టాలీవుడ్ రేంజు పెరిగిపోయింది. అబ్బో పాన్ ఇండియా సినిమాలు తీసేస్తున్నాం అని చాలామంది సంబరపడిపోతున్నారు గానీ గ్రౌండ్ లెవల్ పరిస్థితి అస్సలు బాగోలేదు. మిగతా విషయాల్ని కాసేపు పక్కనబెడితే ఈ ఏడాది సంక్రాంతికి రిలీజైన ఒకటి రెండు సినిమాలు తప్పితే తర్వాత నుంచి వరసపెట్టి ఫ్లాపులే. కొన్ని చిత్రాలు యావరేజ్ టాక్ దగ్గరే ఆగిపోతున్నాయి. గత మూడు నెలలుగా టాలీవుడ్‌లో సరైన హిట్ లేదు. అలాంటిది మలయాళంలో మాత్రం చిన్న చిత్రాలు వరసపెట్టి వందల కోట్ల వసూళ్లు సాధిస్తూ అందరూ అవాక్కయ్యేలా చేస్తున్నాయి? ఇంతకీ ఇదెలా సాధ్యం? వాళ్ల సినిమాలే ఎందుకు ఆడుతున్నాయి?
(ఇదీ చదవండి: ఆరో క్లాస్ నుంచి చేస్తున్నా.. నా దగ్గర 1000 పాటలున్నాయి)
ఒకప్పుడు మలయాళ సినిమా అంటే చిన్నచూపు ఉండేది కానీ గత కొన్నేళ్లుగా ఈ ఇండస్ట్రీకి రీచ్ బాగా పెరిగింది. లాక్‌డౌన్ తర్వాత అన్ని భాషల ప్రేక్షకులు ఈ భాష చిత్రాల్ని చూసేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. దానికి తగ్గట్లే మలయాళీ దర్శకులు.. అందరరికీ కనెక్ట్ అయ్యే కంటెంట్‌లతో సినిమాలు తీస్తున్నారు. గత నెలలో 'ధురంధర్ 2'తో పాటు రిలీజై 'ఆడు 3' అనే చిత్రం సెన్సేషన్ సృష్టించింది. రూ.100 కోట్లకు పైనే వసూళ్లు సాధించింది. తాజాగా 'భరతనాట్యం 2', 'వాలా 2' అనే చాలా చిన్న బడ్జెట్ చిత్రాలు కూడా వరసగా రూ.100, రూ.200 కోట్ల కలెక్షన్స్ అందుకున్నాయి.
తెలుగు, తమిళ, కన్నడ, హిందీలో రీసెంట్ టైంలో సక్సెస్ కోసం అందరూ ఇబ్బంది పడుతుంటే మలయాళంలో మాత్రం వరస హిట్స్ కొడుతున్నారు. దీనికి కారణాలు ఏంటా అని చూస్తే చాలా సింపుల్. మలయాళీ దర్శకులు.. అనవసర ఆర్భాటాలు పేరిట గిమ్మిక్కులు చేయరు. వందల కోట్ల బడ్జెట్ పెట్టి ఏళ్లకు ఏళ్లు మూవీస్ తీయరు. పరిమిత బడ్జెట్, తక్కువ వర్కింగ్ డేస్‌లో ఎలాంటి చిత్రాన్ని అయినా పూర్తి చేస్తారు. కథను నమ్మి, వైవిధ్యమైన ఐడియాలతో ప్రేక్షకులకు కొత్తదనం పంచాలని చూస్తారు. సహజమైన వాతావరణంలోనే ఎక్కువగా సినిమాలు తీయడం ఇంకో ప్లస్. అందుకే ఆ సినిమాలు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటున్నాయి
మరోవైపు టాలీవుడ్ పరిస్థితి చూస్తే.. ఓటీటీ మార్కెట్ దారుణంగా పడిపోతూ వస్తోంది. దీంతో భారీ బడ్జెట్ సినిమాల పరిస్థితి అగమ్యగోచరంగా మారిపోయింది. కొందరు మిడ్ రేంజ్ హీరోలకు పెద్ద మార్కెట్ లేకపోయినా వీళ్లపై కొందరు నిర్మాతలు.. భారీతనం పేరిట, హంగులు, ఆర్భాటాల పేరిట కోట్లకు కోట్లు ఖర్చు చేసేస్తున్నారు. బిజినెస్ మాత్రం దానికి తగ్గట్లు జరగట్లేదు. సరేలే ఎలాగోలా కానిచ్చేసి థియేటర్లలో రిలీజ్ చేస్తే.. చూసేందుకు ప్రేక్షకులు రావట్లేదు. వీటిలో ప్లానింగ్ లోపం స్పష్టంగా కనిపిస్తోంది.
తెలుగు ప్రేక్షకుల్ని ఎగ్జైట్ చేసే కంటెంట్ కాకుండా పాన్ ఇండియా పేరిట గిమ్మిక్కులు చేద్దామని చాలామంది దర్శకనిర్మాతలు అనుకుంటున్నారు. అలాంటివి పసిగట్టేస్తున్న ఆడియెన్స్.. సదరు సినిమాల్ని లైట్ తీసుకుంటున్నారు. అందుకే తెలుగు దర్శకులు ఇకపై కంటెంట్‌ని నమ్ముకుని మూవీస్ తీస్తే బెటర్. లేదంటే ముందుముందు పరిస్థితి ఇంకా దారుణంగా తయారవుతుంది. మలయాళం లాంటి పరభాషా చిత్రాలకు ఆదరణ పెరగడం గ్యారంటీ.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి తెలుగు డిస్ట్రబింగ్ సినిమా)


