Meka Ramakrishna: నీచాతినీచం, అవమానంతో చచ్చిపోదామనుకున్నా!

Meka Ramakrishna Reveals His Struggles In Industry - Sakshi

మేకా రామకృష్ణ.. వందలాది సినిమాలు చేసిన అనుభవం ఆయనది. సినిమాలే కాదు బుల్లితెరపై సీరియళ్లు కూడా చేస్తూ ప్రేక్షకులకు చేరువయ్యాడీయన. ఆయన పేరు చెప్తే గుర్తు పట్టరేమో కానీ ఆకారం చూస్తే మాత్రం ఇట్టే గుర్తుపడతారు. తాజాగా అతడు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఇండస్ట్రీలో జరిగే అరాచకాలను బయటపెట్టాడు. సెట్స్‌లో ఆర్టిస్టులను దారుణంగా చూస్తారంటూ ఆవేదన చెందాడు.

'సినిమా ప్రొడక్షన్‌ బాయ్స్‌ చిన్న ఆర్టిస్టులను చులకగా చూస్తారు. అది ఒకరకంగా నరకం! చాలాసార్లు కళ్లల్లో నీళ్లు తిరిగాయి. అడుక్కునేవాడికి కూడా ఇదిగో తీస్కో అని మర్యాదగా ఇస్తాం, కానీ ప్రొడక్షన్‌ బాయ్స్‌ నీచాతినీచంగా ప్రవర్తిస్తారు. ఒక్కోసారి వాళ్లను నరికేయాలన్నంత కోపం వస్తుంది. ప్రొడ్యూసర్స్‌ ఏం చేస్తున్నారంటే ఫుడ్‌ పెట్టేదగ్గర నాలుగైదు కేటగిరీలు పెట్టేస్తున్నారు. మనం పొరపాటున మనకి కేటాయించిన దాంట్లో కాకుండా పక్కదాంట్లోకి వెళ్లామంటే హీనంగా చూస్తారు. హీరోలు, నిర్మాతలకు ఒకచోట, టెక్నికల్‌, డైరెక్షన్‌కు మరో దగ్గర, జూనియర్‌ ఆర్టిస్టులకు ఇంకో చోట, సెకండ్‌ గ్రేడ్‌ టెక్నీషియన్లకు మరో చోట టెంట్‌ వేస్తున్నారు.

అక్కడ సపోర్టింగ్‌ ఆర్టిస్టులను నీచాతినీచంగా ట్రీట్‌ చేస్తారు. ఈ పాపం మీకు తగులుతుంది, నాశనం అయిపోతారు అని నేను తిట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. నేనే కాదు, ఎంతోమంది కళ్లలో నీళ్లు పెట్టుకున్నారు. కానీ ఈ విషయాలన్నీ దర్శక నిర్మాతలకు తెలియదు. ప్రొడక్షన్‌ బాయ్స్‌ని పొరపాటున ఎవరైనా తిడితే వాళ్లకు కాఫీలో మోషన్‌ టాబ్లెట్లు కలిపి ఇస్తారు. జయసుధగారికే అలా చేశారు. టాయ్‌లెట్‌లో ఉండే నీళ్లను మంచినీళ్లుగా ఇచ్చేవారు. ఇలా చాలా జరిగాయి. అందరినీ అనట్లేదు, కొంతమందినే అంటున్నా.

ఒకసారి ఏమైందంటే.. సెట్‌లో ఎనిమిది మందితో భోజనం చేయడానికి కూర్చున్నా. వాళ్లందరికి వేడివేడిగా అక్కడే వండిన రైస్‌ వడ్డిస్తే నాకు మాత్రం బయట నుంచి తెచ్చిన అన్నం సెపరేట్‌గా పెట్టారు. అదేంటయ్యా, నాకూ అదే పెట్టొచ్చుగా అంటే మీకంత రేంజ్‌ లేదు, ఇక్కడెందుకు కూర్చున్నారని అడిగాడు. డైరెక్టర్‌, హీరోహీరోయిన్ల ముందు అలా అనేసరికి కళ్లలో నీళ్లు తిరిగాయి. నాకు జరిగిన అవమానానికి చచ్చిపోవాలనుకున్నా.

షూటింగ్‌ లొకేషన్లలో హీరోయిన్లకే రూమ్‌ ఇచ్చి మిగతావాళ్లకు ఎవరికీ రూమ్‌ ఇవ్వరు. వాళ్లు బయట ఏ చెట్టు కిందో కూర్చుంటారు. ఇలాంటివి బయటపెడుతుంటే అవకాశాలివ్వడం లేదు. మేల్‌ ఆర్టిస్టులకు రెమ్యునరేషన్‌, పరువు మర్యాద ఏమీ ఉండట్లేదు. నిర్మాతలు ఒప్పుకున్నా ఛానల్‌ వాళ్లు మాత్రం నాలాంటి వాళ్లకు అవకాశాలివ్వడం లేదు' అని చెప్తూ మేకా రామకృష్ణ ఆవేదన చెందాడు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top