
మలయాళ స్టార్ మమ్ముట్టి కొంత గ్యాప్ తర్వాత తిరిగి సినిమా సెట్స్‌లోకి అడుగుపెడుతున్నారు. ఈ ఏడాది జూన్‌లో ముమ్ముట్టి తీవ్ర అస్వస్థతకు గురయ్యారనే వార్తలు తెరపైకి వచ్చాయి. కానీ మమ్ముట్టి ఆరోగ్య సమస్య స్వల్పమైనదేనని, ప్రస్తుతం ఆయన పూర్తి ఆరోగ్యంతో ఉన్నారని దర్శకుడు మహేశ్ నారాయణన్ పేర్కొన్నారు. మమ్ముట్టి, మోహన్‌లాల్ ప్రధాన పాత్రధారులుగా ఫాహద్ ఫాజిల్, కుంచాకో బోబన్ కీలక పాత్రల్లో నటిస్తున్న మలయాళ చిత్రం ‘పేట్రియాట్’.
ఈ సినిమా చిత్రీకరణ సమయంలో మమ్ముట్టి అస్వస్థతకు గురయ్యారు. కాగా ఈ సినిమా కొత్త షెడ్యూల్ నేడు హైదరాబాద్‌లో ప్రారంభం కానుందని తెలిసింది. ‘‘జీవితంలో నాకు ఎంతో ఇష్టమైన పనిని (సినిమా షూటింగ్‌ని ఉద్దేశించి) తిరిగి ప్రారంభిస్తున్నాను. నా ఆబ్సెన్స్‌లో నా గురించి తెలుసుకోవాలనుకున్న అందరికీ థ్యాంక్స్ చెప్పడానికి మాటలు సరిపోవు.
ది కెమెరా ఈజ్ కాలింగ్’’ అంటూ ‘ఎక్స్’లో పేర్కొన్నారు మమ్ముట్టి. అలాగే ఈ విషయంపై మహేశ్ నారాయణన్ మాట్లాడుతూ– ‘‘మమ్ముట్టిగారు తిరిగి సినిమా సెట్స్‌లోకి వస్తున్నందుకు థ్రిల్లింగ్‌గా ఉంది. రాబోయే షూటింగ్ షెడ్యూల్‌లో మమ్ముట్టి, మోహన్‌లాల్ కాంబినేషన్‌లోని సన్నివేశాలను చిత్రీకరిస్తాం. ఇన్ని రోజులు మమ్ముట్టిగారు సెట్స్‌కు రాకపోవడం వల్ల నష్టం వాటిల్లకుండా ఆయన లేని సీన్స్ చిత్రీకరించాం’’ అని పేర్కొన్నారు.