Mosagallu Review, Rating, in Telugu | ‘మోసగాళ్లు’ మూవీ రివ్యూ | Vishnu Manchu, Kajal Aggarwal - Sakshi
Sakshi News home page

‘మోసగాళ్లు’ మూవీ రివ్యూ

Published Fri, Mar 19 2021 3:45 PM

Mosagallu Movie Review And Rating In Telugu - Sakshi

టైటిల్‌ : మోసగాళ్లు
జానర్ :  క్రైమ్ థ్రిల్లర్ 
నటీనటులు : మంచు విష్ణు, కాజల్‌, సునీల్‌ శెట్టి, నవదీప్‌, నవీన్‌ చంద్ర, రాజా రవీంద్ర తదితరులు
నిర్మాణ సంస్థ : ఏవీఏ ఎంటర్‌టైన్మెంట్, 24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ 
‍కథ, నిర్మాత : మంచు విష్ణు
దర్శకత్వం : జెఫ్రీ గీ చిన్
సంగీతం : సామ్‌ సి.ఎస్‌
సినిమాటోగ్రఫీ : షెల్డన్‌ చావ్‌
ఎడిటర్‌ : గౌతమ్‌ రాజు
విడుదల తేది : మార్చి 19, 2021

స్టార్ హీరో మోహన్ బాబు కుమారుడిగా పరిచయమై మంచు విష్ణు గత కొన్నేళ్లుగా కెరీర్‌లో సరైన హిట్ పడక సతమతమవుతున్నాడు. ఇటీవల ఆయన హీరోగా నటించిన సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద బోల్తాపడ్డాయి.దీంతో సినిమాల నుంచి లాంగ్‌ గ్యాప్ తీసుకున్న విష్ణు.. ఓ భారీ స్కామ్‌ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చి థ్రిల్ చేయడానికి రెడీ అయ్యాడు. ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో 'మోసగాళ్లు' అనే పాన్‌ఇండియా సినిమాతో బరిలోకి దిగాడు. రూ.50 కోట్లకు పైగా కేటాయించి హై టెక్నికల్ వాల్యూస్‌తో ఈ మూవీ తెరకెక్కించారు. ఈ సినిమాకు నిర్మాతగానే కాకుండా రచయితగా కూడా మంచు విష్ణు పనిచేశారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్ మంచి స్పందన వచ్చింది.దీనికి తోడు ప్రమోషన్స్‌ కూడా గ్రాండ్‌గా చేయడంతో ‘మోసగాళ్లు’పై భారీ అంచనాలు పెరిగాయి. మరి ఆ అంచనాలను ‘మోసగాళ్లు’అందుకున్నారా? ఈ సినిమా మంచు విష్ణుని హిట్‌ ట్రాక్‌ ఎక్కించిందా? ఈ ‘మోసగాళ్ల’ని ప్రేక్షకులు ఏ మేరకు ఆదరించారు? రివ్యూలో చూద్దాం.

కథ
అను(కాజల్‌), అర్జున్‌(మంచు విష్ణు) కవల అక్కా తముళ్లు. చిన్నప్పటి నుంచి పేదరికంలో పెరుగుతారు. తండ్రి (త‌నికెళ్ల భ‌ర‌ణి) నిజాయతీ వల్లే తాము పేదలుగా మిగిలిపోయామని ఫీలవుతుంటారు. ఉన్నవాడిని మోసం చేసి రిచ్‌ లైఫ్‌ని ఎంజాయ్‌ చేయాలనుకుంటారు. ఈ  క్ర‌మంలోనే విజ‌య్ (న‌వ‌దీప్‌)తో క‌లిసి ఒక‌ ఫేక్‌ కాల్ సెంట‌ర్ ను ఏర్పాటు చేసి మోసాలు చేద్దామని ప్లాన్‌ వేస్తారు. ఇంట‌ర్న‌ల్ రెవెన్యూ స‌ర్వీస్  పేరుతో అమెరిక‌న్‌ల‌కు ఫోన్ చేసి  ప‌న్ను బ‌కాయిలు చెల్లించాల‌ని బెదిరించి అక్ర‌మంగా డ‌బ్బు సంపాదించ‌డం మొద‌లుపెడ‌తారు. అలా దాదాపు రూ.2,600 కోట్లు కొట్టేస్తారు. భారీ మోసాన్ని ఆలస్యంగా తెలుసుకున్న ఫెడ‌ర‌ల్ ట్రేడ్ క‌మిష‌న్‌, భార‌త ప్ర‌భుత్వం విచారణ కోసం ఎసీపీ కుమార్‌ (సునీల్ శెట్టి) నియమిస్తుంది. ఈ మోసగాళ్లును పట్టుకోవడానికి ఏసీపీ కుమార్‌ చేసిన ప్రయత్నాలు ఏంటి? ఆయన నుంచి తప్పించుకోవడానికి అను, అర్జున్‌ ఎలాంటి ఎత్తులు వేశారు. చివరకు ఈ మోసగాళ్లు ఎలా చిక్కారు? అనేదే మిగతా కథ.

నటీనటులు
అర్జున్‌ పాత్రలో మంచు విష్ణు ఒదిగిపోయాడు. తెరపై ఇంతవరకూ చూడని విష్ణుని ఈ సినిమాలో చూడొచ్చు. కన్నింగ్‌ ఫెలోగా, సీరియస్‌ లుక్‌లో విష్ణు కనిపిస్తాడు. అను పాత్రలో కాజల్‌ పర్వాలేదనిపించింది. ఆమె పాత్రను ఇంకాస్త బలంగా తీర్చిదిద్దితే బాగుండేది. ఎసీపీ కుమార్ భాటియాగా సునీశ్‌ శెట్టి నటన బాగుంది. తన అనుభవాన్ని తెరపై చూడొచ్చు. నవీన్‌ చంద్రా, నవదీప్‌ తదితరులు తమ పాత్రల పరిధిమేరకు నటించారు. 

విశ్లేషణ
‘అతిపెద్ద ఐటీ స్కామ్‌ ఆధారంగా ‘మోసగాళ్ళు’ సినిమా తెరకెక్కింది. హైదరాబాద్‌లోని బస్తీలో ఉండే అక్కాతమ్ముళ్లు టెక్నాలజీ సహాయంతో వేల కోట్లను ఎలా దోచుకున్నారు అనేదే ‘మోసగాళ్లు’ సినిమా కథ. అయితే ఇలాంటి క‌థ‌ను ఎంచుకోవడం సులభమే కానీ, దాన్ని తెరపై  ఎలా థ్రిల్లింగ్‌ చూపించారు అనేదే ముఖ్యం. దానిపైనే సినిమా విజయం ఆధారపడుతుంది. ఈ విషయంలో చిత్ర దర్శకుడు కాస్త తడబడినట్టు అనిపిస్తోంది. సినిమా ఆరంభంలో అను, అర్జున్‌లనేప‌థ్యాన్ని క్లుప్తంగా చూపించేసి, ప్రేక్షకుడిని అసలు కథలోకి తీసుకెళ్లాడు దర్శకుడు జెఫ్రీ గీ చిన్. త‌ర్వాత అర్జున్ ఓ కాల్ సెంటర్‌లో ప‌నిచేయ‌డం.. దాని ద్వారా అక్ర‌మంగా అమెరిక‌న్ల డేటాను సేక‌రించి అమ్మడం.. ఈ క్రమంలో విజయ్ కలిసి ఓ భారీ స్కాంకి స్కెచ్‌ వేయడం.. ఇలా కథని చకచకగా నడిపించి బోర్‌ కొట్టకుండా నడిపించేశాడు.

అయితే అను ఎంట్రీ తర్వాత కొన్ని సన్నివేశాలు కాస్త నెమ్మదిగా, సాదాసీదాగా అనిపిస్తాయి. అలాగే నవీన్‌ చంద్ర, సునీల్‌ శెట్టి మధ్య వచ్చే కొన్ని సీన్లు స్పీడ్‌గా సాగుతున్న కథకు బ్రేకులు వేసినట్లుగా అనిపిస్తాయి.  మ‌రోవైపు ఈ మోసగాళ్లను పట్టుకునేందుకు ఎసీపీ కుమార్ వేసే ఎత్తులు కూడా రొటీన్‌గానే ఉంటాయి. అయితే ఇంటర్వెల్‌ ట్విస్ట్‌ మాత్రం అదిరిపోతుంది. క్లైమాక్స్‌లో సునీల్ శెట్టి, మంచు విష్ణుల‌కి మ‌ధ్య వ‌చ్చే యాక్ష‌న్ ఎపిసోడ్ బాగుంటుంది.. ప్రీ ఇంటర్వెల్ సీన్స్, క్లైమాక్స్ హైలైట్. ఈ సినిమాకు ప్రధాన బలం సామ్‌ సి.ఎస్‌ నేపథ్య సంగీతం. కొన్ని సన్నివేశాలకు తన బీజీఎంతో ప్రాణం పోశాడు. రొటీన్ కథలకు బిన్నంగా ఉన్న ఈ మూవీలో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కాస్త థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చింది. సినిమాటోగ్రఫి, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.

Advertisement
 

తప్పక చదవండి

Advertisement