హై హై ప్రతి నాయికా | Some prominent Tollywood Actress who played lady villain roles | Sakshi
Sakshi News home page

హై హై ప్రతి నాయికా

Oct 6 2025 12:42 AM | Updated on Oct 6 2025 12:42 AM

Some prominent Tollywood Actress who played lady villain roles

డ్యూయెట్స్‌ పాడుతూ, కాసిన్ని జోక్స్‌ వేస్తూ, ఎమోషనల్‌ సీన్స్‌లో కన్నీళ్లు పెట్టుకుంటూ... కథానాయికల పాత్రలు దాదాపు ఇలానే ఉంటాయి. అందుకే విభిన్న తరహా పాత్రలు దక్కితే ‘సై’ అనేస్తారు. అదే నెగటివ్‌ క్యారెక్టర్‌ అయితే... నటించడానికి చాలా స్కోప్‌ ఉంటుంది కాబట్టి వెంటనే గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేస్తారు. ఇప్పటికే స్టార్‌ హీరోయిన్స్‌ సమంత, తమన్నా వంటివారు విలన్‌ రోల్స్‌ చేసి, సక్సెస్‌ అయ్యారు.

శ్రద్ధా శ్రీనాథ్, అనన్యా నాగళ్ల, సంయుక్త, రచితా రామ్, రుక్మిణీ వసంత్‌... ఇలా యువ తారలు  సైతం విలన్‌ రోల్స్‌ చేసేందుకు ఆలోచించడం లేదు. ప్రతి నాయిక పాత్రల్లో నటనపరంగా విజృంభించి, ‘హై హై ప్రతినాయికా’ అని ప్రేక్షకులు అనేలా తమ సత్తా నిరూపించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో లేడీ విలన్‌గా చేస్తున్న కొందరు హీరోయిన్స్‌ గురించి తెలుసుకుందాం.

స్లమ్‌ డాగ్‌లో... వెంకటేశ్‌ ‘కూలీ నెం.1’, నాగార్జున ‘నిన్నే పెళ్ళాడతా’ వంటి చిత్రాల్లో హీరోయిన్‌గా, అల్లు అర్జున్‌ ‘అల..వైకుంఠపురములో..’ క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా టబు తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలే. ప్రస్తుతం పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలోని ‘స్లమ్‌ డాగ్‌’ (ప్రచారంలో ఉన్న టైటిల్‌) చిత్రంలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు టబు. విజయ్‌ సేతుపతి హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో టబు విలన్‌గా కనిపిస్తారని సమాచారం. పూరి కనెక్ట్స్, జేబీ మోషన్‌ పిక్చర్స్‌ సంస్థలు ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఇదిలా ఉంటే... గతంలో ‘మక్బూల్‌’, ‘అంధా ధూన్‌’ వంటి హిందీ చిత్రాల్లో టబు నెగటివ్‌ రోల్స్‌ చేసిన విషయం తెలిసిందే.

ధన పిశాచి... టాలీవుడ్‌కి విలన్‌గా ఎంట్రీ ఇస్తున్నారు బాలీవుడ్‌ నటి సోనాక్షీ సిన్హా. తెలుగు, హిందీ భాషల్లో రూపొందుతున్న ‘జటాధర’లో సోనాక్షీ సిన్హా విలన్‌ రోల్‌ చేస్తున్నారు. ఇందులో ఆమె ధన పిశాచిగా కనిపించనున్నారు. సుధీర్‌బాబు హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో సోనాక్షీ సిన్హాతో పాటు దివ్య ఖోస్లా, శిల్పా శిరోద్కర్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. శిల్పా శిరోద్కర్‌ పాత్రలోనూ నెగటివ్‌ షేడ్స్‌ ఉంటాయట. వెంకట్‌ కల్యాణ్, అభిషేక్‌ జైస్వాల్‌లు ‘జటాధర’ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. కేరళలోని తిరువనంతపురంలో గల అనంత పద్మనాభస్వామి దేవాలయం నేపథ్యంలో సాగే ఈ చిత్రం నవంబరు 7న విడుదల కానుంది. 

దెయ్యంగా పూజ? 
దర్శక–నిర్మాత–నటుడు–కొరియోగ్రాఫర్‌ రాఘవా లారెన్స్‌ ‘కాంచన’ ఫ్రాంచైజీ నుంచి రానున్న తాజా చిత్రం ‘కాంచన 4’. ఈ చిత్రంలో రాఘవా లారెన్స్‌తో పాటు పూజా హెగ్డే, నోరా ఫతేహీ మెయిన్‌ లీడ్‌ రోల్స్‌లో నటిస్తున్నారని తెలిసింది. ఈ చిత్రంలో దెయ్యం పాత్రలో పూజా హెగ్డే కనిపిస్తారట. పూజ లేదా నోరా ఫతేహీ... ఇలా ఎవరో ఒకరి పాత్ర నెగటివ్‌ షేడ్స్‌లో ఉంటుందనే టాక్‌ కోలీవుడ్‌లో వినిపిస్తోంది. దాదాపు సగం చిత్రీకరణ పూర్తి చేసుకున్న ‘కాంచన 4’ సినిమా వచ్చే వేసవిలో విడుదల కావొచ్చు. 

వారియర్‌ విలన్‌...
కాలేజీ అమ్మాయి, ప్రేయసి, భార్య... ఇలా హీరోయిన్‌గా విభిన్న రకాల పాత్రల్లో నటించి, మెప్పించారు రష్మికా మందన్నా. ఇప్పుడు తనలోని నెగటివ్‌ యాంగిల్‌ని తెరపై ఆవిష్కరించేందుకు రెడీ అవుతున్నారట రష్మిక. హీరో అల్లు అర్జున్, దర్శకుడు అట్లీ దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో ఓ సినిమా రూపొందుతున్న సంగతి  తెలిసిందే. ఇందులో ఓ హీరోయిన్‌గా దీపికా పదుకోన్‌ ఖరారయ్యారు.

ఇంకా రష్మికా మందన్నా, జాన్వీ కపూర్, మృణాల్‌ ఠాకూర్, ఆలియా. ఎఫ్‌... వంటి వారు ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారనే టాక్‌ తెరపైకి వచ్చింది. రష్మికా మందన్నా నెగటివ్‌ షేడ్స్‌ ఉన్న వారియర్‌ విలన్‌ పాత్రలో కనిపిస్తారని సమాచారం. ఇదే నిజమైతే రష్మిక విలన్‌గా కనిపించనున్న తొలి చిత్రం ఇదే కావొచ్చు. సన్‌ పిక్చర్స్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమా 2027లో విడుదల కానుంది. 
ఇంకా మరికొందరు కథానాయికలు ‘ప్రతి నాయిక’లుగా కనిపించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement