అభిమానం హద్దులు దాటకూడదు. అవతలి వ్యక్తికి ఇబ్బంది కాకూడదు. కానీ ఓ మహిళ మాత్రం మలయాళ బుల్లితెర నటుడు రాయ్‌జన్ రాజన్‌ను ఆరేళ్లుగా ఇబ్బందిపడుతోంది. తను చెప్పింది చేయకపోతే చంపుతానని బెదిరిస్తోంది. రాజన్‌తో కలిసి సీరియల్ చేస్తున్న నటి మృదుల విజయ్ ఈ వేధింపుల వ్యవహారాన్ని బయటపెట్టింది.
అశ్లీల మెసేజ్‌లు
మృదుల మాట్లాడుతూ.. ఆరేళ్లుగా ఓ అమ్మాయి రాజన్‌కు అసభ్యకర మెసేజ్‌లు చేస్తోంది. తను ఒక జూనియర్ ఆర్టిస్ట్.. అప్పుడప్పుడు సెట్‌కు సైతం వచ్చేది. ఆమె మెసేజ్‌లకు రాజన్ స్పందించకపోతే పిచ్చిపట్టినట్లే ప్రవర్తించేది. వేరేవేరే నంబర్ల నుంచి ఫోన్ చేసి దుర్భాషలాడేది. తర్వాత తనే క్షమాపణలు చెప్పేది. ఆ తర్వాత ఎప్పటిలాగే మళ్లీ అశ్లీల మెసేజ్‌లు చేసేది. మూడేళ్ల నుంచి ఇది మరీ ఎక్కువైంది.
అందుకే మౌనంగా..
ఆరేళ్లుగా ఇంత జరుగుతున్నా రాజన్ స్పందించకపోవడానికి కారణం ఉంది. అమ్మాయి బయటకు వచ్చి ఏదైనా చెప్తే నిజానిజాలు తెలుసుకోకుండా అందరూ తనకే సపోర్ట్ చేస్తారు. అబ్బాయి చెప్పేదాన్ని నమ్మడానికి ఎవరూ ఇష్టపడరు. అతడికి ఎవరూ అండగా నిలబడరు. కానీ, రాజన్‌కు ఓపిక నశించి ఎందుకిలా హింసిస్తున్నావ్? అని ఓరోజు ఎదురుప్రశ్నించాడు. అందుకామె తానే తప్పూ చేయలేదని దబాయించింది.
చొక్కా పట్టుకుని లాగి..
ఒకసారి సెట్‌కు వచ్చి రాజన్‌తో మాట్లాడేందుకు ప్రయత్నించింది. ఆయన సైలెంట్‌గా వెళ్లిపోతుంటే అతడి చొక్కా పట్టుకుని లాగింది. మరోసారి తనను సెట్‌లోకి రానివ్వరని తెలిసి బురఖా వేసుకుని లొకేషన్‌కు వచ్చింది. రాజన్‌తో బలవంతంగా చాక్లెట్ తినిపించాలని చూసింది. నన్ను లెక్కచేయకపోతే బీర్ బాటిల్‌తో తల పగలగొడతా అని అతడ్ని బెదిరించింది.
సీరియల్స్
ఈరోజు చాక్లెట్‌తో వచ్చిన ఆమె రేపు యాసిడ్‌తో రావొచ్చేమో! ఎవరికి తెలుసు? అతడిపై వేధింపులకు పాల్పడ్డ తనపై పోలీసులు కేసు నమోదు చేశారు అని తెలిపింది. రాజన్.. మకల్, ఆత్మసాక్షి, ప్రియపెట్టవల్, తింకల్ కలమాన్, భావన, ఇష్టం మంత్రం అనే మలయాళ సీరియల్స్ చేశాడు. జానీ జానీ ఎస్ అప్పా సినిమాలోనూ యాక్ట్ చేశాడు.


