
అంతన్న డింతన్నడే గంగరాజు తరహాలో కొన్ని చిత్రాల ప్రచారం జరుగుతుంది. అయితే ఆ చిత్రాలు విడుదలైన తరువాత అంచనాలు తలకిందులవుతాయి. ఆప్రభావం హీరోహీరోయిన్లు సహా యూనిట్ అంతటిపైనా పడుతుంది. దాని నుంచి బయట పడడానికి చాలా పోరాటం చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు నటి నిధిఅగర్వాల్ పరిస్థితి అలాగే తయారైంది. ఇస్మార్ట్ శంకర్ చిత్రం హిట్‌తో వెలుగులోకి వచ్చిన ఈ బ్యూటీ. ఆ తరువాత కొన్ని అవకాశాలు వచ్చాయి. అయితే ఏ ఒక్కటి ఆశించిన విజయాన్ని అందించలేదు. అలాంటి పరిస్థితుల్లో కోలీవుడ్ నుంచి పిలుపువచ్చింది. అలా ఇక్కడ రవిమోహన్‌కు జంటగా భూమి చిత్రంలో నటించే అవకాశం రావడంతో కోలీవుడ్‌లో ఒక రౌండ్ కొట్టవచ్చుననే అందరూ అనుకున్నారు. అయితే ఆ చిత్రం నేరుగా ఓటీటీలో విడుదల అవడంతో పెద్దగా నిధి అగర్వాల్‌కు ప్లస్ కాలేదు.
ఆ తరువాత శింబుకు జంటగా ఈశ్వరన్ చిత్రంలో నటించారు. ఆ చిత్రంలో నటిస్తున్న సమయంలో శింబుతో ప్రేమ అంటూ ప్రచారం వైరల్ అయ్యింది. అదే సమయంలో ఈశ్వరన్ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించలేదు. ఆ తరువాత ఉదయనిధి స్టాలిన్ సరసన ఒక చిత్రం చేశారు. అయినప్పటికీ నిధికి సరైన బ్రేక్ రాలేదు. ఆ తరువాత తెలుగులో పవన్ కళ్యాణ్ సరసన హరిహర వీరమల్లు వంటి భారీ చిత్రంలో నటించే అవకాశం రావడంతో ఈ సారి సక్సెస్ గ్యారంటీ అని ఈ అమ్మడు సంతోషపడి ఉండవచ్చు. అయితే ఈ చిత్రం విడుదల కోసం ఐదేళ్లు చూశారు. ఈ చిత్రం ఫలితం నిధి అగర్వాల్‌కు నిరాశనే మిగిల్చింది.
ప్రస్తుతం ఈమెకు ఓకే ఒక్క ఆశ రాజాసాబ్. ప్రభాస్ సరసన నటిస్తున్న ఈ చిత్రం డిసెంబర్‌లో తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. దీంతో నిధి అగర్వాల్ మళ్లీ అవకాశాల కోసం పోరాటం మొదలు పెట్టారు. అందుకోసం ప్రత్యేకంగా తీయించుకున్న ఫొటోలను మీడియాకు విడుదల చేశారు. అవి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.