‘మహానటి’ (Mahanati) సినిమాలో తాను నటించినందుకు చాలా ట్రోల్స్ ఎదుర్కొన్నట్లు కీర్తి సురేష్(Keerthy Suresh) కొద్దిరోజుల క్రితం చెప్పారు. అయితే, తాజాగా మరోసారి ఇదే సినిమా గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. కానీ, తాను వాటిని అధిగిమించానని ఆమె చెప్పింది. సావిత్రి పాత్రలో తాను నటించినందుకు ఎప్పటికీ గర్వపడుతున్నట్లు చెప్పారు. ఈ మూవీలో కీర్తి నటనకు గాను ఉత్తమ జాతీయ అవార్డ్ అందుకున్న విషయం తెలిసిందే.
కీర్తి సురేష్ చాలా రోజుల తర్వాత వాల్వర్ రీటా మూవీతో మళ్లీ తెరపైకి వచ్చేస్తుంది. ఈ క్రమంలో తాజాగా మూవీ ప్రమోషన్ కార్యక్రమాలలో ఆమె పాల్గొంటుంది. ఆందులో ఆమె ఇలా చెప్పింది. 'మహానటి సినిమా తర్వాత దాదాపు ఆరు నెలల పాటు నాకు సినిమా ఛాన్సులు రాలేదు. కనీసం ఒక్క ప్రాజెక్ట్ కూడా రాకపోవడంతో ఇంట్లోనే ఉండిపోయాను. పరిశ్రమ నుంచి ఎవరూ కూడా నాకు కథ చెప్పడానికి ముందుకు రాలేదు. అయితే, మహానటి సినిమా చేసి నేను తప్పు చేశానని అనుకోలేదు. కొత్త ప్రాజెక్ట్‌లు రాలేదని నిరాశపడలేదు. మహానటి విజయం తర్వాత నా కోసం ప్రత్యేకమైన పాత్రలను క్రియేట్ చేసే పనిలో దర్శకనిర్మాతలు ఉన్నారేమో అనిపించింది.' అని ఆమె పేర్కొంది.
ఇండియన్ సినిమా చరిత్రలో ఎప్పిటికీ మహానటి సినిమా ఉండిపోతుంది. కానీ, అలాంటి సినిమాలో నటించిన కీర్తి సురేష్‌కు మాత్రం చాన్స్‌లు రాలేదని చెప్పడంతో నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. మహానటి సినిమాను దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించారు. 2018లో విడుదలైన ఈ చిత్రం భారీ హిట్ అందుకుంది. 66వ భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలలో ఉత్తమ తెలుగు సినిమా, జాతీయ ఉత్తమ నటి (కీర్తి సురేష్), జాతీయ ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ వంటి విభాగాల్లో అవార్డ్స్ అందుకుంది.


