విగ్‌ కూడా పెట్టుకోరు.. రజనీకాంత్‌పై బాలీవుడ్‌ నటుడు ఆసక్తికర వ్యాఖ్యలు | Mukesh Khanna Interesting Comments On Rajinikanth | Sakshi
Sakshi News home page

విగ్‌ కూడా పెట్టుకోరు.. రజనీకాంత్‌పై బాలీవుడ్‌ నటుడు ఆసక్తికర వ్యాఖ్యలు

Apr 2 2025 2:15 PM | Updated on Apr 2 2025 4:24 PM

Mukesh Khanna Interesting Comments On Rajinikanth

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌(Rajinikanth) బయట ఎంత సింపుల్‌గా ఉంటారో అందరికి తెలిసిందే. ఎక్కువగా తెల్ల పంచె, షర్ట్‌ ధరించే కనిపిస్తాడు. సినిమా ఈవెంట్స్‌కి కూడా అలానే వెళ్తాడు. అవసరం అయితే తప్ప మేకప్‌ వేసుకోరు. ఆయన సినిమాలను అభిమానించే వాళ్లు ఎంత మంది ఉన్నారో..ఆయన వ్యక్తిత్వాన్ని ఇష్టపడే వాళ్లుకూడా అంతే ఉన్నారు. తాజాగా ఇదే విషయాన్ని చెబుతూ..రజనీకాంత్‌పై  బాలీవుడ్‌ నటుడు ముకేశ్‌ ఖన్నా(Mukesh Khanna) ప్రశంసల వర్షం కురిపించారు. బాలీవుడ్‌ హీరోలలో ఎంతో మందికంటే రజనీకాంత్‌ చాలా గొప్పవాడని, రియల్‌ హీరో అంటే ఆయనేనని పొగడ్తలతో ముంచేశాడు.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘నేను ఇప్పటి వరకు రజనీకాంత్‌ని వ్యక్తిగతంగా కలవలేదు. కానీ ఆయన వ్యక్తిత్వం నాకు చాలా ఇష్టం. పెద్ద స్టార్‌ అయినప్పటికీ చాలా సింపుల్‌గా ఉంటారు. బయటకు వెళ్లినప్పుడు కూడా మేకప్‌ వేసుకోరు. కనీసం విగ్గు కూడా ధరించడు. ఫ్యాన్స్‌తో ఓ సామాన్య వ్యక్తిలాగే ప్రవర్తిస్తాడు.బాలీవుడ్‌ హీరోల్లో ఎవరూ కూడా రజనీకాంత్‌లా ఉండలేరు. మేకప్‌ లేకుండా వాళ్లు బయట తిరగలేరు. వాళ్లతో పోలిస్తే రజనీకాంత్‌ చాలా చాలా గొప్ప వ్యక్తి. ఆయన రియల్‌ హీరో’ అని మేకేష్‌ చెప్పుకొచ్చాడు. తన సినీ కెరీర్‌ గురించి చెబుతూ.. డైలాగులు లేని కారణంగా చాలా పెద్ద సినిమాలు వదులుకున్నానని చెప్పారు. విలన్‌గా చేయడం ఇష్టంలేక సినిమాలను దూరం పెట్టానని చెప్పారు.  ‘మహాభారతం’ సీరియల్‌లో మొదట దుర్యోధనుడి పాత్ర ఇస్తే నో చెప్పానని, ఆ తర్వాత భీష్ముడి పాత్ర వచ్చిందని చెప్పారు. బాలీవుడ్‌ హీరోలపై ముకేశ్ ఖన్నా చేసిన కామెంట్స్ ఇపుడు వైరల్ గా మారాయి.

"రూహీ"(1981) చిత్రంలో ముకేశ్‌ ఖన్నా తన సినీ కెరీర్‌ని ప్రారంభించారు. ఆ తర్వాత అతను "వక్త్ కీ దీవార్" (1981), "దర్ద్ కా రిష్తా" (1982) వంటి చిత్రాల్లో చిన్న పాత్రలు పోషించాడు. 1980లలో అతను అనేక హిందీ చిత్రాల్లో సహాయ నటుడిగా కనిపించాడు, కానీ అతనికి పెద్దగా గుర్తింపు రాలేదు.  1997లో దూరదర్శన్‌లో ప్రసారమైన "శక్తిమాన్" అనే టెలివిజన్ సీరియల్‌తో అతనికి మంచి గుర్తింపు వచ్చింది. ఈ సీరియల్‌లో అతను శక్తిమాన్ అనే సూపర్‌హీరో పాత్రను పోషించాడు. ఈ  పాత్ర అతన్ని ఇంటింటికీ చేర్చింది, ముఖ్యంగా పిల్లల్లో అతను అత్యంత ప్రజాదరణ పొందాడు. "శక్తిమాన్" సీరియల్‌ను అతను స్వయంగా నిర్మించడం విశేషం.

‘మహాభారతం’ లో పోషించిన భీష్మ పాత్ర అతన్ని భారతీయ ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిపింది. నటనతో పాటు నిర్మాణం మరియు దర్శకత్వంలో కూడా తన ప్రతిభను చాటిన ముకేష్ ఖన్నా, భారతీయ చిత్ర పరిశ్రమలో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు. 

What's your opinion?

ఇటీవల రిలీజైన ఈ చిత్రాల్లో మీకు నచ్చింది?

Choices
Advertisement
 
Advertisement
Advertisement