సక్సెస్‌ను మించిన ప్రెజర్‌ మరొకటి ఉండదు

Nikhil Siddhartha Talks On 18 Pages Movie Press Meet - Sakshi

– నిఖిల్‌

‘‘నా కెరీర్‌లో ఇప్పటివరకూ నేను మంచి కథలు, మంచి సినిమాల్లో నటించాను. కానీ నటనలో నాకు ఉన్న ప్రతిభకు సరైన పేరు రాలేదని ఫీలవుతుంటాను. అయితే ‘18 పేజెస్‌’ రిలీజ్‌ తర్వాత కేవలం ఈ సినిమా గురించే కాకుండా నా నటన గురించి కూడా మాట్లాడుకుంటారని అనుకుంటున్నాను’’ అని హీరో నిఖిల్‌ సిద్ధార్థ అన్నారు. పల్నాటి సూర్యప్రతాప్‌ దర్శకత్వంలో నిఖిల్‌ సిద్ధార్థ, అనుపమా పరమేశ్వరన్‌ జంటగా నటించిన చిత్రం ‘18 పేజెస్‌’. దర్శకుడు సుకుమార్‌ అందించిన కథతో అల్లు అరవింద్‌ సమర్పణలో బన్నీ వాసు నిర్మించిన ఈ చిత్రం నేడు రిలీజవుతోంది. ఈ సందర్భంగా గురువారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో నిఖిల్‌ చెప్పిన విశేషాలు.

► ‘18 పేజెస్‌’ చిత్రం ఎలా ఉంటుంది?
థ్రిల్లింగ్‌ ఎలిమెంట్స్‌తో కూడిన క్రేజీ లవ్‌స్టోరీ ఇది. 18 పేజెస్‌ ఆధారంగా నందినీతో సిద్ధు ఏ విధంగా ప్రేమలో పడతాడు? వీరి ప్రేమకథ ఎలా ముగిసింది? అన్నదే కథ. ఈ సినిమా క్లయిమాక్స్‌ని ఊహించలేకపోయాను. అలాగే ఈ సినిమాను ప్రేక్షకులు, విమర్శకులు ఎలా రిసీవ్‌ చేసుకుంటారోననే భయం కూడా ఉంది. హిట్టయినా కాకపోయినా మేం ఓ మంచి ప్రయత్నం చేశామని ఆడియన్స్‌ భావిస్తారనే గ్యారంటీ ఇవ్వగలను.  

► థ్రిల్లింగ్‌ ఎలిమెంట్స్, లవ్‌స్టోరీ కాకుండా.. ఈ సినిమాలో వేరే అంశాలేమైనా?
కొన్ని సామాజిక అంశాలను చెప్పే ప్రయత్నం చేశాం. ఎవరో ఒక అమ్మాయి తనను రిజెక్ట్‌ చేసిందని అతను ఆమెపై యాసిడ్‌తో దాడి చేయడం, అఘాయిత్యాలకు పాల్పడటం వంటివి వార్తల్లో చూస్తున్నాం. ఓ అమ్మాయికి ఎలాంటి గౌరవం దక్కాలి? ఆమె పట్ల ప్రవర్తన ఎలా ఉండాలి? పెద్దల పట్ల యువత తీరు ఎలా ఉంటే బాగుంటుంది? అనే అంశాలను చెప్పే ప్రయత్నం చేశాం. ఈ సినిమా చూసిన తర్వాత బ్రేకప్‌ను కూడా పాజిటివ్‌గా తీసుకుంటారు.

► ఈ చిత్రంపై దర్శకుడు సుకుమార్‌ మార్క్‌ ఎంత?
వంద శాతం ఆయన మార్క్‌ కనిపిస్తుంది. హీరో, హీరోయిన్ల క్యారక్టరైజేషన్స్, స్క్రీన్‌ప్లే డిఫరెంట్‌గా ఉన్న ఇలాంటి లవ్‌స్టోరీని నేనిప్పటివరకు చేయలేదు. ప్రతి సీన్‌ చాలెంజింగ్‌గా అనిపించింది.
‘కార్తికేయ 2’తో పాన్‌ ఇండియా హీరో అయ్యారు. ఏమైనా ఒత్తిడి ఫీలవుతున్నారా?
పాన్‌ ఇండియా హీరో అన్న ప్రతిసారీ నాకు ఒత్తిడే. నాకు తెలిసి సక్సెస్‌ను మించిన ప్రెజర్‌ మరొకటి ఉండదు.

► మీ తర్వాతి చిత్రాలు?
నెక్ట్స్‌ ఇయర్‌ ఓ స్పై మూవీతో రాబోతున్నాను. దర్శకుడు చందు మొండేటి ‘కార్తికేయ 3’ కోసం పరిశోధన చేస్తున్నారు. నా ‘యువత’ సినిమా రిలీజైన ఐదు రోజులకు సుకుమార్‌గారు లక్ష రూపాయల పారితోషికం ఇచ్చారు. ఆయనతో సినిమా ఎప్పుడో చెప్పలేను.  

► మనతో పని చేసేవారు కొన్నిసార్లు తప్పుడు నిర్ణయాలను కూడా పొగుడుతుంటారు. రియల్‌ పర్సన్స్‌ను కలిసినప్పుడు మనకు రియాలిటీ అర్థమవుతుంది. ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌.. ఇలా సోషల్‌ మీడియా ద్వారా రియల్‌ పీపుల్‌ను కలిసే చాన్స్‌ నాకు లభించింది. సోషల్‌ మీడియాలో నాకో ఫేక్‌ ప్రొఫైల్‌ ఉంది. నెటిజన్ల కామెంట్స్‌ చదువుతూ నిజాలు తెలుసుకుంటుంటాను. నా సినిమాలకు ప్రేక్షకుల స్పందన ఎలా ఉందనే విషయాలను నా ఫ్రెండ్స్‌ ద్వారా తెలుసుకుంటుంటాను.

► అనుకోకుండా యాక్టర్‌ అయ్యాను. ఊహించని విధంగా హిట్స్‌ పడ్డాయి. అలాగే ఊహించని రీతిలో జాతీయ స్థాయిలో ఆడియన్స్‌ దృష్టిలో పడ్డాను. ఇదంతా ఎలా జరిగిందో ఆలోచించుకుంటూ  ఉంటాను.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top