Connect Movie Director: కనెక్ట్‌.. గూస్‌ బంప్స్‌ తెప్పించే మూవీ ఇది: దర్శకుడు

Nayanthara Connect Movie Director Ashwin Saravanan Talk In Press Meet - Sakshi

లేడీ సూపర్‌ స్టార్‌ నయనతార నటించిన మరో లేటెస్ట్‌ హార్రర్‌ చిత్రం కనెక్ట్‌. అశ్విన్‌ శరవణన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని రౌడీ పిక్చర్స్‌ బ్యానర్‌పై నయన్‌ స్వయంగా నిర్మించింది. తెలుగులో ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్‌ ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. డిసెంబర్‌ 22న ఈ సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా డైరెక్టర్‌ అశ్విన్‌ శరవణన్‌ మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన మూవీ విశేషాలను పంచుకున్నాడు. 

♦ లాక్‌డౌన్‌లో కుటుంబాలు కలిసి లేవు. ఏదో పని మీద మరో ప్రాంతానికి వెళ్లిన వాళ్లు అక్కడే స్ట్రక్ అయ్యారు. అలా ఒక కుటుంబంలోని తల్లీ కూతురు ఇంట్లో ఉండిపోతారు. కొద్ది రోజులకు కూతురి ప్రవర్తనలో అనూహ్య మార్పులు వస్తాయి. ప్రేతాత్మ ఆవహించినట్లు ఆమె బిహేవ్ చేస్తూ ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో బిడ్డను తల్లి ఎలా కాపాడుకుంది అనేదే ఈ సినిమా కథ. గూస్ బంప్స్ తెప్పించే హార్రర్ థ్రిల్లర్ ఇది.

♦ ఆ పాపను ఆవహించిన ఆత్మను పోగొట్టేందుకు ఆ తల్లి.. ఫాదర్ అగస్టీన్ హెల్ప్ కోరుతుంది. ఈ పాత్రలో అనుపమ్ ఖేర్ నటన ఆకట్టుకుంటుంది. ఇలాంటి క్యారెక్టర్స్ ప్రేక్షకులు నమ్మేలా ఉండాలి. ఆ సహజత్వాన్ని అనుపమ్ ఖేర్ తన నటనతో చూపించారు. 

హాలీవుడ్ చిత్రాల్లో సినిమాకు ఇంటర్వెల్ ఉండదు. కథలోని ఫీల్ పోతుందని వారు విరామాలు పెట్టరు. ఒక ఫ్లోలో వెళ్తున్న కథకు విరామం ఇస్తే ప్రేక్షకులు డైవర్ట్ అవుతారు. ఈ చిత్రంలోనూ ఇంటర్వెల్ ఉండదు. హార్రర్ థ్రిల్ పంచుతూ ఏక బిగిన కథ సాగుతుంటుంది. సినిమా నిడివి గంటన్నర ఉంటుంది కాబట్టి చూడటం సులువు. ఇటీవల హిట్ అయిన చాలా సినిమాల నిడివి మూడు గంటలు ఉంది. వాటికి ఇంటర్వెల్ గంటన్నరు ఇచ్చారు. కాబట్టి మా సినిమాను కంటిన్యూగా చూడటంలో ప్రేక్షకులు ఎలాంటి ఇబ్బందులు పడరని అనుకుంటున్నా. ప్రేక్షకులు ఆదరిస్తే ఇలాంటి పద్ధతిలో మరిన్ని సినిమాలు రూపొందుతాయి. అప్పుడు థియేటర్లో ఆరేడు షోస్ ప్రదర్శించే వీలు కూడా కలుగుతుంది.

♦ నయనతారతో గతంలో మాయా (తెలుగులో మయూరి) అనే చిత్రాన్ని రూపొందించాను. ఆమె పట్ల నాకు గౌరవం ఉంది. దర్శకుడిగా నేనంటే ఆమెకు నమ్మకం. అందుకే మళ్లీ ఈ సినిమాను నయనతారతోనే చేశాను. ఈ కథ విన్నాక ఆమెకు బాగా నచ్చింది. దీన్ని ఒక అంతర్జాతీయ స్థాయి చిత్రంగా నిర్మించాలన్నది నయనతార కోరిక. అందుకే విఘ్నేష్ తో కలిసి ఆమె ప్రొడ్యూస్ చేసింది. మాకు కావాల్సిన రిసోర్సెస్ అన్నీ సమకూర్చింది.

♦ నటిగా నయనతారను అడ్మైర్ చేస్తాను. ఈ సినిమాలో ప్రతి సీన్ ఆమె నటన ఆకట్టుకుంటుంది. ఆద్యంతం తన పర్మార్మెన్స్ తో ప్రేక్షకులను మెప్పిస్తుంది. ఒక డిఫరెంట్ కథను చూపిస్తున్నప్పుడు నటీనటుల ఎంత ప్రామిసింగ్ గా కనిపిస్తే అంత సినిమాకు అడ్వాంటేజ్. ఆ విషయంలో నయనతార టాప్ యాక్ట్రెస్.

ఈ సినిమాకు పృథ్వీ సంగీతాన్ని అందించారు. సౌండ్ డిజైనింగ్ కోసమే మూడు నెలల సమయం తీసుకున్నాం. అందుకే క్వాలిటీ చాలా బాగా వచ్చింది.

♦ ప్రేక్షకులను చూపు తిప్పుకోకుండా చేసే ఇలాంటి తరహా చిత్రాలను తెరకెక్కించడానికి ఇష్టపడతాను. ఇలాంటి చిత్రాలకు మన దగ్గర మంచి డిమాండ్ ఉంటుంది. తెలుగులో మసూద మంచి విజయాన్ని సాధించింది. తెలుగు, తమిళ పరిశ్రమలు ప్రస్తుతం కలిసి పనిచేస్తున్నాయి. ఇదొక ఆరోగ్యకరమైన వాతావరణం.

♦ టాలీవుడ్ నాని సినిమాలంటే ఇష్టం. ఆయనకు గతంలో మయూరి కథ చెప్పాను. తనే సినిమా ప్రొడ్యూస్ చేస్తానన్నాడు. ఆయనతో ఒక సినిమా రూపొందించాలని ఉంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top