బాలీవుడ్ భామ, హీరోయిన్ కృతి సనన్ సిస్టర్ నుపుర్ సనన్ ఇటీవలే పెళ్లి చేసుకుంది. తన ప్రియుడైన స్టీబిన్‌ను పెళ్లాడింది ముద్దుగుమ్మ. మొదటి క్రిస్టియన్ సంప్రదాయంతో వివాహం చేసుకున్న బ్యూటీ.. ఆ తర్వాత హిందూ సంప్రదాయంలోనూ గ్రాండ్‌గా పెళ్లి వేడుకను జరుపుకుంది. ఈ పెళ్లిలో ఆదిపురుష్ బ్యూటీ కృతి సనన్ సందడి చేసింది. చెల్లి పెళ్లిలో అన్నీ తానై ముందుండి నడిపించింది.
అయితే వీరిద్దరిదీ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అన్న సంగతి తెలిసిందే. దీంతో పెళ్లికి నుపుర్ సనన్ మదర్ ఒప్పుకోలేదు. ఆమె ససేమిరా అనడంతో కృతి సనన్ రంగంలోకి దిగింది. సిస్టర్ కోసం అమ్మను ఒప్పించి మరీ ఈ పెళ్లి జరిపించింది ముద్దుగుమ్మ. తాజాగా తన అక్క స్టీబిన్ గురించి తల్లిని ఎలా ఒప్పించిందో కూడా నుపుర్ సనన్ వెల్లడించింది. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన నుపుర్ ఈ విషయాన్ని పంచుకుంది.
నుపుర్ సనన్ మాట్లాడుతూ.. "స్టీబిన్ గురించి నేను మొదట చెప్పింది నా సోదరికే. మా ఇద్దరి మధ్య ఐదేళ్ల వయస్సు తేడా ఉన్నప్పటికీ మేము చాలా క్లోజ్‌గా ఉంటాం. అంతేకాదు ప్రాణ స్నేహితులం కూడా. స్టీబిన్ వృత్తిపరంగా ఇప్పుడే కెరీర్ ప్రారంభించాడు. కాబట్టి కెరీర్ పరంగా చెప్పుకోవడానికి పెద్దగా ఏమీ లేదు. నేను అతని గురించి ఒక వ్యక్తిగా ఎక్కువగా చెప్పా. తనకు అతని పాట వినిపించా. వెంటనే అతను అపారమైన ప్రతిభ ఉన్నవాడని కృతి చెప్పింది." అని తెలిపింది.
"కొన్ని నెలల తర్వాత ఈ విషయం మా అమ్మకు చెప్పా. చాలా మంది తల్లులలాగే ఆమె కూడా కొంచెం సంకోచించింది. అప్పుడే నా సోదరి రంగంలోకి దిగింది. నేను స్టీబిన్‌ను కలిశాను.. అతని పాటలు కూడా విన్నాను.. చాలా ప్రతిభావంతుడు.. కష్టపడి పనిచేసేవాడని అమ్మతో చెప్పింది. అలా తన మాటలతో అమ్మను మార్చేసింది. అక్కడి నుండి అంతా సజావుగా జరిగిపోయింది" అని పంచుకుంది. కాగా.. నుపుర్ సనన్- స్టీబిన్ పెళ్లి ఉదయపూర్ జరిగింది. ఈ వేడుకలకు సన్నిహిత కుటుంబ సభ్యులు, స్నేహితులు హాజరయ్యారు.


