కన్నడ ప్రముఖ సీనియర్ నటి లలితమ్మ (65) చనిపోయారు. అనారోగ్య కారణాలతో గత కొన్నాళ్లుగా బాధపడుతున్న ఈమె.. సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఎన్నో ఏళ్లుగా నటిగా అలరించిన ఈమె మృతిపై పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 10: ఈ వారం నామినేట్ అయింది వీళ్లేనా?)
దాదాపు 35 ఏళ్లుగా నాటక రంగంతో గుర్తింపు తెచ్చుకున్న లలితమ్మ.. ఎన్నో నాటకాలు, రంగస్థల ప్రదర్శనల్లో నటించారు. అలా టీవీ, సినిమా ఇండస్ట్రీల్లోకి వచ్చారు. ‘రంగోలి’, ‘మాంగల్య’, ‘మహామాయి’ తదితర సీరియల్స్ చేశారు. అయితే స్టార్ దర్శన్ ‘సుందర గాలి’లో ఈమె చేసిన లేడీ విలన్ సరాయి శారదే పాత్ర స్టార్‌డమ్ వచ్చేలా చేసింది.
ఈ సినిమా తర్వాత ‘జంగ్లీ’, ‘లైఫు ఇష్టేనే’, ‘వజ్రకాయ’, ‘పుత్ర’, ‘జాకీ’ తదితర కన్నడ సినిమాల్లో లలితమ్మ నటించారు. ఎక్కువగా సహాయ పాత్రల్లో కనిపించినప్పటికీ.. తనదైన నటనతో ప్రేక్షకుల మనసుల్లో స్థానం సంపాదించుకున్నారు.
ఇకపోతే లలితమ్మ గత కొంతకాలంగా వయోభారంతో పాటు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. రెండున్నర నెలల క్రితం స్ట్రోక్ కూడా వచ్చింది. అప్పటి నుంచి బెంగళూరులోని ఓ ట్రస్ట్‌లో చికిత్స తీసుకుంటూ వచ్చారు. అలాంటి ఈమె ఇప్పుడు కన్నుమూయడంతో అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు.
(ఇదీ చదవండి: 'హనుమాన్ అంశ్' తెలుగు ట్రైలర్ రిలీజ్)


