Mohan Babu: పేర్ని నానిని బ్రేక్‌ఫాస్ట్‌కు పిలిచాను, అంతమాత్రానికే!

manchu mohan babu press meet about son of india - Sakshi

‘‘ఎలాంటి తప్పు చేయని ఓ సాధారణ వ్యక్తి ఒక ఎమ్మెల్యే కారణంగా జైలుకి వెళతాడు. అప్పుడు అతని కుటుంబ సభ్యులు ఎంత ఇబ్బంది పడ్డారు? అతను జైలు నుంచి ఎలా బయట పడ్డాడు? తనలాగే ఏ నేరం చేయకుండా జైలులో మగ్గిపోతున్న వారికి ఎలా అండగా నిలిచాడు? అనే కథాంశంతో ‘సన్నాఫ్‌ ఇండియా’ ఉంటుంది’’ అని హీరో మంచు మోహన్‌బాబు అన్నారు. ‘డైమండ్‌’ రత్నబాబు దర్శకత్వంలో  మోహన్‌బాబు లీడ్‌రోల్‌లో నటించిన చిత్రం ‘సన్నాఫ్‌ ఇండియా’. మంచు విష్ణు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 18న విడుదలకానుంది. ఈ సందర్భంగా మోహన్‌బాబు విలేకరులతో పంచుకున్న విశేషాలు....

► ‘సన్నాఫ్‌ ఇండియా’ మొదలు పెట్టి దాదాపు మూడేళ్లు అయింది. ఈ సినిమా కథని ‘డైమండ్‌’ రత్నబాబు చెప్పినప్పుడు ఒక విభిన్న కథ, చాలా బాగుందనిపించింది. మా గురువుగారు(దాసరి నారాయణరావు) కూడా ఎన్నో ప్రయోగాలు చేశారు.. నేను కూడా చూద్దామని ఈ చిత్రం చేశాను. మా మూవీ సూపర్‌ హిట్‌ అవుతుందని చెప్పను. కానీ ప్రేక్షకులు చాలా మంచి సినిమా అని అంటారు. మా చిత్రం యువతరంతో పాటు అందరికీ నచ్చుతుంది.
► ‘సన్నాఫ్‌ ఇండియా’ ని తొలుత ఓటీటీ కోసం తీశాం. కథకు అవసరం మేరకు ఇద్దరు అమ్మాయిల మధ్య ముద్దు సన్నివేశాలు కూడా చిత్రీకరించాం. వీటిని విష్ణు ఒప్పుకోలేదు. కానీ, కథకు ఉన్న ప్రాధాన్యత మేరకు పెట్టాల్సి వచ్చింది.
► ‘రాయలసీమ వాళ్లకు భాష తెలియదు’ అనే మాటలు నా కెరీర్‌ తొలినాళ్లలో ఎదుర్కొన్నాను. నిజం చెప్పాలంటే స్వచ్ఛమైన తెలుగు భాష పుట్టింది తిరుపతిలోనే. ఆయా ప్రాంతాల్లో యాసలు వేరు ఉండొచ్చు కానీ భాష ఒక్కటే. భారతదేశంలో విలన్‌గా ఎక్కువ మేనరిజమ్స్‌ చూపించిన వ్యక్తి నేనే. ఈ విషయంలో నటులు అమ్రిష్‌ పురిగారు నన్ను అభినందించారు.
► ఈ మూవీలో నాది చాలా వైవిధ్యమైన పాత్ర. డైలాగ్స్, ఎక్స్‌ప్రెషన్స్‌ అందరూ అభినందించేలా ఉంటాయి. నా పాత్రని ప్రతి ఒక్కరూ ఎంజాయ్‌ చేస్తారు.

► సమాజంలో హత్యలు, మానభంగాలు చేసేవాళ్లను సమాధి చేయాలి. సొసైటీలో ప్రైవేట్‌ స్కూల్స్, హాస్పిటల్స్, బస్‌లు, విమానాలు ఉన్నప్పుడు ప్రైవేట్‌ జైళ్లు కూడా ఉంటే తప్పేంటి? అని ప్రశ్నిస్తున్నాం.

► నేను డైరెక్షన్‌ చేయడానికి రెండు కథలు సిద్ధంగా ఉన్నాయి.. సినిమా తీసేటప్పుడు షూటింగ్‌కి సమయానికి రానివారిని ఎక్కడ కొట్టాల్సి వస్తుందేమోఅని భయంగా ఉంది. నా జీవితంపై రాస్తున్న పుస్తకం పూర్తి కావొచ్చింది. నా బయోపిక్‌తో సినిమా చేయాలనే ఆలోచన ప్రస్తుతానికి లేదు. లక్ష్మి–నేను కలిసి చేస్తున్న సినిమా శనివారం ప్రారంభమైంది. విష్ణుతో కూడా ఓ మూవీ చేస్తా. తిరుపతిలో నాలుగున్నర కోట్లతో సాయిబాబా గుడి నిర్మిస్తున్నాం. ఏప్రిల్‌ లేదా మేలో ప్రారంభమవుతుంది.

ప్రత్యక్ష రాజకీయాల్లోకి మళ్లీ రావాలనే ఆసక్తి లేదు. ఈ జన్మకు వద్దనుకుంటున్నాను. ఏపీ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి, మాజీ సీఎం చంద్రబాబు నాయుడుగార్లు నాకు బంధువులు కాబట్టి వారి తరఫున నా బాధ్యతగా ఎన్నికల్లో ప్రచారం చేశాను. ఇప్పుడు నేను సినిమాలు, శ్రీ విద్యానికేతన్‌ యూనివర్సిటీ పనులతో బిజీగా ఉన్నాను.

► ప్రతి రాజకీయ పార్టీలోనూ నాకు బంధువులు, స్నేహితులున్నారు. ఏపీ మంత్రి పేర్ని నానీతో పదేళ్లకుపైగా అనుబంధం ఉంది. మంత్రి బొత్స సత్యనారాయణగారి అబ్బాయి పెళ్లిలో నాని, నేను కలిశాం. బ్రేక్‌ఫాస్ట్‌కి తనని ఇంటికి ఆహ్వానించాను.. వచ్చారు. ఇద్దరం సరదాగా మాట్లాడుకున్నామే కానీ మా మధ్య సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన విషయాలపై కానీ, సీఎం జగన్‌గారితో జరిగిన భేటీ గురించి కానీ ఎలాంటి చర్చ జరగలేదు. అప్పుడప్పుడూ కలుద్దాం అనుకున్నాం. అంతే.. దానిపై రకరకాలుగా వార్తలు సృష్టించారు. నానీకి శుభాకాంక్షలు చెబుతూ విష్ణు చేసిన ట్వీట్‌ను కూడా తప్పుబట్టారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top