Kangana Ranaut : అతనికి స్క్రిప్ట్‌పై కంటే ఇతరుల శృంగార జీవితాలపైనే ఎక్కువ ఆసక్తి

Kangana Ranaut Fires On Brahmastra Movie Time And Karan Johar - Sakshi

‘బ్రహ్మాస్త్ర’ టీమ్‌పై కంగనా ఫైర్‌

‘బ్రహ్మాస్త్ర’ మూవీ టీమ్‌పై బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ కంగనా రనౌత్‌ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ చిత్రం కోసం దర్శకుడు అయాన్‌ ముఖర్జీ రూ.600 కోట్లు కాల్చి బూడిద చేశారని విమర్శించారు. అతని సినీ కెరీర్‌లో ఒక్క మంచి చిత్రం కూడా లేదని, అతన్ని మెచ్చుకున్న వారందర్నీ జైల్లో పెట్టాలని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ‘బ్రహ్మాస్త్ర’ చిత్రానికి సినీ క్రిటిక్స్‌ ఇచ్చిన రేటింగ్‌ని ఇన్‌స్టా స్టోరీలో షేర్‌ చేస్తూ.. చిత్ర బృందంపై, ముఖ్యంగా నిర్మాత కరణ్‌ జోహార్‌పై షాకింగ్‌ కామెంట్స్‌ చేశారు. 

(చదవండి: ‘బ్రహ్మాస్త్రం’ ఫస్ట్‌డే కలెక్షన్స్‌.. టాలీవుడ్‌లో సరికొత్త రికార్డు)

‘అయాన్‌ ముఖర్జీని మేధావి అని మెచ్చుకున్న వారందర్నీ జైలుకు పంపించాలి. ‘బ్రహ్మాస్త్ర’చిత్రానికి తెరకెక్కించడానికి అతనికి 12 ఏళ్లు పట్టింది. ఈ సినిమాను 400 రోజులకుపైగా షూట్ చేసి, 14 మంది సినిమాటోగ్రాఫర్లను, 85 మంది అసిస్టెంట్‌ డైరెక్టర్లను మార్చాడు. ప్రొడక్షన్స్‌  ఖర్చుల రూపంలో మొత్తంగా రూ.600 కోట్లను కాల్చి బూడిద చేశాడు. బాహుబలి సినిమా సక్సెస్‌ కావడంతో.. బ్రహ్మాస్త్ర సినిమా పేరును జలాలుద్దీన్ రూమీ నుంచి శివగా చివరి నిమిషంలో మార్చి మతపరమైన మనోభావాలను దెబ్బ తీసేందుకు ప్రయత్నించారు. ఇలాంటి అవకాశవాదులు, సృజనాత్మకత కోల్పోయిన వ్యక్తులను మేధావి అని పిలవ కూడదు’అంటూ కంగనా రాసుకొచ్చారు.

అలాగే కరణ్‌ జోహార్‌పై కూడా కంగనా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ‘అతను సినిమా స్క్రిప్ట్‌లపై కంటే ఇతరుల శృంగార జీవితాలపైనే ఎక్కువ ఆసక్తి కనబరుస్తుంటాడు. రివ్యూలు, రేటింగ్స్‌, కలెక్షన్స్‌ వివరాలు.. ఇలా ప్రతిదాన్నీ డబ్బుతో కొనుగోలు చేసి తన సినిమాలకు ఇప్పించుకుంటాడు. ఈసారి అయితే దక్షిణాది వారి దృష్టి సొంతం చేసుకోవడానికి ప్రయత్నించాడు. తాను తెరకెక్కించే సినిమాలో మంచి కథ, కథనం, టాలెంట్‌ ఉన్న నటీనటులను పెట్టుకోవడం మానేసి తమ చిత్రాన్ని ప్రమోట్‌ చేయాలని దక్షిణాది నటీనటులు, దర్శకులను కోరుకున్నాడు. ఇలా అక్కడి వారిని కోరుకునే బదులు మంచి టాలెంట్‌ ఉన్న వాళ్లతో సినిమా తీస్తే సరిపోతుంది కదా’అని కంగనా రనౌత్ పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం పోస్టులు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ఇక బ్రహ్మాస్త్ర సినిమా విషయానికొస్తే..  అయాన్‌ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రణ్‌బీర్‌ కపూర్‌, అలియాభట్‌ జంటగా  నటించనగా, బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌, నాగార్జున, మౌనీ రాయ్‌ పలు కీలక పాత్రలు పోషించారు.స్టార్‌ స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్స్‌, ప్రైమ్‌ ఫోకస్, స్టార్‌లైట్‌ పిక్చర్స్‌ నిర్మించిన ఈ సినిమా దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి దక్షిణాదిలో సమర్పించారు. భారీ అంచనాల మధ్య నిన్న(సెప్టెంబర్‌ 9) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి మిశ్రమ స్పందన లభించింది. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top