
కేంద్ర ప్రభుత్వం.. మూడు రోజుల క్రితం నేషనల్ మూవీ అవార్డ్స్ ప్రకటించింది. తెలుగు చిత్రసీమకు పలు అవార్డులు దక్కాయి. అయితే ఉత్తమ నటుడిగా 'జవాన్' చిత్రానికిగానూ షారుక్ ఖాన్ ఎంపికవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. విక్రాంత్ మస్సేతో (12th ఫెయిల్) పాటు షారుక్‌కి సంయుక్తంగా ఇచ్చారు. చాలామంది మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్‌కి వస్తుందని అంచనా వేశారు. కానీ అలా జరగలేదు. ఈ విషయమై విమర్శలు వస్తున్నాయి. దీంతో జ్యూరీ మెంబర్ ప్రదీప్ నాయర్ స్పందించారు. అసలు ఏం జరిగిందో చెప్పుకొచ్చారు.
(ఇదీ చదవండి: మెగా కోడలు ఉపాసనకు తెలంగాణ సర్కారు కీలక బాధ్యతలు)
'పృథ్వీరాజ్ సుకుమారన్(ఆడు జీవితం)కి బెస్ట్ యాక్టర్ ఇవ్వాలని నేను ప్రతిపాదించాను. గోవాలో జరిగిన ఫిలిం ఫెస్టివల్‌లోనూ ఈ సినిమాని కమిటీ ఛైర్ పర్సన్ అశుతోష్ కూడా చూశారు. కానీ ఆయన ఇందులో సామాజిక అంశం లేదని, పృథ్వీరాజ్ నటనలో సహజత్వం లేదని నాతో అన్నారు. అప్పుడు నాకేం చెప్పాలో అర్థం కాలేదు. అందుకే ఈ చిత్రానికి జాతీయ సినిమా అవార్డ్ ఇవ్వలేదు' అని జ్యూరీ మెంబర్ ప్రదీప్ నాయర్ చెప్పారు.
అలానే 'ద కేరళ స్టోరీ' చిత్రానికి అవార్డ్ రావడంపైనా ప్రదీప్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ విషయాన్ని కూడా బయటపెట్టారు. 'ప్యానెల్‌లో ద కేరళ స్టోరీ చిత్రానికి అవార్డ్ ఇవ్వడంపై నేను అభ్యంతరం చెప్పాను. ఓ రాష్ట్రాన్ని కించపరిచేలా తీసిన సినిమాకు జాతీయ అవార్డ్ ఎలా ఇస్తారని ప్రశ్నించాను. జ్యూరీ ఛైర్ పర్సన్‌కి నా అభిప్రాయం చెప్పాను. కానీ నేను చెప్పిన మాటల్ని వాళ్లు లెక్కలోకి తీసుకోలేదు. ఈ మూవీలో వివాదాస్పద అంశాలున్నాయని, ఓ ఉద్దేశంతో తీశారని నా అభిప్రాయం చెప్పాను. కానీ వాళ్లు దీన్ని ఓ సామాజిక సమస్యగా చూశారు' అని ప్రదీప్ నాయర్ అసహనం వ్యక్తం చేశారు.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు)