Rajinikanth- KS Ravikumar: 'ఆ సినిమా డిజాస్టర్‌కు రజనీనే కారణం' | KS Ravikumar Makes Shocking Statement on Lingaa Story | Sakshi
Sakshi News home page

Rajinikanth- KS Ravikumar: 'ఆ సినిమా డిజాస్టర్‌కు రజనీనే కారణం'

Jul 21 2022 2:25 AM | Updated on Jul 21 2022 2:25 AM

KS Ravikumar Makes Shocking Statement on Lingaa Story - Sakshi

కేఎస్‌ రవికుమార్, రజినీకాంత్‌  

రజినీకాంత్, దర్శకుడు కేఎస్‌ రవికుమార్‌ కాంబినేషన్‌ అంటే సక్సెస్‌కు చిరునామా అనే పేరు ఉండేది. వీరి కాంబినేషన్‌లో ముత్తు, పడయప్ప సెన్సేషనల్‌ హిట్‌ చిత్రాలుగా రూపొందాయి. అలాంటిది 2014లో వీరి కాంబినేషన్‌లో వచ్చిన లింగ చిత్రం నిరాశపరచింది. ఆ తరువాత వీరి కాంబినేషన్‌లో ఇప్పటి వరకు చిత్రం రాలేదు. ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఉంది. కానీ లింగ చిత్రం డిజాస్టర్‌గా నిలవడంతో రజినీకాంత్‌ అభిమానులు దర్శకుడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆయన సరిగా తెరకెక్కించలేదంటూ విమర్శలు గుప్పించారు. వాటిపై దర్శకుడు అప్పట్లో స్పందించలేదు. అలాంటిది సుమారు 8 ఏళ్ల తరువాత స్పందిస్తూ.. లింగ చిత్ర పరాజయానికి రజినీకాంత్‌ కారణమని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈయన ఇటీవల ఒక యూట్యూబ్‌ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొంటూ లింగ చిత్రంలో క్‌లైమాక్స్‌ లో వచ్చే బెలూన్‌ ఫైట్‌ను తాము ముందుగా అనుకోలేదన్నారు.

ఒకసారి హైదరాబాదులో షూటింగ్‌ జరుగుతుండగా రజినీ అప్పటి వరకు చిత్రీకరించిన సన్నివేశాలను చూడాలని కోరారన్నారు. దీంతో ఆయనకు చూపించగా చిత్రంలో తాను కోరుకున్న సన్నివేశాలను పొందుపరచాలని ఆయన కోరారన్నారు. అయితే ఆయన చెప్పిన సూచనలు తన సహాయ దర్శకులకు కూడా నచ్చలేదన్నారు. అయినా లింగ చిత్రాన్ని రజినీకాంత్‌ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేయాల్సిన పరిస్థితి నెలకొనడంతో తగిన సమయం లేకపోవడంతో ఆయన చెప్పినట్టుగానే చిత్రాన్ని హడావుడిగా పూర్తి చేసినట్లు తెలిపారు. ఆ విధంగా లింగ చిత్రం ప్లాప్‌కు రజినీకాంత్‌ కారణమని కేఎస్‌ రవికుమార్‌ పేర్కొన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement