మెట్రోలో వెళ్తున్నారా.. బిగ్‌బాస్ మిమ్మల్ని గమనిస్తున్నారు జాగ్రత్త..!  | L and T Metro Rail And Bigg Boss Star Maa Campaign On Travel Safety Instructions | Sakshi
Sakshi News home page

Bigg Boss Star Maa Campaign: ' బిగ్‌బాస్ మిమ్మల్ని గమనిస్తున్నారు'.. వినూత్నంగా హైదరాబాద్‌ మెట్రో ప్రచారం

Published Sat, Nov 12 2022 9:25 PM | Last Updated on Sat, Nov 12 2022 9:30 PM

L and T Metro Rail And Bigg Boss Star Maa Campaign On Travel Safety Instructions - Sakshi

హైదరాబాద్ ఎల్‌ అండ్‌ టీ మెట్రో రైల్‌ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రయాణికులకు అవగాహన కల్పించేందుకు బిగ్‌బాస్‌ను బరిలోకి దించింది. సురక్షిత ప్రయాణంపై సామాజిక సందేశాన్ని స్టార్ మా, ఎల్‌ అండ్‌ టీ మెట్రో  సంయుక్తంగా ప్రచారం కల్పిస్తున్నాయి. ఇందులో భాగంగా స్టార్‌ మా బిగ్‌బాస్‌ సీజన్‌ -6 హోస్ట్‌ కింగ్ నాగార్జున చేతుల మీదుగా బిగ్‌బాస్‌ ఈజ్‌ వాచింగ్‌ యు (బిగ్‌బాస్‌ మిమ్మల్ని చూస్తున్నాడు) అనే పోస్టర్‌ను ఆవిష్కరించారు.

హైదరాబాద్‌ మెట్రో రైల్‌లో ప్రయాణించేటప్పుడు అనుసరించాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా ‘బిగ్‌ బాస్‌ ఈజ్‌ వాచింగ్‌ యు’ ప్రచారం ప్రారంభించారు.ఈ కార్యక్రమాన్ని నగరంలోని 57 మెట్రో స్టేషన్‌లలోని  కాన్‌కోర్స్‌, ఎంట్రీ అండ్ ఎగ్జిట్‌, చెక్‌ ఇన్‌ ప్రాంగణాలలో చేస్తున్నారు. ప్రత్యేకంగా తీర్చిదిద్దిన జింగిల్స్‌తో పాటుగా అదే తరహా సందేశాలను సైతం అన్ని మెట్రో రైళ్లలోనూ ప్రచారం చేస్తున్నారు. ఈ క్యాంపెయిన్‌ను మొత్తం బిగ్‌బాస్‌ సీజన్‌లో 100 రోజులూ ప్రచారం చేయనున్నారు. ప్రయాణ సమయాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటుగా మెట్రో స్టేషన్‌ ప్రాంగణాలలో అనుసరించాల్సిన విధానాలపై అవగాహన కల్పించనున్నారు. ఇందులో భాగంగా భద్రతా ప్రమాణాలు, మెట్రో నిబంధనల పట్ల అవగాహన కల్పించేందుకు కృషి చేయనున్నారు.

(చదవండి: బన్నీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. పుష్ప-2 ఫస్ట్ గ్లింప్స్ ఆరోజే..!)

బిగ్‌బాస్‌ హోస్ట్‌ అక్కినేని నాగార్జున మాట్లాడుతూ.. 'వినోదంతో పాటుగా ఓ సహేతుకమైన సందేశమూ ఉండాలి. ఈ ప్రచారం ఆ విధానానికి చక్కటి ప్రాతినిధ్యం వహిస్తుంది. బిగ్‌బాస్‌ అనేది పూర్తి వినోదాత్మక కార్యక్రమం. భావోద్వేగాలను తట్టి లేపుతుంది. ఈ ప్రచారం ద్వారా  భద్రత పట్ల మరింత అవగాహన  సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ప్రయాణికులకు చక్కటి విలువను జోడించనుంది.  స్టార్‌ మా, ఎల్‌టీఎంఆర్‌హెచ్‌ఎల్‌ ఈ తరహా బాధ్యతాయుతమైన ప్రచారం కోసం ముందుకు రావడం సంతోషంగా ఉంది' అని అన్నారు.

ఎల్‌ అండ్‌ టీ మెట్రో రైల్ సీఈవో కేవీబీ రెడ్డి మాట్లాడుతూ.. 'స్టార్‌ మా బిగ్‌బాస్‌తో విజయవంతంగా మూడో ఏడాది భాగస్వామ్యం చేసుకున్నాం. ఈ భాగస్వామ్యంలో భాగంగా మేము ‘బిగ్‌బాస్‌ ఈజ్‌ వాచింగ్‌ యు’ ప్రచారం ప్రారంభించాము. దీని ద్వారా భద్రతా అవగాహన, సురక్షిత ప్రయాణ పద్ధతుల పట్ల ప్రజలకు అవగాహన కల్పించడమే మా లక్ష్యం. ఈ ప్రచారం ద్వారా స్మార్ట్‌ ట్రావెల్‌ అలవాట్లను పెంపొందించేందుకు ప్రయత్నిస్తున్నాం. దీనిద్వారా మెట్రో ప్రయాణీకులు  మొబైల్‌ క్యూఆర్‌ టిక్కెట్లు, స్మార్ట్‌ కార్డులు వినియోగించాల్సిందిగా చెబుతున్నాం. సూపర్‌ స్టార్‌ నాగార్జున,  స్టార్‌ మా నెట్‌వర్క్‌కు నా అభినందనలు తెలియజేస్తున్నా' అని అన్నారు.

(చదవండి: ఫైమాను అడల్ట్‌ కామెడీ స్టార్‌ అన్నావు, మరి నిన్నేమనాలి?: నాగ్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
Advertisement