స్ఫూర్తి: తలవంచని పాట

Kashmir famous female singer Shazia Bashir inspiring success story - Sakshi

పాడటం తప్పు కాదు... అదొక అద్భుతమైన కళ అయితే ఆ కళ కొందరికి కంటగింపుగా మారింది కశ్మీర్‌లో బహిరంగ వేదిక ఎక్కి ఒక అమ్మాయి పాట పాడటం అనేది అంత తేలికైన విషయం కాదు! వెర్రితలలు వేసే వెక్కిరింపులతో పాటు, ‘ప్రాణాలు తీస్తాం’ అని బెదిరింపులు కూడా ఎదురవుతుంటాయి.

ఆ బెదిరింపులకు భయపడి ఉంటే కశ్మీర్‌లోని మారుమూల పల్లెలో పుట్టిన షాజియా బషీర్‌ గాయనిగా అంతర్జాతీయ స్థాయిలో రాణించేది కాదు. ఎంతోమంది యువకళాకారులకు స్ఫూర్తిని ఇచ్చి ఉండేది కాదు...

దక్షిణ కశ్మీర్‌లోని తాజివర అనే ఊళ్లో పుట్టింది షాజియ. చిన్నప్పటి నుంచి పాటలు అద్భుతంగా పాడేది. సంగీతంలో ఎక్కడా శిక్షణ తీసుకోకపోయినా, ఆ అందమైన ప్రకృతే ఆమెకు రాగాలు నేర్పిందేమో అన్నట్లుగా ఉండేది. పెరిగి పెద్దయ్యాక కూడా ఆమె పాట బాటను వీడలేదు.

మిలే సుర్‌ (డిడి కశ్మీర్‌) అనే టీవీ కార్యక్రమానికి ఎంపిక కావడం తన జీవితాన్ని మలుపు తిప్పింది. రకరకాల వడపోతల తరువాత ఎంపికైన నలుగురిలో తానొక్కతే అమ్మాయి. ఈ కార్యక్రమంతో షాజియాకు గాయనిగా ఎంతో పేరు వచ్చింది. మరోవైపు ‘రేడియో కశ్మీర్‌’ కోసం తాను పాడిన పాటలు సూపర్‌హిట్‌ అయ్యాయి.
 ఏ ఊళ్లో సంగీత కార్యక్రమం జరిగినా తనను పిలిపించి పాడించేవారు.

బాలీవుడ్‌ మసాలా పాటలు కాకుండా కశ్మీరి సంప్రదాయ జానపదగీతాలను పాడి అలరించేది. కొత్తతరానికి అవి కొత్త పాటలు, పాతతరానికి అవి మళ్లీ గుర్తు చేసుకునే మధురమైన పాటలు.
ఎక్కడికైనా బస్‌లోనే వెళ్లేది. ఎంత రాత్రయినా తల్లిదండ్రులు తన కోసం బస్‌స్టాప్‌లో ఎదురు చూసేవారు.
ఒకవైపు షాజియా గానమాధుర్యానికి అబ్బురపడి మెచ్చుకునేవాళ్లతో పాటు, మరోవైపు ‘వేదికలు ఎక్కి పాడడం ఏమిటి. ఊరూరూ తిరగడం ఏమిటీ’ అని విమర్శించేవాళ్ల సంఖ్య కూడా పెరిగింది. బెదిరింపులు కూడా వచ్చాయి. ఆ రోజులన్నీ తనకు నిద్రలేని రాత్రులే.

ఈ వెక్కిరింపులు, బెదిరింపులను తట్టుకోవడం తన వల్ల కాదనుకొని ఒకానొక సమయంలో ‘పాట’కు  శాశ్వతంగా దూరంగా జరగాలని అనుకుంది. ఆ సమయంలో తల్లిదండ్రులు, సోదరుడు ధైర్యం చెప్పారు. తనను పాటకు మరింత దగ్గర చేశారు.
ఇంగ్లాండ్‌ నుంచి ఆస్ట్రేలియా వరకు ఎన్నెన్నో దేశాల్లో తన పాటల అమృతాన్ని పంచింది షాజియ. నసీమ్‌ అక్తర్‌ మెమోరియల్‌ అవార్డ్, బక్షీ మెమోరియల్‌ కమిటీ అవార్డ్, సంగీత్‌ నాటక్‌ అకాడమీ... లాంటి ఎన్నో అవార్డ్‌లు అందుకున్న షాజియ సూఫీగీతాలతో పాటు హిందూ భక్తిగీతాలను మధురంగా ఆలపించడంలో అద్భుతం అనిపించుకుంది.

2014లో తండ్రి చనిపోవడంతో షాజియ గొంతులో దుఃఖం తప్ప ఏమీ లేకుండా పోయింది. అవి తనకు చీకటి రోజులు. అదేసమయంలో తండ్రి మాట ‘నువ్వు పాట ఎప్పుడూ ఆపవద్దు’ గుర్తుకు వచ్చి మళ్లీ పాడటం మొదలుపెట్టింది. తన పాట ఎంతోమందికి స్ఫూర్తి ఇచ్చింది. షాజియాను ఆదర్శంగా తీసుకొని ఈ తరం యువతులు సంగీతరంగంలో రాణిస్తున్నారు.
‘ఏ రంగంలో అయినా కష్టపడడం తప్ప విజయానికి దగ్గరి దారి అనేది లేదు’ అంటున్న షాజియా కష్టపడే తత్వానికి ఆత్మస్థైర్యాన్ని కూడా జోడించింది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top