కుంభమేళాలో పూసలు, రుద్రాక్ష మాలలు అమ్ముతూ సోషల్‌మీడియాలో గుర్తింపు పొందిన ‘మోనాలిసా భోంస్లే’ తల్లి కాబోతున్నట్లు ఆమె భర్త ఫర్మాన్ తెలిపాడని కథనాలు వస్తున్నాయి. తల్లిదండ్రులను కాదని కేరళకు చెందిన ఫర్మాన్ అనే యువకుడిని ప్రేమించి మార్చి 11న ఒక ఆలయంలో వివాహం చేసుకుంది. అయితే, పోలీసు దర్యాప్తులో మోనాలిసా మైనర్ అని తేలడంతో ఆమె భర్తపై పోక్సో కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసు విచారణలో భాగంగా మోనాలిసాను విచారణకు హాజరు కావాలని తెలిపారు.
మోనాలిసా పుట్టిన ఆసుపత్రి రికార్డుల ప్రకారం పెళ్లి జరిగిన నాటికి ఆమె వయసు 16 ఏళ్ల 2 నెలల 12 రోజులేనని అధికారికంగా తేలింది. దీంతో మోనాలిసా భర్తపై పోక్సో కేసు నమోదు చేయడంతో చిక్కుల్లో పడ్డాడు. ఈ అంశంపైన ఆమెను విచారించాలని పోలీసులు ప్రయత్నం చేశారు. అయితే, తన భార్య మోనాలిసా ప్రస్తుతం ప్రెగ్నెంట్ కావడంతో ఈ విచారణ కోసం ప్రయాణం చేయలేదని మధ్యప్రదేశ్ పోలీసులతో ఫర్మాన్ ఖాన్ తెలియజేశారని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం మోనాలిసా కేరళలో ఉంది.
మోనాలిసా తల్లి కాబోతుందని ఫర్మాన్ పోలీసులు వద్ద తెలిపారని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే, ఆమె నిజంగానే తల్లి కాబోతుందా..? లేదా కేసు నుంచి తప్పించుకునేందుకు ఫర్మాన్ ఏమైనా ప్లాన్ చేశాడా అనే రూమర్స్ కూడా వినిపిస్తున్నాయి.


