
టైటిల్: తమ్ముడు
నటీనటులు: నితిన్, లయ, వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ, స్వసిక విజయన్ తదితరులు
నిర్మాణ సంస్థ: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
నిర్మాత : దిల్ రాజు, శిరీష్
దర్శకత్వం: శ్రీరామ్ వేణు
సంగీతం: అజనీష్ లోకనాథ్
సినిమాటోగ్రఫీ: కేవీ గుహన్
ఎడిటింగ్: ప్రవీణ్ పూడి
విడుదల తేది: జులై 4, 2025

నితిన్ ఖాతాలో హిట్ పడి చాలా ఏళ్లు అయింది. భారీ అంచనాలు పెట్టుకున్న రాబిన్ హుడ్ కూడా నితిన్‌ని నిరాశ పరిచింది. దీంతో ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో పవన్ కల్యాణ్ ఆల్ టైం సూపర్ హిట్ ‘తమ్ముడు’ టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి ఈ చిత్రం నితిన్‌ని హిట్ ట్రాక్ ఎక్కించిందా? లేదా? రివ్యూ (Thammudu Movie Review)లో చూద్దాం.

కథ
జై (నితిన్) ఆర్చరీలో ఇండియాకి గోల్డ్ మెడల్ తేవాలనుకుంటాడు. కానీ ప్రాక్టీస్‌పై దృష్టి పెట్టలేకపోతాడు. దానికి కారణం.. చిన్నప్పుడు తన అక్క స్నేహలత అలియాస్ ఝాన్సీ( లయ) విషయంలో చేసిన ఒక చిన్న తప్పు! ఆ తప్పు కారణంగా అక్క అతన్ని చిన్నప్పుడే దూరం పెడుతుంది. అక్కని కలిస్తే తప్ప తను ప్రాక్టీస్‌పై దృష్టి పెట్టలేనని స్నేహితురాలు చిత్ర ( వర్ష బొల్లమ) తో కలిసి వైజాగ్ వస్తారు. అక్క కోసం వెతకగా ఆమె ఫ్యామిలీతో కలిసి అంబరగొడుగు జాతర వెళ్లినట్టు తెలుస్తుంది. దీంతో జై అక్కడికి వెళ్తాడు. అక్కడ బిజినెస్‌మెన్ అజార్వాల్ మనుషులు ఆమెను చంపేందుకు ప్రయత్నిస్తారు. అజార్వాల్ మనుషులు ఝాన్సీని ఎందుకు టార్గెట్ చేశారు? వారి బారి నుంచి అక్కని జై ఎలా రక్షించాడు? అతనికి గిరిజన యువతి రత్నం (సప్తమి గౌడ) ఎలాంటి సహాయం చేసింది? ఫ్యాక్టరీలో జరిగిన అగ్ని ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు ఝాన్సీ ఇచ్చిన మాట ఏంటి? చివరకు అది నెరవేరిందా లేదా? అక్క విషయంలో జై చేసిన తప్పు ఏంటి? చివరకు అక్కతో ప్రేమగా తమ్ముడు అనిపించుకున్నాడా లేదా అనేదే మిగతా కథ.

ఎలా ఉందంటే...
అక్క ఇచ్చిన మాట కోసం తమ్ముడు చేసిన పోరాటమే ఈ సినిమా కథ. చాలా రొటీన్ స్టోరీ. కానీ దర్శకుడు తనదైన స్క్రీన్‌ప్లేతో తెరపై కొత్తగా చూపించే ప్రయత్నం చేశాడు. సినిమాకి కీలకమైన అక్క- తమ్ముడు సెంటిమెంట్‌ను ఆకట్టుకునేలా చూపించడంలో మాత్రం దర్శకుడు విఫలం అయ్యాడు. సినిమా ప్రారంభం నుంచి ఎండ్ వరకు ప్రతిదీ మన ఊహకి అందేలా సాగడం, ఎమోషనల్ సన్నివేశాలు సరిగా పండకపోవడం సినిమాకి మైనస్ అనే చెప్పాలి.
ఫ్యాక్టరీ ప్రమాదం సన్నివేశంతో చాలా ఎమోషనల్‌గా కథను ప్రారంభించాడు దర్శకుడు. విలన్ పరిచయం సీన్ డిఫరెంట్‌గా ప్లాన్ చేశాడు. భారీ ఎలివేషన్‌తో విలన్‌ను పరిచయం చేసి.. ఆ తరువాత కథని హీరో వైపు మళ్లించాడు. ఆర్చరీలో బంగారు పథకమే లక్ష్యం గా ఉన్న జై... అక్క విషయంలో చేసిన తప్పుని పదేపదే గుర్తు తెచ్చుకోవడం... కోచ్ చెప్పిన మాటతో అక్క కోసం వెళ్ళడంతో అసలు కథ ప్రారంభం అవుతుంది. అంబరగొడుగు నేపథ్యం సన్నివేశాలు ఆకట్టుకుంటాయి.
ఊహించింది తెరపై జరుగుతుంటే కొన్ని చోట్ల ఎంజాయ్ చేస్తాం. ఇంటర్వెల్ వరకు కథనం సోసోగానే సాగుతుంది. అజార్వాల్ గ్యాంగ్ నుంచి ఝాన్సీ ఫ్యామిలీని జై ఎలా రక్షించాడు? అనేదే సెకండాఫ్ స్టోరీ. అయితే మధ్య లో వచ్చే యాక్షన్ సీన్స్ మాత్రం అదిరిపోయాయి. యాక్షన్ కొరియోగ్రఫీ కొత్తగా ఉంటుంది. క్లైమాక్స్ రొటీన్‌గా సాగుతుంది. ఎడిటింగ్ పర్వాలేదు. సంగీతం, సినిమాటోగ్రఫీ బాగుంది. బీజీఎమ్ సినిమాకు ప్లస్ పాయింట్‌గా నిలిచింది. సాంకేతికంగా సినిమా పర్వాలేదు.

ఎవరెలా చేశారంటే..
జై పాత్రలో నితిన్ (Nithiin) చక్కగా నటించారు. యాక్షన్ సన్నివేశాల్లో అదరగొట్టాడు. అయితే ఆయన ఈ సినిమాలో హీరో అనడం కంటే... కీలక పాత్రధారి అని చెప్పడం బెటర్. రత్నం పాత్రకి సప్తమి గౌడ న్యాయం చేసింది. ఝాన్సీగా లయ నటనకు వంక పెట్టాల్సిన అవసరం లేదు. చిత్రగా వర్ష బొల్లమ్మ బాగా నటించింది. మిగతావాళ్లందరూ తమ పాత్రలతో మెప్పించారు.
- అంజి శెట్టె, సాక్షి వెబ్ డెస్క్