త్వరలో చూస్తారు! | Nani and Srikanth Odela film The Paradise will release in March 2026 | Sakshi
Sakshi News home page

త్వరలో చూస్తారు!

Apr 4 2025 3:10 AM | Updated on Apr 4 2025 3:10 AM

Nani and Srikanth Odela film The Paradise will release in March 2026

‘దసరా’(2023) వంటి బ్లాక్‌బస్టర్‌ మూవీ తర్వాత హీరో నాని, డైరెక్టర్‌ శ్రీకాంత్‌ ఓదెల, నిర్మాత సుధాకర్‌ చెరుకూరి కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న తాజా చిత్రం ‘ది ప్యారడైజ్‌’. ఎస్‌ఎల్‌వీ సినిమాస్‌పై సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తున్నారు. కాగా ఈ సినిమా స్క్రిప్ట్‌ విషయంలో నాని సంతృప్తిగా లేరని, అదేవిధంగా బడ్జెట్‌ బాగా పెరిగిపోవడంతో సినిమా ఆగిపోయిందంటూ గత కొద్దిరోజులుగా ఆన్‌లైన్‌లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

ఈ వార్తలపై చిత్ర యూనిట్‌ సోషల్‌ మీడియా వేదికగా ఘాటుగా స్పందించింది. ‘‘ది ప్యారడైజ్‌’పై ఎలాంటి అనుమానాలొద్దు. మేము అనుకున్నవిధంగానే పనులు జరుగుతున్నాయి. ఎవరూ కంగారుపడాల్సిన పనిలేదు. ఈ మూవీని ఎంత గొప్పగా తీర్చిదిద్దుతున్నామో త్వరలోనే చూస్తారు. ఆ సమయం వరకు పుకార్లు సృష్టిస్తూ కొందరు బతికేయచ్చు. ఎందుకంటే ఏనుగు నడుస్తుంటే కుక్కలు అరుస్తుంటాయి కదా! మా సినిమాపై అభిమానులు చూపించే ప్రేమను చాలా దగ్గరగా చూస్తున్నాం. 

అదేవిధంగా ఈ మూవీపై తప్పుడు ప్రచారం చేస్తున్నవారిని కూడా గమనిస్తున్నాం. ప్రేమ, ద్వేశాన్ని రెండింటినీ తీసుకుని.. వాటన్నిటితో ఒక శక్తిగా మీ ముందుకు తిరిగొస్తాం. తెలుగులో ఉండే గొప్ప చిత్రాల్లో ఒకటిగా ‘ది ప్యారడైజ్‌’ ఉంటుంది. సినిమాపై పుకార్లు సృష్టిస్తున్న వారందరూ త్వరగా కోలుకోవాలి. అభిమానులంతా గర్వపడే చిత్రంతో నాని మీ ముందుకు వస్తారని మాట ఇస్తున్నాం’’ అని యూనిట్‌ పోస్ట్‌ చేసింది. ఈ సినిమా 2026 మార్చి 26న విడుదలకానుంది. ఈ చిత్రానికి కెమేరా: ఏఓ విష్ణు, సంగీతం: అనిరుధ్‌ రవిచందర్‌.

Advertisement
 
Advertisement
Advertisement