‘రామాయణ్’ టీవీ సీరియల్‌లో ఒక దృశ్యం
ఆదివారం ఉదయం... అప్పట్లో కేవలం ఒక సెలవు దినం కాదు. వీధులన్నీ నిర్మానుష్యంగా మారి, దేశమంతా ఒకే నిశ్శబ్దంలో మునిగిపోయే సమయం. సరిగ్గా ఉదయం తొమ్మిదిన్నర గంటలకు ప్రజలు పనులన్నీ పక్కనపెట్టి టీవీల ముందు చేరేవారు. ఇళ్లలో ఒక రకమైన భక్తి వాతావరణం నెలకొనేది. దేశవ్యాప్తంగా ఈ స్తబ్ధతకు, ఐక్యతకు కారణం రామానంద సాగర్ (Ramanand Sagar) సృష్టించిన ‘రామాయణ్’ టీవీ సీరియల్. 1987 జనవరి 25న ప్రారంభమైన ఈ ధారా వాహిక కేవలం ఒక వినోద కార్యక్రమంగా కాకుండా భారతీయ సాంస్కృతిక చరిత్రలో ఒక అపు రూప ఘట్టంగా నిలిచిపోయింది.
ప్రస్తుతం ఈ దృశ్యకావ్యం నలభయ్యో వసంతంలోకి అడుగు పెట్టింది. గత నాలుగు దశాబ్దాలలో మీడియా స్వరూపం పూర్తిగా మారిపోయింది. చేతిలో మొబైల్, ఓటీటీలు, వంద లాది ఛానెళ్లు అందుబాటు లోకి వచ్చాయి. అయినా, ‘రామాయణ్’ సాధించిన ఐక్యత, అది నేర్పిన విలువలు నేటికీ ప్రత్యేకమే. భారతీయ జనజీవనాన్ని అంతలా ప్రభావితం చేసిన మరో కార్యక్రమం లేదంటే అతిశయోక్తి కాదు.
దూరదర్శన్ వేదికగా తొలిసారి ఒక మహా కావ్యాన్ని ధారావాహికగా మలిచిన ఘనత రామానంద సాగర్‌కు దక్కుతుంది. సుమారు 300 మంది నటీనటులతో సాగర్ ఈ దృశ్య కావ్యాన్ని తెరకెక్కించారు. ప్రధానంగా గోస్వామి తులసీదాస్ ‘రామచరిత్ మానస్’ను ప్రాతిపదికగా తీసుకున్నప్పటికీ, వాల్మీకి రామాయణంతో పాటు ప్రాంతీయ భాషల్లోని కంబన్, భావార్థ, కృతివాస్, రంగనాథ రామాయణాలలోని విశేషాలను పొందుపరిచారు. సీనియర్ నటుడు అశోక్ కుమార్ వ్యాఖ్యానం ఈ సీరియల్‌కు జాతీయ సమగ్రతా చిహ్నంగా గౌరవాన్ని తెచ్చిపెట్టింది. మొదట 52 ఎపిసోడ్లుగా ప్లాన్ చేసినా, ప్రేక్షకుల అపూర్వ స్పందన దృష్ట్యా దీనిని 78 ఎపిసోడ్లకు పెంచాల్సి వచ్చింది. ఆ తర్వాత వచ్చిన ‘లవకుశ’ సీక్వెల్ కూడా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.
వ్యాపారపరంగానూ ‘రామాయణ్’ సరికొత్త చరిత్ర సృష్టించింది. అప్పట్లో ప్రజాదరణ పొందిన ‘బుని యాద్’, ‘చిత్రహార్’ వంటి టీవీ కార్యక్రమాలను వెనక్కి నెట్టి ప్రకటనల ఆదాయంలో అగ్రస్థానానికి చేరుకుంది. ప్రారంభంలో ఒక్కో ఎపిసోడ్‌కు 15గా ఉన్న ప్రకటనలు, కొద్ది నెలల్లోనే 40కి పెరిగాయి. దూరదర్శన్ ఆదాయంలో ఎనిమిదో వంతు కేవలం ఈ ఒక్క సీరియల్ నుంచే వచ్చేదంటే దీని క్రేజ్ అర్థం చేసుకోవచ్చు. అప్పట్లో 10 సెకన్ల ప్రకటన కోసం రూ. 40 వేలు చెల్లించేందుకు 135 సంస్థలు క్యూ కట్టేవి. వారానికి సుమారు రూ. 28 లక్షల నుంచి రూ. 30 లక్షల వరకు ఆదాయాన్ని ఆర్జించి పెట్టిన ఘనత దీని సొంతం.
అప్పట్లో దూరదర్శన్ వీక్షకుల సంఖ్య 6 నుంచి 8 కోట్ల మధ్య ఉండగా, రామాయణంలోని కీలక ఎపిసోడ్లను సుమారు 10 కోట్ల మంది చూశారు. ఇది అప్పటి దేశ జనాభాలో దాదాపు ఎనిమిది శాతం. ఈ సీరియల్ ప్రసార సమయంలో వీధులు కర్ఫ్యూను తలపించేవి. జనం అపాయింట్‌మెంట్లు రద్దు చేసుకునే వారు. ఫ్యాక్టరీల్లో కార్మికులు దొరకని పరిస్థితి ఉండేది.
సినిమా హాళ్లలో ఉదయం షోలు (Morning Show) రద్దయ్యేవి. గ్రామాల్లో ఒకటి, రెండు టీవీలు మాత్రమే ఉన్న ఆ రోజుల్లో, జనం కమ్యూనిటీ హాళ్ల వద్ద సామూహికంగా కూర్చుని రామాయణాన్ని వీక్షించే వారు. చాలా ఇళ్లలో ‘రామాయణ్’ వీక్షణ ఒక మతపరమైన ఆచారంగా మారింది. టీవీ సెట్లను శుభ్రం చేసి, పూలమాలలు వేసి, పసుపు కుంకుమలతో అలంకరించి, ధూపదీపాలతో పూజలు చేసేవారు. శంఖం ఊది మరీ సీరియల్ ప్రారంభించే వారు. 1988 జూలై 31న ప్రసారమైన చివరి ఎపిసోడ్ రోజున ప్రజలు దీపాలు వెలిగించి ముందస్తు దీపావళిలా పండుగ చేసుకున్నారు. ఇందులో రాముడు, సీత పాత్రలు పోషించిన అరుణ్ గోవిల్, దీపికా చిఖిలియాలను ప్రజలు నిజమైన దైవస్వరూపాలుగా కొలిచారు.
చదవండి: నాటి రోజుల్లో రెండో పెద్ద పండుగ
‘రామాయణ్’ విజయంతో భారతీయ బుల్లితెరపై పురాణ గాథల పరంపర మొదలైంది. ‘మహాభారత్’, ‘శ్రీకృష్ణ’, ‘విష్ణు పురాణ్’ వంటి ఎన్నో సీరియళ్లకు ఇది మార్గదర్శిగా నిలిచింది. కరోనా లాక్డౌన్ సమయంలో ప్రజలు భయాందోళనల్లో ఉన్నప్పుడు, దూరదర్శన్ మళ్లీ ఈ సీరియల్‌ను ప్రసారం చేసింది. ఆ అనిశ్చిత సమయంలో ‘రామాయణ్’ ప్రజలకు గొప్ప మానసిక ధైర్యాన్ని ఇచ్చింది. భారతీయ సంస్కృతికి, ఆత్మకు రామాయణం ఒక ప్రతిబింబం. తులసీదాస్ చెప్పినట్లు రాముడు అనంతుడు, ఆయన కథ కూడా అపారమైనది. నిన్నటి కథగా కాకుండా, నేటి తరం జీవన విలువల మార్గదర్శిగా ఈ దృశ్యకావ్యం నిలిచిపోతుంది.
– డాక్టర్ అజేయ్ శివర్ల, ఆంగ్ల అధ్యాపకుడు
(2026, జనవరి 25తో నలభయ్యో పడిలో దూరదర్శన్ ‘రామాయణ్’ సీరియల్)


