
ప్రపంచ సుందరి- 2025 (Miss World Competitions 2025) పోటీలు హైదరాబాద్‌లో అట్టహాసంగా సాగుతున్నాయి. ఈ ఏడాది కిరీటాన్ని అందుకునే అందాల రాశి ఎవరా? అని ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తుంది. మిస్ వరల్డ్ అవ్వాలనే ఆశయంతో ప్రపంచవ్యాప్తంగా ఏటా కోటికి పైగానే అమ్మాయిలు ఈ పోటీలకు దరఖాస్తు చేసుకుంటారు. 160కంటే ఎక్కువ దేశాలే ఈ పోటీల్లో పాల్గొంటాయి. అందుకే బ్యూటీ వరల్డ్‌లో ఈ పోటీలకు అంత ప్రత్యేకత ఉంటుంది. ఇంతటి ప్రతిష్టాత్మకత కలిగిన ఈ పోటీలలో గెలుపొందిన మన భారతీయ సుందరిలు ఆరుగురు ఉన్నారు.

భారత్ నుంచి ఆరుగురు అందాల భామలు ఈ కిరీటాన్ని అందుకున్నారు. మొట్టమొదటిసారి ముంబైకి చెందిన రీటా ఫరియా (1966)లో ఈ కిరిటాన్ని దక్కించుకుంది. మిస్ వరల్డ్‌గా ఎంపికైన తొలి మెడికల్ డాక్టర్ కూడా ఆమె కావడం విశేషం. గెలిచిన తర్వాత సినిమాల్లో ఆమెకు చాలా అవకాశాలు వచ్చాయి. కానీ, ఆమె తన డాక్టర్ వృత్తిని చాలా సీరియస్‌గా తీసుకున్నారు. ఆ తర్వాత ఐశ్వర్యా రాయ్ (1994), డయానా హెడెన్ (1997), యుక్తాముఖి (1999), ప్రియాంక చోప్రా (2000), మానుషి చిల్లర్ (2017) ప్రపంచ సుందరీమణులుగా నిలిచారు. ప్రపంచంలో ఇప్పటివరకూ అత్యధిక కిరీటాలు (6) గెలిచిన దేశాల జాబితాలో భారత్‌తో పాటు వెనిజులా ప్రథమ స్థానంలో ఉంది.

ముఖ్యంగా 2000సంవత్సరంలో భారత్ పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగింది. ఆ ఏడాదిలో ప్రియాంక చోప్రా(మిస్ వరల్డ్), లారా దత్తా (మిస్ యూనివర్స్) దియా మిర్జా (మిస్ ఆసియా పసిఫిక్)గా గెలవడంతో ఒకే ఏడాది మూడు ఇంటర్నేషనల్ బ్యూటీ పాజెంట్ టైటిళ్లు సాధించిన ఏకైక దేశంగా భారత్ నిలిచింది. అలా బ్యూటీ వరల్డ్‌లో భారత్‌కు ప్రత్యేకమైన స్థానం ఉంది.