
కోలీవుడ్ స్టార్ హీరో జయం రవి పేరు ఇటీవల ఎక్కువగా వినిపిస్తోంది. ఎందుకంటే తన భార్య ఆర్తితో ఆయన విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వీరిద్దరి విడాకుల పంచాయితీ కోర్టులో ఉంది. అయితే జయం రవి కుటుంబానికి దూరంగా సింగిల్‌గానే ఉంటున్నారు. ఇటీవల ఓ పెళ్లి వేడుకలో జయం రవి సందడి చేశారు. అదే పెళ్లికి ఆయన గర్ల్ ఫ్రెండ్‌గా భావిస్తోన్న సింగర్ కెన్నీషా కూడా హాజరైంది. దీంతో మరోసారి వీరిద్దరి పంచాయతీ హాట్‌టాపిక్‌గా మారింది.
ఇది చూసిన జయం రవి భార్య ఓ రేంజ్‌లో విమర్శలు చేసింది. తనని ఇంటి నుంచి బయటకు గెంటేశాడని.. పిల్లల్ని పట్టించుకోనివాడు అసలు తండ్రేనా అంటూ చాలా పెద్ద నోట్ రిలీజ్ చేసింది. దీనిపై తాజాగా నటుడు జయం రవి స్పందించారు. దీనిపై దాదాపు నాలుగు పేజీల లేఖ రిలీజ్ చేశాడు. భార్య ఆర్తిని వేధించానన్న ఆరోపణలను ఖండిస్తూ ఆయన ప్రకటన విడుదల చేశారు. ఈ విషయంపై మౌనంగా ఉండడం తన మనుగడ కోసం ఒక వ్యూహమని పేర్కొన్నాడు.
రవి తన లేఖలో రాస్తూ.. "నా గత వివాహ బంధాన్ని వ్యక్తిగత లాభం కోసం, కీర్తి కోసం సానుభూతిగా మార్చుకోవడాన్ని నేను అనుమతించను. ఇదేం ఆట కాదు.. నా జీవితం. నేను చట్టపరమైన ప్రక్రియకు పూర్తిగా కట్టుబడి ఉన్నా. సరైన సమయంలో సత్యం గెలుస్తుందని నమ్ముతున్నా. ఈ విషయంలో నేను గౌరవంగా ముందుకు వెళ్తా. ఆర్తితో ఉన్నప్పుడు పంజరంలో ఉన్నట్లు అనిపించింది. చివరకు బయటకు వెళ్లడానికి నిర్ణయించుకున్నా. నేను శారీరక, మానసిక, భావోద్వేగ, ఆర్థిక వేధింపుల నుంచి బయటపడ్డాను. గతంలో నా తల్లిదండ్రులను కూడా కలవలేకపోయా. అయినప్పటికీ నా వివాహ బంధాన్ని కాపాడుకోవడానికి చాలా ప్రయత్నించా. కానీ చివరికీ దూరంగా వెళ్లాలనేది తేలికగా తీసుకున్న నిర్ణయం కాదు. చాలా బరువైన హృదయంతోనే ఇది రాస్తున్నా" అని ప్రస్తావించారు.
(ఇది చదవండి: కుట్ర చేసి నన్ను ఇంట్లో నుంచి గెంటేశారు.. స్టార్ హీరో భార్య సంచలన పోస్ట్)
జయం రవి లేఖలో రాస్తూ..' నన్ను స్పష్టంగా చెప్పనివ్వండి. ఇలాంటి కల్పిత వాదనలను నేను ఖండిస్తున్నా. నేను ఎప్పటిలాగే నా మాటపై నిలబడతా. నాకు న్యాయం జరుగుతుందన్న నమ్మకముంది. ఆర్తి తన పిల్లలను సానుభూతి కోసం ఉపయోగించుకుంటోంది. ఆర్థిక లాభం కోసం, ప్రజల నుంచి సానుభూతిని పొందడానికి నా పిల్లలను ఒక సాధనంగా ఉపయోగించుకోవడం చాలా బాధగా ఉంది. అయితే మేము విడిపోయినప్పటి నుంచి ఉద్దేశపూర్వకంగా పిల్లలకు నన్ను దూరం చేసింది. ఇన్నేళ్లు నన్ను వెన్నుపోటు పొడిచారు. ఇప్పుడు ఏకంగా ఛాతిలో కత్తితో పొడిచినందుకు సంతోషంగా ఉంది. నా నుంచి ఇదే మొదటిది.. చివరిదీ కూడా. ప్రేమతో జీవించండి.. జయం రవిని జీవించనివ్వండి' అని వివరించారు.
కాగా.. జయం రవి గతేడాది సెప్టెంబర్ 9న తన భార్య ఆర్తితో విడిపోతున్నట్లు ప్రకటించాడు. ఆర్తితో తన బంధానికి ముగింపు పలకనున్నట్లు ఓ ప్రకటన విడుదల చేశారు. అయితే ఆ తర్వాత తన అనుమతి లేకుండా ఎలా ప్రకటిస్తారని ఆర్తి ఖండించింది. తాజాగా సింగర్ కెనిషాతో రవి రిలేషన్ గురించి సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మరోసారి చర్చ మొదలైంది. ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకోవడం కోలీవుడ్‌లో మరోసారి హాట్‌టాపిక్‌గా మారింది.