Por Thozhil Telugu Movie Review And Rating - Sakshi
Sakshi News home page

Por Thozhil Review Telugu: 'పోర్ తొళిల్' మూవీ రివ్యూ

Published Fri, Aug 11 2023 1:15 PM

Por Thozhil Movie Review And Rating Telugu - Sakshi

టైటిల్‌: పోర్ తొళిల్
నటీనటులు: శరత్ కుమార్, అశోక్ సెల్వన్, నిఖిలా విమల్, శరత్‌బాబు తదితరులు
నిర్మాతలు: సమీర్ నాయర్, దీపక్ సెహగల్, ముఖేష్ మెహతా, సీవీ శరత్, పూనమ్ మెహ్రా, సందీప్ మెహ్రా
దర్శకుడు: విఘ్నేశ్ రాజా
సంగీతం: జేక్స్ బెజోయ్
ఎడిటర్‌: శ్రీజిత్ సరంగ్
సినిమాటోగ్రఫీ: కాలైసెల్వన్ శివాజీ
విడుదల తేది: 2023 ఆగస్టు 11 (సోనీ లివ్)

థ్రిల్లర్ సినిమాలకు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంటుంది. కరెక్ట్‌గా తీయాలే గానీ అద్భుతమైన రెస్పాన్స్ అందుకుంటుంది. అలా కొన్నాళ్ల ముందు తమిళంలో విడుదలైన 'పోర్ తొళిల్' సినిమా అక్కడ సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇప్పుడు ఓటీటీలో వచ్చేసింది. సోనీ లివ్‌లో తెలుగులోనూ అందుబాటులో ఉంది. మర్డర్ మిస్టరీ స్టోరీకి తోడు సస్పెన్స్, థ్రిల్ ఎలిమెంట్స్‌తో తీసిన ఈ సినిమా ఎలా ఉంది? ఏంటనేది రివ్యూలో చూద్దాం.

(ఇదీ చదవండి: Jailer Movie Review: 'జైలర్' సినిమా రివ్యూ)

కథేంటి?
క్రైమ్ బ్రాంచ్‌లో ఎస్పీ లోకనాథన్ (శరత్ కుమార్) స్ట్రిక్ట్ ఆఫీసర్. ఇతడి దగ్గర డీఎస్పీ ట్రైనీగా పనిచేసేందుకు ప్రకాశ్(అశోక్ సెల్వన్) వస్తాడు. టెక్నికల్ అసిస్టెంట్ వీణ(నిఖిలా విమల్) కూడా ఉంటుంది. తిరుచ్చిలో జరిగిన ఓ మర్డర్ కేసు విచారణ బాధ్యత ఈ ముగ్గురికి అప్పగిస్తారు. దీన‍్ని దర్యాప్తు చేస్తున్న క్రమంలో వరుస హత్యలు జరుగుతుంటాయి. చివరకు లోకనాథన్, ప్రకాశ్, వీణ... హంతకుడిని పట్టుకున్నారా? వాళ్లకు ఎదురైన పరిస్థితులు ఏంటి? చివరకు ఏం జరిగిందనేదే 'పోర్ తొళిల్' స్టోరీ.

ఎలా ఉందంటే?
థ్రిల్లర్ సినిమా ఏదైనా సరే దాదాపుగా రెండే అంశాలు ఉంటాయి. ఎవరు చేస్తున్నారు? ఎందుకు చేస్తున్నారు? వీటిలో ఏదో ఓ పాయింట్ ఆధారంగానే దాదాపు అన్ని మూవీస్ తీస్తుంటారు. 'పోర్ తొళిల్'కి కూడా అదే ఫార్ములా ఉపయోగించారు. అయితే మిగతా వాటికి దీనికి తేడా ఏంటంటే థ్రిల్. మూవీ చూస్తున్నంతసేపు మనకు అన్నీ తెలుసని అనుకుంటాం. కానీ ఏదో ఓ కొత్త ట్విస్ట్ మనల్ని ఆశ్చర్యపరుస్తూ ఉంటుంది. ఈ సినిమాలో మ్యాజిక్ అదే.

ఫస్టాప్ విషయానికొస్తే.. రాత్రిపూట గస్తీ కాస్తున్న పోలీసులకు ఓ చోట యువతి శవం కనిపిస్తుంది. అలా ఫస్ట్ సీన్‌తోనే దర్శకుడు నేరుగా పాయింట్‪‌లోకి తీసుకెళ్లిపోయాడు.  అనంతరం ఎస్పీ లోకనాథన్, ట్రైనీ డీఎస్పీ ప్రకాశ్ పాత్రల పరిచయం. మనస్తత్వాలు డిఫరెంట్‌గా ఉండే ఈ ఇద్దరు కలిసి, ఓ మర్డర్‌ కేసు దర్యాప్తు చేయడం, ఈ క్రమంలోనే వీళ్లకు ఆధారాలు ఒక్కొక్కటిగా దొరకడం.. ఇలా స్టోరీ చకచకా పరుగెడుతూ ఉంటుంది. ఇంటర్వెల్ వరకు ఓ టెంపోలో సాగిన సినిమా.. సెకండాఫ్‌లో మాత్రం మంచి ట్విస్టులతో మరో రేంజుకి వెళ్లింది. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్‌ని మంచి థ్రిల్ ఇచ్చే సీన్స్‌తో ఎండ్ చేయడం బాగుంది. 

ఓవైపు లోకనాథన్, ప్రకాశ్... మర్డర్ కేసు దర్యాప్తు చేస్తుండగానే వరుస హత్యలు జరుగుతుంటాయి. ఇక్కడ డైరెక్టర్ రాసుకున్న సీన్స్ అన్నీ కూడా సాధారణ ప్రేక్షకుడికి క్లియర్‌గా అర్థమయ్యేలా ఉంటాయి. ఫీల్డ్ ట్రైనింగ్, హత్య ఎలా జరిగిందో వివరించడం లాంటి సన్నివేశాలు చూస్తుంటే మనం అక్కడే ఉన్నామనే ఫీలింగ్ కలుగుతుంది. అదే సమయంలో ప్రకాశ్ అమాయకత్వంతో సింపుల్ కామెడీ మనల్ని నవ్విస్తుంది. సీన్స్ అన్నింటికీ క్లైమాక్స్‌కి లింక్ చేసిన విధానం బాగుంది. ఇదేదో క్రైమ్ థ్రిల్లర్ అని కాకుండా చివర్లో ఓ సందేశం ఇచ్చారు. అయితే అది చూసిన తర్వాత నిజంగానే మనుషులు ఆ ఒక్క విషయం వల్ల సైకో కిల్లర్స్‌లా మారతారా అనే డౌట్ వస్తుంది.

ఎవరెలా చేశారు?
ఈ సినిమాలో కనిపించే పాత్రలు చాలా తక్కువ. కాకపోతే ప్రతి ఒక్కరినీ దర్శకుడు బాగా వాడుకున్నాడు. ఎస్పీ లోకనాథన్‌గా శరత్ కుమార్, ట్రైనీ డీఎస్పీ ప్రకాశ్‌గా అశోక్ సెల‍్వన్ సెటిల్డ్ ఫెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ప్రకాశ్ పాత్ర మొదట భయస్తుడిగా కనిపిస్తుంది. క్లైమాక్స్ వచ్చేసరికి మారిపోతుంది. వీణగా నిఖిల్ విమల్ బాగానే చేసింది. ఈ పాత్రకు పెద్దగా స్కోప్ లేదనుకుంటాం. కానీ మూవీ చివరకొచ్చేసరికి ఈమె పాత్రకు ఉన్న ప్రాధాన్యం అర్థమవుతుంది. కెన్నడీగా శరత్‌బాబు రోల్ అస్సలు ఊహించని విధంగా ఉంటుంది. మిగతా పాత్రలు చేసిన యాక్టర్స్ పర్వాలేదనిపించారు.

'పోర్ తొళిల్' సినిమా టెక్నికల్‌గా అద్భుతంగా ఉంది. రైటింగ్, సినిమాటోగ్రఫీ, మ్యూజిక్.. ఇలా ప్రతిఒక్కరూ బెస్ట్ అవుట్‌పుట్ ఇచ్చారు. రైటర్ ఆల్ఫ్రెడ్ ప్రకాశ్, దర్శకుడు విఘ్నేశ్ రాజాతో కలిసి మంచి థ్రిల్లర్‌ని ప్రేక్షకులకు అందించారు. హీరోహీరోయిన్లు ఉన్నారు కదా అని లవ్ ట్రాక్ లాంటి వాటి జోలికి పోకుండా దర్శకుడు మంచి పనిచేశాడు. క్లైమాక్స్‌లో సీక్వెల్ ఉంటుందనే హింట్ ఇచ్చారు. ఓవరాల్‌గా చెప్పుకుంటే ఈ వీకెండ్ ఏదైనా మంచి సినిమా చూద్దామనుకుంటే 'పోర్ తొళిల్' బెస్ట్ ఆప్షన్.

- చందు డొంకాన, సాక్షి వెబ్ డెస్క్

(ఇదీ చదవండి: ‘భోళా శంకర్‌’ మూవీ రివ్యూ)

Rating:
Advertisement
 
Advertisement
 
Advertisement