బ్యాన్‌ చేసిన వారే ఆమె టాలెంట్‌కు నివ్వెరపోయారు | Sakshi
Sakshi News home page

ఆమెను బ్యాన్‌ చేసిన వారే విమాన టికెట్లు ఇచ్చి కేన్స్‌కు పంపారు

Published Sun, May 26 2024 10:53 AM

Payal Kapadia Achieves Cannes Grand Prix Award

డైరెక్టర్‌ పాయల్‌ కపాడియా... భారతీయ సినిమా గొప్పతనాన్ని కేన్స్‌ వేదికగా ప్రపంచానికి చాటి చెప్పింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న నటులందరూ అక్కడ అడుగుపెడితే చాలు అనుకుంటే భారత్‌కు చెందిన పాయల్‌ కపాడియా తన ప్రతిభతో అత్యుత్తమ అవార్డును సొంతం చేసుకుంది. 77వ కేన్స్‌ చలన చిత్రోత్సవంలో పాయల్‌ కపాడియా రూపొందించిన భారతీయ చిత్రం 'ఆల్‌ వి ఇమాజిన్‌ యాజ్‌ లైట్‌' రికార్డ్‌ క్రియేట్‌ చేసింది. ఈ సినిమా ద్వారా అత్యున్నత పురస్కారమైన 'గ్రాండ్‌ ప్రిక్స్‌'ను తాజాగా ఆమె సొంతం చేసుకుంది. ఇప్పటి వరకు ఏ భారతీయ సినిమా కూడా ఈ అవార్డును దక్కించుకోలేదు. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత ఓ భారతీయ చిత్రం కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ కాంపిటీషన్‌లో నిలిచి అవార్డ్‌ దక్కించుకోవడంతో ఒక్కసారిగా చప్పట్లతో పాయల్‌ కపాడియాను అభినందించారు.

విద్యాభ్యాసం
ముంబైలో జన్మించిన పాయల్‌ కపాడియా ఆంధ్రప్రదేశ్‌లోని రిషి వ్యాలీ స్కూల్‌లో ఇంటర్‌ వరకు చదివింది. ఆమె ముంబైలోని సెయింట్ జేవియర్స్ కాలేజీ నుంచి ఆర్థికశాస్త్రంలో బ్యాచిలర్ డిగ్రీని పొందింది. ఆమె సోఫియా కాలేజీలో ఒక సంవత్సరం మాస్టర్స్ డిగ్రీ చేసింది. ఆ తర్వాత, ఆమె ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (FTII)లో ఫిల్మ్ డైరెక్షన్‌ కోర్సుని అభ్యసించింది

బ్యాన్‌ చేసిన వారే తన టాలెంట్‌కు ఫిదా అయ్యారు
పాయల్‌ కపాడియాకు చదువుతో పాటు సినిమాలంటే చాలా ఆసక్తి. దీంతో ఆమె డైరెక్టర్‌గా అడుగుపెట్టాలని తపించింది. తన అభిమాన దర్శకులెందరో పుణెలోని ఫిల్మ్‌ అండ్‌ టెలివిజన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా (FTII)లో చదువుకున్నారని తెలిసి అక్కడే చేరాలని ఎంతో కష్టపడి 2015లో సీటు సాధించింది. అయితే ఆమెకు అక్కడ పలు సవాళ్లు ఎదురయ్యాయి. 

కళాశాల ఛైర్మన్‌గా ఉన్న ఒక నటుడు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడం తనకు నచ్చలేదు. దీంతో వారికి వ్యతిరేకంగా పోరాటం చేయడంతో పాటు తరగతులను కూడా బహిష్కరించింది. పాయల్‌ చేసిన పనికి ఆగ్రహించిన FTII ఆమెపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. ఆమెకు వచ్చే  స్కాలర్‌షిప్‌ను కూడా రద్దు చేసింది. వారు ఎన్ని చేసినా ఆమె బెదరలేదు. చివరకు పాయల్‌పై ఎఫ్‌టీఐఐ కేసు కూడా పెట్టింది. నమ్మిన సిద్ధాంతాల కోసం ధైర్యంగా నిలబడింది. వాటిపై పోరాడుతూనే మరోపక్క చిత్ర నిర్మాణ కార్యక్రమాలను కూడా ప్రారంభించింది.

పాయల్‌ను FTII బ్యాన్‌ చేసినా కూడా తన పోరాటం ఆగలేదు. 2017లో ఆమె డైరెక్ట్‌ చేసి షార్ట్‌ఫిల్మ్‌ 'ఆఫ్టర్‌నూన్‌ క్లౌడ్స్‌' కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌కు ఎంపికైంది. అప్పుడు భారత్‌ నుంచి ఎంపికైన ఏకైక చిత్రంగా రికార్డ్‌ క్రియేట్‌ చేసింది. దీంతో ఆమె పేరు ఒక్కసారిగా ప్రపంచానకి తెలిసింది. తర్వాత అదే కళాశాల యాజమాన్యం ఆమె వద్దకు వచ్చింది. ఆమెపై ఉన్న ఆంక్షలను ఎత్తేసింది. ఆ సమయంలో విమాన టికెట్లు సహా ఖర్చులన్నీ విద్యాసంస్థే భరించి కేన్స్‌కు పంపింది.

ఆ తర్వాత 2021లో 'ఏ నైట్‌ ఆఫ్‌ నోయింగ్‌ నథింగ్‌' పేరుతో తీసిన డాక్యుమెంటరీ కూడా కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో అడుగు పెట్టింది. అప్పుడు  'గోల్డెన్‌ ఐ' అవార్డుని సొంతం చేసుకున్న పాయల్‌.. దేశం దృష్టినీ మరోసారి తనవైపు తిప్పుకొంది. ఇప్పటి వరకు ఆమె తీసిన ప్రతి సినిమా కూడా పలు అంతర్జాతీయ వేదికల మీదా అవార్డులను కొల్లగొట్టాయి. తాజాగా 77వ కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ప్రతిష్ఠాత్మక పామ్‌ డి ఓర్‌ స్క్రీనింగ్‌ కాంపిటీషన్‌లో  'ఆల్‌ వి ఇమాజిన్‌ యాజ్‌ లైట్‌' చిత్రం ద్వారా 'గ్రాండ్‌ ప్రిక్స్‌' అవార్డును సొంతం చేసుకుంది. 

30 ఏళ్ల క్రితం 'స్వహం' అనే సినిమా పామ్‌ డి ఓర్‌  స్క్రీనింగ్‌కి ఎంపికైంది. ఆ తర్వాత ఈ పోటీలో నిలిచిన భారతీయ సినిమా ఇదొక్కటే కావడం విశేషం. 34 ఏళ్ల పాయల్‌ జీవితం ఈతరం యువతకు ఆదర్శం. ఆమె డైరెక్ట్‌ చేసిన ప్రతి సినిమాలో కూడా కథకే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ఈతరం అమ్మాయిల కలలు, ఆశయాలను ఆమె ఎంతో సున్నితంగా తెరకెక్కిస్తారు. తాజాగా అవార్డు అందుకున్న 'ఆల్‌ వి ఇమాజిన్‌ యాజ్‌ లైట్‌' చిత్రం కూడా కేరళకు చెందిన ఇద్దరు నర్సులు గురించి చెబుతుంది.

Advertisement
 
Advertisement
 
Advertisement