Nandamuri Taraka Ratna Wife Alekhya Reddy Shares Emotional Letter Goes Viral - Sakshi
Sakshi News home page

Taraka Ratna: బాధను దిగమింగి ప్రేమను పంచావు.. అలేఖ్య రెడ్డి ఎమోషనల్

Mar 2 2023 6:23 PM | Updated on Mar 2 2023 9:48 PM

Nandamuri Taraka Ratna Wife Alekhya Reddy Shares Emotional Letter - Sakshi

నందమూరి తారకరత్న మరణం టాలీవుడ్‌ అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిన సంగతి తెలిసిందే. యావత్ సినీ ప్రపంచం ఆయన మరణాన్ని జీర్ణించుకోలేకపోయారు. అటు అభిమానులతో పాటు తారకరత్న మరణం కుటుంబ సభ్యులకు తీరని వేదన మిగిల్చింది. భర్త దూరం కావడంతో పిల్లలతో పాటు భార్య అలేఖ్య రెడ్డి విషాదంలో మునిగిపోయింది . పుట్టినరోజుకు మూడు రోజుల ముందే ఆయన కన్నుమూయడంతో ఆమె మరింత నిరాశకు లోనైంది. ఇటీవలే తారకరత్నతో చివరిసారిగా దిగిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఎమోషనలయ్యారు అలేఖ్య రెడ్డి. 

అయితే గురువారం మార్చి 2, 2023న తారకరత్న పెద్దకర్మ  హైదరాబాద్​లోని ఫిలింనగర్​ కల్చరల్​ సెంటర్​లో నిర్వహించారు. ఈ సందర్భంగా తారకరత్న రాసిన లేఖ ప్రతి ఒక్కరినీ కదిలిస్తోంది. వాలైంటెన్స్ డే సందర్భంగా అలేఖ్యను తలుచుకుంటూ ఎమోషనల్ నోట్ రాశారు. నా జీవితంలో చివరి శ్వాస వరకు నిన్ను ప్రేమిస్తూనే ఉంటా అని లేఖలో పేర్కొన్నారు తారకరత్న. నా జీవితంలో నువ్వే నా ప్రపంచం బంగారు అని రాశారు.  ఇవాళ తారకరత్న పెద్దకర్మ సందర్భంగా ఆ లేఖను అలేఖ్య రెడ్డి తన ఇన్‌స్టాలో షేర్ చేశారు. ఈ లేఖ ప్రతి ఒక్కరి హృదయాలను కదిలిస్తోంది. ఆ లేఖతో పాటు తారకరత్నకు ముద్దు పెడుతున్న ఫోటోను పంచుకున్నారు. ఏది ఏమైనా భార్య, భర్తల మధ్య అనుబంధం ఎంత గొప్పదో ఈ లేఖ ద్వారా స్పష్టమవుతోంది. 

అలేఖ్య రెడ్డి తన ఇన్‌స్టాలో లేఖను షేర్ చేస్తూ ..'మన జీవితంలో అన్ని ఒడిదుడుకులు చూశాం. చాలా కష్టాలు పడ్డాం. జీవితంలో అత్యంత కష్టకాలం అనుభవించాం. మన కష్టాలు మీకు మాత్రమే తెలుసు. మంచి రోజుల కోసం ఎదురు చూశాం. మనిద్దరం ఒక చిన్న కుటుంబాన్ని సృష్టించుకున్నాం.  నీ జీవితంలో పడిన కష్టాలు ఎవరికీ తెలియదు. నాలా ఎవరూ నిన్ను అర్థం చేసుకోలేదు.  నేను నిన్ను అర్థం చేసుకున్నందుకు సంతోషిస్తున్నా. నీ బాధనంతా నీలోనే దాచి.. మాకు అపారమైన ప్రేమను అందించావు. ప్రపంచం ఎన్ని అబద్ధాలు చెప్పినా నువ్వు మా చుట్టే ఉన్నావు. నేను మరింత ఎత్తుకు ఎదుగుతా నానా. ఈ రోజు నిన్ను మేము చాలా మిస్ అవుతున్నాం నానా' అంటూ ఎమోషనల్ అయ్యారు అలేఖ్య రెడ్డి. ఏది ఏమైనా దేవుడు ఆ కుటుంబానికి మరింత ధైర్యం ప్రసాదించాలని తారకరత్న అభిమానులు కోరుకుంటున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement