
టాలీవుడ్ సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు(83).. వారం క్రితం చనిపోయారు. గత కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఈయన కన్నుమూయడంతో తెలుగు సినీప్రముఖులు చాలామంది తమ సంతాపాన్ని తెలియజేశారు. అయితే ఆ రోజు ఊరిలో లేకపోవడంతో ఇప్పుడు వచ్చి కోట కుటుంబాన్ని ప్రముఖ నటుడు మోహన్ బాబు పరామర్శించారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 26 సినిమాలు)
'కోట శ్రీనివాసరావు నాకు అత్యంత ఆప్తుడు. ఆయన అకాల మరణం రోజు నేను హైదరాబాద్‌లో లేను. కోట మరణం తీవ్ర దిగ్భ్రాంతి కలిగించింది. 1987లో వీరప్రతాప్ సినిమాలో మాంత్రికుడుగా అవకాశం ఇచ్చారు. మా బ్యానర్‌తో పాటు బయట బ్యానర్‌లోనూ ఆయనతో చాలా సినిమాలు చేశా. ఏ పాత్రనైనా అవలీలగా పోషించగలిగిన నటుడు. ఏ డైలాగ్ అయినా విలన్‌గా కమెడియన్‌గా డిఫరెంట్ టైప్ ఆఫ్ మాడ్యులేషన్‌లో చెప్పగలిగే నటుడు కోట. మా ఫ్యామిలీకి ఆయన అత్యంత సన్నిహితులు. ఆయన మరణం నా కుటుంబానికే కాదు, సినిమా పరిశ్రమకే తీరని లోటు. వారి ఆత్మకు శాంతి, వారి కుటుంబానికి మనశ్శాంతి కలగాలని కోరుకుంటున్నాను' అని మోహన్ బాబు చెప్పుకొచ్చారు.
(ఇదీ చదవండి: జర్నీ మొదలైంది.. 'వరల్డ్ ఆఫ్ కాంతార' వీడియో రిలీజ్)