
ఓటీటీలో ఇది చూడొచ్చు అనే ప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో హిందీ చిత్రం డిప్లొమాట్ ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం.
వాస్తవ కథలను సినిమాగా తీయడం ఓ సవాల్ అనే చెప్పాలి. అందులోనూ నిజంగా జరిగిన సున్నిత ఘటనలను సినిమా రూపంలో తీయాలంటే దర్శకుడికి కత్తి మీద సామే. అలాంటి ప్రయత్నమే ‘డిప్లొమాట్’( Diplomat Movie Review ) సినిమాలో చేశారు దర్శకుడు శివమ్ నాయర్. ఈ మూవీ చూస్తున్నంతసేపూ ఆ కథను మనం దగ్గరగా చూస్తున్న అనుభూతి కలుగుతుంది. ఎందుకంటే ఈ సినిమాలో దర్శకుడు నటీనటులతో జీవింపచేశారు. జాన్ అబ్రహాం ప్రధాన పాత్రలో నటించగా సాధియా కతీబ్ మరో పాత్రలో నటించారు. ఇక ఈ సినిమాలో ఏం ఉందో చూద్దాం.
ఇదో యథార్థ గాథ. 2017లో ఉజ్మా అహ్మద్ అనే భారతీయ వివాహితను పాకిస్తాన్‌కు చెందిన తాహిర్ అనే యువకుడు మాయ మాటలతో తమ దేశం రప్పించుకుంటాడు. కేన్సర్ బారిన పడ్డ ఉజ్మా కూతురు వేరే దేశంలో ఉంటుంది. తన కూతురి ఆరోగ్యం కోసం డబ్బులు సంపాదించాలనే ఆలోచనతో తాహిర్ వలలో పడుతుంది ఉజ్మా.
పాకిస్తాన్ వెళ్లాక ఉజ్మాకు అతని అసలు రంగు తెలుస్తుంది. తరువాత తాహిర్ ఆమెపై అత్యాచారం జరిపి, చిత్రహింసలు పెడుతుంటాడు. ఈ దశలో ఆ అమ్మాయి అతని దగ్గర నుండి తప్పించుకుని పాకిస్తాన్‌లోని ఇండియన్ ఎంబసీలోకి శరణార్థిగా ప్రవేశిస్తుంది. అక్కడ ఉన్న ఇండియన్ ఎంబసీ అధికారి అయిన జేపీ సింగ్‌కు తన గోడు వెళ్ళబోసుకుంటుంది.
ఇంతలో తాహిర్ నానా రకాలుగా ఎంబసీలోకి రావడానికి ప్రయత్నించి చివరకు ఉజ్మా మీద, ఇండియన్ ఎంబసీ మీద కేసు పెడతాడు. అక్కడ నుండి కథ పలు మలుపులు తిరిగి, చివర్లో ఉజ్మాను భారతదేశానికి జేపీ సింగ్ ఎలా క్షేమంగా చేర్చాడన్నదే సినిమా. ఇక్కడ ఉజ్మా వల్ల భారత్–పాకిస్తాన్ మధ్య దౌత్యపరమైన ఇబ్బందులు చాలానే వస్తాయి. వాటిని అధిగమించి ఈ భారతదేశ బిడ్డను పాకిస్తాన్ నుండి ఎలా చేర్చాడు అన్నది కళ్ళకు కట్టినట్టు చూపించారు దర్శకుడు.
సినిమా చివర్లో నిజమైన ఉజ్మాతో పాటు అప్పటి ఎంబసీ అధికారిని... వారి చిత్రాలతో చూపించడం చాలా బావుంది. నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమ్ అవుతున్న ఈ ‘డిప్లొమాట్’ నిజంగా సూపర్ థ్రిల్లర్. వర్త్‌ఫుల్ వాచ్ ఫర్ వీకెండ్.
– హరికృష్ణ ఇంటూరు