ప్రేమ గుడ్డిది. రంగు, ఆస్తి, కులమతాలు దానికి కనిపించవు. ఎప్పుడు ఏ రెండు మనసుల్ని కలుపుతుందో దానికే తెలీదు. కానీ, ఎన్నో అవాంతరాలు దాటుకుని ఆ ప్రేమ సుఖాంతం అవడం చాలా కష్టం. ఈ క్రమంలో అది పెట్టే పరీక్షలు, కష్టాలు అనుభవించినవారికే ఎరుక. సిరై సినిమాలో అదే చూపించారు. ఆ మూవీ రివ్యూ ఓసారి చూసేద్దాం...
కథ
విక్రమ్ ప్రభు పోలీస్ కానిస్టేబుల్‌గా నటించాడు. ఓరోజు ఖైదీ అబ్దుల్ (అక్షయ్ కుమార్)ను కోర్టు విచారణకు తీసుకెళ్లే డ్యూటీకి వెళ్తాడు. ఆ సమయంలో ఖైదీ తప్పించుకుంటాడు. దీంతో దగ్గర్లోని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు ఇచ్చేందుకు వెళ్తే అక్కడ ఖైదీ ఉంటాడు. కానీ అతడిని అప్పగించేందుకు ఆ స్టేషన్ హెడ్ ఒప్పుకోడు. పైగా విక్రమ్‌తో పాటు ఉన్న మరో ఇద్దరు కానిస్టేబుల్స్ తాగి ఉన్నాడని గుర్తిస్తాడు. మరి ఖైదీని వీళ్లు విచారణకు తీసుకెళ్లారా? డ్యూటీ సరిగా చేయనందుకు ఎలాంటి పరిణామాలు ఎదుర్కొన్నారు. తప్పించుకున్న నేరస్తుడు మళ్లీ ఎందుకు లొంగిపోయాడు? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే!
ఎలా ఉందంటే?
పోలీస్ డ్యూటీ అంటే ఆషామాషీ ఏం కాదు. ఏమాత్రం పొరపాటు జరిగినా వాళ్ల ఉద్యోగాలు ఊడిపోతాయి. దుండగులు కత్తులతో దాడిచేస్తే ఆత్మరక్షణ కోసం పోలీసులు కాల్పులు జరిపినా ఖైదీలా విచారణకు హాజరవ్వాల్సి ఉంటుంది. అది చూసి మనకే జాలేస్తుంది. ఇక ఖైదీ అబ్దుల్.. చిన్నప్పటినుంచే అతడికో లవ్‌స్టోరీ ఉంది. స్కూల్‌డేస్ నుంచే ఓ అమ్మాయిని ప్రేమిస్తాడు. కానీ మతాలు వేరు.

మనసును కదిలిస్తుంది
అందులోనూ అతడికి తల్లి తప్ప తండ్రి లేడు. ఈ ప్రేమ వర్కవుట్ కాదని అర్థమై ప్రియురాలిని దూరంగా ఉండమని చెప్తాడు. కానీ, ఆమె మాత్రం అతడి చేయి వదలదు. ఓ హత్య కేసులో జైలుకు వెళ్లిన అతడి కోసం ఎంతగానో ఎదురుచూస్తుంది. ఇక్కడ వారి స్వచ్ఛమైన ప్రేమ మనసుల్ని కదిలిస్తుంది. అతడు జైలు నుంచి విడుదలవుతాడునుకున్న సమయంలో ఓ ట్విస్ట్ వస్తుంది.
ఓటీటీలో
అప్పుడు ప్రేక్షకులు కళ్లలో నీళ్లు తిరగడం ఖాయం. దర్శకుడు సురేశ్ రాజకుమారి సిరై సినిమాలో సమాజంలో పెరుగుతోన్న మతవివక్షను, న్యాయస్థానంలో కేసుల విచారణలో జరుగుతున్న నిర్లక్ష్యాన్ని చూపించారు. స్వచ్ఛమైన ప్రేమకథతో మనసును హత్తుకున్నారు. యాక్టర్స్ అందరూ బాగా నటించారు. ఓటీటీ ప్లాట్‌ఫామ్ జీ5లో తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో మాత్రమే అందుబాటులో ఉంది. ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్ ఉన్నాయి. మిస్ అవకుండా చూసేయండి..


