
‘క’లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత కిరణ్ అబ్బవరం (kiran Abbavaram) నుంచి వస్తున్న చిత్రం ‘దిల్ రూబా’. వాస్తవానికి ‘క’ కంటే ముందే ఈ చిత్రం రావాల్సింది. కానీ కొన్ని కారణాలతో ఆసల్యంగా థియేటర్స్‌కి వచ్చింది. ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉంటాయనే విషయం కిరణ్‌కి కూడా తెలుసు. అందుకే ‘దిల్ రూబా’ (Dilruba Review) విషయంలో ఇంకాస్త ఫోకస్ పెట్టాడు. కొన్ని సీన్లను రీషూట్ కూడా చేసినట్లు సమచారం. పబ్లిసిటీ విషయంలోనూ కిరణ్ జాగ్రత్తలు తీసుకున్నాడు. ‘ఈ సినిమాలో ఫైట్స్ నచ్చకపోతే..చితక్కొట్టండి’ అని నిర్మాత సవాల్ విసరడం, అది నెట్టింట బాగా వైరల్ కావడంతో ‘దిల్ రూబా’పై అంచనాలు పెరిగాయి. ఆ అంచనాలకు తగ్గట్లుగానే సినిమా ఉందా? కిరణ్ అబ్బవరం ఖాతాలో మరో హిట్ పడిందా? లేదా? రివ్యూలో చూద్దాం.

కథేంటంటే..
సిద్ధార్థ్‌రెడ్డి అలియాస్ సిద్దు(కిరణ్ అబ్బవరం) , మ్యాగీ(ఖ్యాతి డేవిసన్) కొన్ని కారణాల వల్ల విడిపోతారు. అనంతరం మ్యాగీ వేరే వ్యక్తిని పెళ్లి చేసుకొని అమెరికా వెళ్లిపోతుంది. బ్రేకప్‌తో బాధ పడుతున్న సిద్ధుని చూసి తట్టుకోలేకపోయిన ఆయన తల్లి..ఇక్కడే ఉంటే ఆ బాధ ఎక్కువతుందని, మంగుళూరు వెళ్లి చదుకోమని చెబుతోంది. దీంతో సిద్ధు మంగళూరులోని ఓ ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ అవుతాడు. అక్కడ తన క్లాస్‌మేట్ అంజలి(రుక్సార్ థిల్లాన్) (rukshar dhillon)తో ప్రేమలో పడతాడు.
కొన్ని కారణాల వీళ్ల మధ్య కూడా గ్యాప్ వస్తుంది. ప్రేమించమని వెంటపడిన అంజలి..ప్రేమలో పడిన తర్వాత సిద్ధుని ఎందుకు దూరం పెట్టింది? వీళ్ల బ్రేకప్‌కి కారణం ఎవరు? అమెరికాలో ఉన్న మ్యాగీ తిరిగి ఇండియాకు ఎందుకు వచ్చింది? విక్కీతో సిద్ధుకి ఉన్న గొడవేంటి? డ్రగ్స్ మాఫియా డాన్ జోకర్(జాన్ విజయ్) సిద్ధుని ఎందుకు చంపాలనుకున్నాడు? సారీ, థ్యాంక్స్ అనే పదాలను సిద్ధు ఎందుకు దూరంగా ఉంటాడు? చివరకు అంజలి, సిద్ధుల ప్రేమకథ ఏ తీరానికి చేరింది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఎలా ఉందంటే..
కొత్తదనంతో వస్తున్న కథలను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. అందుకే ఈ మధ్యకాలంలో హీరో క్యారెక్టర్‌ని కాస్త డిఫరెంట్‌గా ప్రజెంట్ చేస్తున్నారు దర్శకులు. ఓ ఢిఫరెంట్ పాయింట్‌ని పట్టుకొని కథలు అల్లుకుంటున్నారు. అయితే కథ కొత్తగా ఉంటే సరిపోదు..తెరపై చూస్తున్నప్పుడు కూడా ఆ కొత్తదనం కనిపించాలి. దిల్ రూబా విషయంలో అది మిస్ అయింది. వాస్తవానికి ఈ స్టోరీలో రెండు కొత్త పాయింట్స్ ఉన్నాయి. లవ్ ఫెయిల్యూర్ అయిన అబ్బాయికి మాజీ ప్రేయసీ అండగా నిలవడం.. హీరో ఎవరీకీ సారీ, థ్యాంక్స్ చెప్పకపోవడం. ఈ రెండు ఎలిమెంట్స్ ఆసక్తికరమైనవే కానీ..తెరపై అంతే ఆసక్తికరంగా చూపించడంలో దర్శకుడు పూర్తిగా సఫలం కాలేదు.
కాలేజీ ఎపిసోడ్ యూత్‌ని ఆకట్టుకుంటుంది. అంజలీ పాత్రను ఓ వర్గం ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు. అయితే కాలేజీలో వచ్చే యాక్షన్ సీన్లు తెరపై చూడడానికి బాగున్నా..కథకి ఇరికించినట్లుగా అనిపిస్తాయి. విరామానికి ముందు వచ్చే ఫైట్ సీన్ బాగుంటుంది. మాజీ లవర్ రంగంలోకి దిగడంతో సెకండాఫ్‌పై ఆసక్తి పెరుగుతుంది.

అంజలి, సిద్ధుల ప్రేమ కథ కొత్త మలుపు తిరుగుతుందనుకుంటున్న సమయంలో జోకర్ పాత్రను పరిచయం చేశాడు దర్శకుడు. దీంతో అసలు వీళ్ల లవ్‌స్టోరీకి జోకర్ ఉన్న సంబంధం ఏంటనే క్యూరియాసిటీ ప్రేక్షకుల్లో పెరుగుతుందీ. దానికి దర్శకుడు సరైన జెస్టిఫికేషనే ఇచ్చాడు. కానీ ఆ పాత్ర చుట్టూ అల్లిన సన్నివేశాలు సాగదీతగా అనిపిస్తాయి. సహజత్వం లోపిస్తుంది. కడప నేపథ్యంతో తీర్చిదిద్దిన సన్నివేశాలు బాగుంటాయి. క్లైమాక్స్‌లో వచ్చే యాక్షన్ ఎపిసోడ్ పర్వాలేదు. అయితే కథను ముగించిన తీరు నిరుత్సాహపరుస్తుంది.
ఎవరెలా చేశారంటే..
కిరణ్ అబ్బవరం టాలెంటెడ్ నటుడు. పాత్రకు న్యాయం చేసేందుకు కష్టపడతాడు . డిఫరెంట్ పాత్రలు పోషించేందుకు ఆసక్తి చూపిస్తాడు. ‘క’తో పోలిస్తే దిల్ రూబాలో కిరణ్‌ది డిఫరెంట్ పాత్రే.దానికి న్యాయం చేశాడు. తెరపై అందంగా కనిపించాడు. యాక్షన్స్ సీన్లలో ఇరగదీశాడు. ఎమోషనల్ సీన్ల విషయంలో ఇంకాస్త జాగ్రత్తలు తీసుకోవాలి. రుక్సార్ థిల్లాన్ పాత్రను తీర్చిదిద్దిన విధానం బాగుంది. ఖ్యాతి డేవిసన్ తన పాత్ర పరిధిమేర నటించింది. జాన్ విజయ్ రెగ్యులర్ విలన్ పాత్రను పోషించాడు. సత్య పండించిన కామెడీ బాగున్నప్పటికీ..అతన్ని పూర్తిగా వాడుకోలేకపోయారు. విక్కీ పాత్రలో కిల్లి క్రాంతి చక్కగా నటించారు. తులసి, 'ఆడుకాలం' నరేన్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు.
సాంకేతికంగా సినిమా బాగుంది. సామ్ సీఎస్ నేపథ్య సంగీతం ఈ సినిమాకు ప్రధాన బలం. యాక్షన్ సీన్లకు ఆయన ఇచ్చిన బీజీఎం అదిరిపోతుంది. కేసీపీడీ థీమ్‌ని ఫైట్ సీన్‌కి వాడడం బాగుంది. పాటలు పర్వాలేదు. సినిమాటోగ్రఫీ, యాక్షన్ కొరియోగ్రఫీ బాగుంది. కొన్ని డైగాల్స్ పూరీ జగన్నాథ్ మాటలను గుర్తు చేస్తాయి. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి.
టైటిల్: దిల్ రూబా
నటీనటులు: కిరణ్ అబ్బవరం, రుక్సార్ థిల్లాన్, నజియా, ఖ్యాతి డేవిసన్, సత్య తదితరులు
నిర్మాతలు: రవి, జోజో జోస్, రాకేష్ రెడ్డి, విక్రమ్ మెహ్రా, సిద్ధార్థ్ ఆనంద్ కుమార్
రచన, దర్శకత్వం: విశ్వ కరుణ్
సంగీతం: సామ్ సీఎస్
సినిమాటోగ్రఫీ: డానియేల్ విశ్వాస్
ఎడిటర్: ప్రవీణ్. కేఎల్
విడుదల తేది: మార్చి 14, 2025
Comments
Please login to add a commentAdd a comment