత్ కీలక వ్యాఖ్యలు
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగ‌నా ర‌నౌత్ మాట్లాడుతూ 'నేను గతంలో ద‌క్షిణాదిన సినిమాలు చేశాను. తెలుగులో ఏక్ నిరంజ‌న్, తలైవి వంటి సినిమాల్లో న‌టించాను. ఇప్పుడు మ‌రోసారి తెలుగు ప్రేక్ష‌కుల‌ను 'చంద్రముఖి2'తో మీ ముందుకు వస్తున్నా. ఈ మూవీలో చంద్ర‌ముఖి పాత్ర తెలుగులో మాట్లాడుతుంది. వాసుగారు ఓ వారియ‌ర్ సినిమా చేయాల‌ని నా ద‌గ్గరకు వ‌చ్చిన‌ప్పుడు నేను చంద్ర‌ముఖి 2లో చంద్ర‌ముఖిగా ఎవ‌రు న‌టిస్తున్నార‌ని అడిగాను. ఇంకా ఎవ‌రినీ తీసుకోలేద‌ని చెప్పడంతో. నేను న‌టిస్తాన‌ని అడ‌గ్గానే ఆయ‌న వెంట‌నే ఒప్పుకున్నారు. అలా ఈ ప్రాజెక్ట్‌లోకి అడుగు పెట్టాను.' అని ఆమె చెప్పింది

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top