Prabhas: ప్రభాస్‌ పేరుతో రూ.4 వేల కోట్ల దందా!

Prabhas Upcoming Movies Do 4000 Crore Business, Check Here - Sakshi

`బాహుబలి` తర్వాత ప్రభాస్‌ రేంజ్‌ మారిపోయింది. పాన్‌ ఇండియా స్టార్‌గా మారాడు. ప్రస్తుతం ఇండియాలోనే మోస్ట్‌ బిజియెస్ట్‌ హీరో ప్రభాస్‌. సినిమా ఫలితంతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. ప్రస్తుతం ఆయన చేతిలో నాలుగు భారీ సినిమాలు ఉన్నాయి. వాటిలో ఆదిపురుష్‌, సలార్‌ చిత్రాలు షూటింగ్‌ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ప్రాజెక్ట్‌ కే, సూపర్‌ డీలక్స్‌(ప్రచారంలో ఉన్న టైటిల్‌) చిత్రాలు సెట్స్‌పై ఉన్నాయి. ఈ నాలుగు చిత్రాలతో ప్రభాస్‌ దాదాపు రూ.4 వేట కోట్ల బిజినెస్‌ జరిగే అవకాశం ఉందని ట్రేడ్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

(చదవండి: కస్టడీ’కి ఊహించని కలెక్షన్స్‌, ఎంతంటే.. )

ఓ రౌత్‌ తెరకెక్కిస్తున్న ఆదిపురుష్‌ సినిమా బడ్జెట్‌ రూ.450 కోట్లు. రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా ట్రైలర్‌ ఇటీవల విడుదలై.. మంచి టాక్‌ని సంపాదించుకుంది. సినిమాకు హిట్‌ టాక్‌ లభిస్తే ఈజీగా రూ. 8 వందల నుంచి రూ.1000 కోట్ల వరకు బిజినెస్‌ చేస్తుందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. ‘కేజీయఫ్‌’ ఫేం ప్రశాంత్‌ నీల్‌ తెరకెక్కిస్తున్న ‘సలార్‌’పై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. దాదాపు రూ. 350 కోట్ల బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రం రూ. 800-1000 కోట్ల వరకు బిజినెస్‌ చేసే అవకాశం ఉంది.

ఇక ప్రభాస్‌ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న పాన్‌ వరల్డ్‌ మూవీ ప్రాజెక్ట్‌ కే.  నాగ్‌ అశ్విన్‌  ఈ చిత్రాన్ని భారీ యాక్షన్‌ సైన్స్ ఫిక్షన్‌గా రూపొందిస్తున్నారు. ఈ చిత్రం బడ్జెట్‌ రూ.500 కోట్లు. ప్రపంచ వ్యాప్తంగా అన్ని భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేసే అవకాశం ఉంది.రూ.2000 కోట్లను కలెక్షన్ల టార్గెట్‌తో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక వీటితో పాటు ఓ చిన్న సినిమాలోనూ ప్రభాస్‌ నటిస్తున్నాడు.

మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి సూపర్‌ డీలక్స్‌ అనే టైటిల్‌ ప్రచారంలో ఉంది. ఈ మూవీ బడ్జెట్‌ రూ.200-300 కోట్లు. రూ. 500 కోట్ల కలెక్షన్ల టార్గెట్‌తో ఈ చిత్రం రాబోతుంది. ఇలా మొత్తంగా ప్రభాస్ పేరుతో చిత్ర పరిశ్రమలో రూ. 4000 కోట్ల బిజినెస్‌ జరుతుందట. ప్రస్తుతం టాలీవుడ్‌లో జరుగుతున్న వ్యాపారంలో దాదాపు సగం వరకు ప్రభాస్‌ పేరుతోనే జరగడం గమనార్హం. 

(చదవండి: రాజకీయాల్లోకి రీఎంట్రీ? కన్‌ఫర్మ్‌ చేసిన బండ్ల గణేశ్‌ )

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top