మెగా‘ఆవేశం స్టార్‌’ నాగబాబు.. ఆలోచన తక్కువ..తొందరెక్కువ! | Nagababu Reactivates His Twitter Account, Unstable Behaviour Of Naga Babu Creates Controversies | Sakshi
Sakshi News home page

Nagababu Controversy: మెగా‘ఆవేశం స్టార్‌’ నాగబాబు.. ఆలోచన తక్కువ..తొందరెక్కువ!

Published Sat, May 18 2024 3:12 PM

Nagababu Reactivates His Twitter Account, Unstable Behaviour Of Naga Babu Creates Controversies

మెగా బ్రదర్‌ నాగబాబుకు తొందర ఎక్కువ. ఏ చిన్న విషయానికైనా ఆవేశంతో ఊగిపోతుంటాడు. కోపం వస్తే ముందు వెనుక ఆలోచించకుండా మాటలు విసిరేస్తూ.. గోటితో పోయేదాన్ని గొడ్డలి వరకు తెచ్చుకోవడం ఆయనకు అలవాటు అని సన్నిహితంగా చూసిన వారంతా చెబుతుంటారు. అయితే దేనికైన ఓ హద్దు ఉంటుంది. పబ్లిక్‌ లైఫ్‌లో ఉన్నప్పుడు పొగడ్తలుతో పాటు విమర్శలు కూడా వస్తుంటాయి. ఈ విషయం చిరంజీవికి బాగా తెలుసు. అందుకే అతనిపై వచ్చిన విమర్శలను పెద్దగా పట్టించుకోడు. అలా పట్టించుకునేవాడు అయితే ఆయన ఈ స్థాయికి ఎదిగేవాడే కాదు. కానీ నాగబాబు మాత్రం చిన్న చిన్న విమర్శలను సైతం తీసుకోలేడు. తొందరపడి ఘాటు వ్యాఖ్యలు చేసి..కాంట్రవర్సీని క్రియేట్‌ చేస్తాడు. ఇప్పటికే అనేకసార్లు ఆవేశంతో ఆయన చేసిన ట్వీట్లు..వివాదానికి దారి తీశాయి. ఇక తాజాగా ఆయన చేసిన పని మెగా కాంపౌండ్‌లో కలకలం రేపింది.మెగా ఫ్యామిలీలో విభేధాలు ఉన్నాయని తానే స్వయంగా బయటపెట్టాడు.

పరాయివాడు వాడంటూ బన్నీపై ట్వీట్‌..అంతలోనే!
ఏపీ ఎన్నికలు ముగిసిన తర్వాత నాగబాబు ఓ ట్వీట్‌ చేశాడు.‘మాతో ఉంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మావాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే’ అని తన ఎక్స్‌ ఖాతాలో రాసుకొచ్చాడు. ఈ ట్వీటే వివాదానికి దారి తీసింది.  ఏపీ ఎన్నికల్లో తన మిత్రుడైన వైఎస్సార్‌సీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్రారెడ్డికి మద్దతుగా అల్లు అర్జున్‌ వెళ్లిన నేపథ్యంలోనే నాగబాబు ఇలా ట్వీట్‌ వేయడంతో బన్నీ ఫ్యాన్స్‌ నాగబాబుపై విపరీతంగా విరుచుకుపడ్డారు. దీంతో తన ఎక్స్ అకౌంట్‌ను డీయాక్టివేట్ చేసుకున్నారు నాగబాబు. రెండు రోజుల పాటు ఆయన సోషల్‌ మీడియాలో కనిపించలేదు. మళ్లీ ఈ రోజు ఎక్స్‌లోకి వచ్చి ‘ఆ ట్వీట్‌ డిలీట్‌ చేశాను’అని మరో ట్వీట్‌ వేశాడు.

(చదవండి: బన్నీ ఫ్యాన్స్ దెబ్బకు నాగబాబు పరార్.. మళ్లీ ఇప్పుడు ఇలా)

దీంతో తను తప్పు చేశానని స్వయంగా నాగబాబే ఒప్పుకున్నట్లు అయింది. గతంలో నాగబాబు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పడు ఆదుకున్నది బన్నీనే. అంతేకాదు జనసేన పార్టీకి రూ. 2 కోట్ల విరాళం కూడా ఇచ్చాడు. అవన్నీ మరిచిపోయి స్నేహితుడికి మద్దతు తెలిపేందుకు వెళ్లిన బన్నీని పరాయివాడు అంటూ విమర్శించడంతోనే నాగబాబు మనస్తత్వం ఎలాంటితో అర్థమవుతుంది. ఆయనకు తొందరపాటు, దుడుకుతనం లాంటి అవలక్షణాలు ఉన్నాయని చాలా మంది అంటారు. మళ్లీ అది ఇప్పుడు రుజువు అయింది.

కాంట్రవర్సీకి కేరాఫ్‌..
వివాదాలను కోరి తెచ్చుకోవడం నాగబాబుకు కొత్తేమి కాదు. గతంలోనూ అనేకసార్లు ఆవేశంతో మాట్లాడి..కాంట్రవర్సీ క్రియేట్‌ చేశాడు. రెండేళ్ల క్రితం బీజేపీ నేత బండారు దత్తాత్రేయ ఏర్పాటు చేసిన ‘అలయ్‌ బలయ్‌’ ఈవెంట్‌లో మెగాస్టార్‌ చిరంజీవిపై ప్రముఖ ప్రవచనకర్త గరికిపాటి నరసింహారావు చేసిన వ్యాఖ్యలు వివాదస్పదం అయిన సంగతి తెలిసిందే. ‘చిరంజీవి ఫొటో సెషన్‌ ఆపకపోతే.. కార్యక్రమం నుంచి వెళ్లిపోతా’ అంటూ గరికపాటి సీరియస్‌ అయ్యారు. 

అయితే గరికపాటి వ్యాఖ్యలను మెగాస్టార్‌ లైట్‌ తీసుకున్నారు. ‘ఆయన పెద్దాయన. ఆయన చేసిన వ్యాఖ్యలపై చర్చించుకోవాల్సిన అవసరం లేదు’అంటూ ఆ వివాదానికి ఫుల్‌స్టాఫ్‌ పెట్టే ప్రయత్నం చేశాడు. కానీ నాగబాబు మాత్రం ఆ వివాదాన్ని మరింత పెద్దది చేశాడు. ‘ఏపాటి వాడికైనా చిరంజీవి ఇమేజ్‌ చూస్తే ఆ పాటి అసూయపడటం పరిపాటే’అంటూ ట్వీట్‌ చేసి ట్రోలింగ్‌కి గురయ్యాడు. అలాగే  ప్రముఖ రచయిన యండమూరి విషయంలోనూ నాగబాబు అతిగా మాట్లాడాడు.

యండమూరి వీరేంద్రనాథ్‌-చిరంజీవిల మధ్య కొన్నాళ్ల క్రితం మనస్పర్థలు రావడంతో దూరమయ్యారు. అయితే యండమూరి చేసిన కామెంట్స్‌పై చిరంజీవి ఏనాడు స్పందించలేదు. కానీ నాగబాబు మాత్రం పబ్లిక్‌గానే యండమూరిని విమర్శించారు. కట్‌ చేస్తే ఇప్పుడు చిరంజీవి తన బయోపిక్‌ని రాసే అవకాశం యండమూరికే ఇచ్చాడు. 

ఓ సందర్భంలో పవన్‌ కల్యాణ్‌ ఫ్యాన్స్‌పై నాగబాబు ఫైర్‌ అయ్యారు.  చిరంజీవి బర్త్‌డే సెలబ్రేషన్స్‌కి హాజరైన పవన్  ఫ్యాన్స్ అక్కడ పవర్ స్టార్.. పవర్ స్టార్ అని అరవడంతో నాగబాబు కోపంతో ఊగిపోయాడు. ఎన్నిసార్లు ఈవెంట్లకి పిలిచినా అతడు ఎక్కడికీ రావడం లేదు. దానికి మేమేం చేస్తాం. ఇక్కడికొచ్చి పవర్ స్టార్.. పవర్ స్టార్ అని అరవడం కాదు.. మీకు దమ్ముంటే ఆయన ఆఫీసుకెళ్లి అక్కడ అరవండి.దేనికయినా ఓపికనేది ఒకటుంటుందని.. దానిని పరీక్షించొద్దు. ప్రతీసారి రావడం పవర్ స్టార్.. పవర్ స్టార్ అరవడం మీకో అలవాటయింది’అని అభిమానులపై నాగబాబు మండిపడ్డాడు. నాగబాబుకి దుడుకుతనం, తొందరపాటు ఉంటుందని చాలా మంది అంటుంటారు. అదినిజమని ఆయన ప్రవర్తతోనే నిరూపించుకుంటున్నాడు. 

Advertisement
 
Advertisement
 
Advertisement