
ప్రముఖ నటి మనీషా కొయిరాలాకు అరుదైన గౌరవం దక్కింది. లండన్‌లోని ‘యూనివర్సిటీ ఆఫ్ బ్రాడ్‌ఫోర్డ్’ ఆమెకు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. ఈ విషయాన్ని తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకున్నారు మనీషా. అలాగే డాక్టరేట్ అందుకుంటున్న వీడియోను కూడా షేర్ చేశారు. ‘‘యూకే సిటీ ఆఫ్ కల్చర్–2025’ ఏడాదిలో బ్రాడ్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ అందుకోవడం చాలా సంతోషంగా ఉంది. క్రియేటివ్ డైరెక్టర్ డేనియల్ లీతో కలిసి ఈ గుర్తింపును పంచుకోవడం మరింత ఆనందాన్నిచ్చింది.
నేను సంప్రదాయ విద్యా మార్గం ద్వారా వచ్చిన వ్యక్తిగా ఇక్కడ నిలబడలేదు. జీవితంలో ఎదుర్కొన్న కష్టాలు, వైఫల్యాల నుంచి పాఠాలు నేర్చుకున్న వ్యక్తిగా నిలబడ్డాను. మా అమ్మమ్మ సుశీలా కొయిరాలా నా మొదటి గురువు. పుస్తకాలు చదవడం, జీవిత విలువలు, భరతనాట్యం, మణిపురి నృత్యం వంటివి చిన్నతనంలో ఆమె నుంచే నేర్చుకున్నాను. ‘యూనివర్సిటీ ఆఫ్ బ్రాడ్‌ఫోర్డ్’ డాక్టరేట్ పొందడం గౌరవంగా భావిస్తున్నాను... ఈ గౌరవం మాటల్లో చెప్పలేనంత విలువైనది.
నా కథ (జీవితాన్ని ఉద్దేశించి)కు విలువ ఇచ్చి గుర్తించిన ‘యూనివర్సిటీ ఆఫ్ బ్రాడ్‌ఫోర్డ్’కి ధన్యవాదాలు. నా ప్రయాణం ఇప్పుడే ప్రారంభమైంది’’ అంటూ పోస్ట్ చేశారు మనీషా కొయిరాలా. ఇదిలా ఉంటే... చాలా విరామం తర్వాత ‘లస్ట్ స్టోరీస్’ (2018) తో రీ ఎంట్రీ ఇచ్చిన ఆమె ‘హీరామండి: ది డైమండ్ బజార్’ (2024) అనే వెబ్ సిరీస్‌లో మల్లికాజాన్ అనే వేశ్య పాత్రలో మనీషా కొయిరాలా నటించి, మెప్పించారు.