
ప్రదీప్ రంగనాథన్, నటి మమిత బైజు జంటగా నటిస్తున్న చిత్రం డ్యూడ్ (Dude Movie). సుధా కొంగర వద్ద ఏడెనిమిది సంవత్సరాలు సహాయ దర్శకుడిగా పని చేసిన కీర్తిశ్వరన్ ఈ మూవీతో డైరెక్టర్‌గా పరిచయం కాబోతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమైన ఈ చిత్రం దీపావళి సందర్భంగా తెరపైకి రానుంది. తాజాగా ఈ సినిమా నుంచి సింగారి అనే పాటను రిలీజ్ చేశారు.
అలా కథ చెప్పా
ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ.. సినిమాటోగ్రాఫర్ నికేత్ బొమ్మి ద్వారా మైత్రి మూవీ మేకర్స్ సంస్థ అధినేతలకు ఈ కథను చెప్పే అవకాశం కలిగిందన్నారు. వాళ్లకు కథ నచ్చడంతో వెంటనే షూటింగ్ కార్యక్రమాలను ప్రారంభించామన్నారు. రజనీకాంత్ 30 ఏళ్ల వయసును దృష్టిలో పెట్టుకొని డ్యూడ్ కథ రాసినట్లు తెలిపారు. ఈ పాత్రలో నటుడు ప్రదీప్ రంగనాథన్ ఒదిగిపోయారన్నారు. ఇది లవ్ సబ్జెక్ట్ అయినప్పటికీ మాస్ యాంగిల్స్ కూడా ఉంటాయన్నారు. ఒక దర్శకుడిగా తన తొలి చిత్రం దీపావళికి విడుదల కావడం అనేది.. తన కల నిజం అవుతున్నట్లు అనిపిస్తోందన్నారు.
ప్రేమలుకు ముందే..
ప్రేమలు చిత్రం విడుదలకు ముందే నటి మమిత బైజు నటించిన సూపర్ శరణ్య చిత్రాన్ని చూసి ఆమెను తమ చిత్రం కోసం ఎంపిక చేసినట్లు చెప్పారు. ఆమె ఈ చిత్రంలోకి రాగానే రజనీకాంత్, శ్రీదేవి జంటగా నటించినట్లు అనిపిస్తోందన్నారు. నటుడు శరత్ కుమార్, రోహిణి, పరిదాపంగాల్ ఫేమ్ డేవిడ్ తదితరులు ముఖ్య పాత్ర పోషించిన ఈ చిత్రానికి సాయి అభ్యంకర్ సంగీతాన్ని అందించారు.