Jr NTR Talks About Bimbisara Pre Release Event - Sakshi
Sakshi News home page

ఫాన్స్‌ కాలర్‌ ఎగరేసుకునేలా చేయడమే మా బాధ్యత : ఎన్టీఆర్‌

Published Sat, Jul 30 2022 12:33 AM

Jr NTR Talks About Bimbisara Pre Release Event - Sakshi

‘‘ఇండస్ట్రీకి గడ్డు కాలం అని, థియేటర్లకి జనాలు రావడం లేదని అంటున్నారు.. ఇదంతా నేను నమ్మను. అద్భుతమైన చిత్రం వస్తే చూసి, ఆశీర్వదించే గొప్ప హృదయం కలిగినటువంటి తెలుగు ప్రేక్షక దేవుళ్లు మీరందరూ. ఆగస్టు 5న విడుదలవుతున్న ‘బింబిసార’, ‘సీతా రామం’ చిత్రాలను ఆదరించి తెలుగు ఇండస్ట్రీకి కొత్త ఊపిరి పోయాలి.

ఇండస్ట్రీ పదికాలాల పాటు చల్లగా ఉండి మీ అందర్నీ అలరించాలని ఆ దేవుణ్ణి మనసారా కోరుకుంటున్నాను’’ అని హీరో ఎన్టీఆర్‌ అన్నారు. కల్యాణ్‌ రామ్‌ హీరోగా, కేథరిన్, సంయుక్తా మీనన్‌ హీరోయిన్స్ గా నటించిన చిత్రం ‘బింబి సార’. వశిష్ఠ్‌ దర్శకత్వంలో నందమూరి తారక రామారావు ఆర్ట్స్‌ పతాకంపై హరికృష్ణ.కె నిర్మించిన ఈ సినిమా ఆగస్టు 5న విడుదలకానుంది.

ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన ప్రీ రిలీజ్‌ వేడుకలో ఎన్టీఆర్‌ మాట్లాడుతూ–‘‘బింబిసార’ కథని వేణు (వశిష్ఠ్‌) ఒక ఐడియాగా  చెప్పినప్పుడు ఇంత పెద్ద కథని హ్యాండిల్‌ చేయగలడా? లేదా? అని భయం మొదలైంది. అయితే ఈ సినిమా చూసిన తర్వాత.. తను కథని ఎంత కసితో చెప్పాడో అంతే కసిగా తీశాడనిపించింది. ఈ చిత్ర కథ నాకు తెలిసినా సినిమా చూసేటప్పుడు చాలా ఎగై్జట్‌మెంట్‌ కలిగింది. సినిమా చూస్తున్నప్పుడు ప్రేక్షకులు కూడా అదే ఎగ్జైట్‌మెంట్‌కి గురవుతారు. ‘బింబిసార’ టీజర్‌లోనే వేణు సత్తా తెలుస్తోంది.. హ్యాట్సాఫ్‌ వేణు. ఈ సినిమాకి ఛోటా కె.నాయుడు అన్న ప్రాణం పోశారు. ప్రస్తుత పరిస్థితుల్లో అద్భుతమైన సినిమాలు చూస్తే తప్ప ప్రేక్షకులు సంతృప్తి చెందడం లేదు.

‘బింబిసార’ ఇంత అద్భుతంగా వచ్చిందంటే కారణం నటీనటులు, సాంకేతిక నిపుణులే.. వారందరికీ థ్యాంక్స్‌. ఈ మూవీకి నేపథ్య సంగీతం, కొత్త రకమైన పాటలు అందించి వెన్నెముకగా నిలిచి, మా నమ్మకాన్ని మరింత పెంచినందుకు కీరవాణిగారికి థ్యాంక్స్‌. మా తాతగారు(ఎన్టీఆర్‌), మా నాన్నగారు(హరికృష్ణ) మాకు వదిలి వెళ్లిన అభిమానులు మీరు.. జీవితాంతం మీకు రుణపడి ఉంటాం.. మీకు నచ్చే వరకూ చిత్రాలు చేస్తూనే ఉంటాం.. మీరు కాలర్‌ ఎగరేసుకునేలా చేయడమే మా బాధ్యత. కల్యాణ్‌ అన్న కెరియర్‌ ‘బింబిసార’ కి ముందు, తర్వాత అని కచ్చితంగా అనుకోవాల్సిందే. ఈ చిత్రానికి కల్యాణ్‌ రామ్‌ తప్ప న్యాయం చేయగలిగే నటుడు ఇంకొకరు లేడు.. ఉండడు కూడా’’ అన్నారు.కల్యాణ్‌ రామ్‌ మాట్లాడుతూ‘‘ఓ మంచి జానపద, సోషియో ఫ్యాంటసీ సినిమా మీ ముందుకు తీసుకు రావాలనే మా ప్రయత్నమే ఈ ‘బింబిసార’. ఈ సారి మాత్రం మిమ్మల్ని(అభిమానుల్ని) నిరుత్సాహ పరచను.. 100కి 200శాతం మీరు సంతృప్తి చెందుతారు.. గర్వంగా ఫీలవుతారు.  ఈ సినిమాకి ప్రాణం పోసిన ఒకే ఒక వ్యక్తి కీరవాణిగారు. ‘బింబిసార’ ని నాకు ఇచ్చిన కె.హరికృష్ణకి జీవితాంతం రుణపడి ఉంటాను’’ అన్నారు. ఈ వేడుకలో కెమెరామేన్‌ ఛోటా కె.నాయుడు పాల్గొన్నారు.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

Advertisement
 
Advertisement
 
Advertisement