
అంకిత్, తన్వి జంటగా నటించిన చిత్రం ‘జాన్ సే’. ఈ సినిమాతో ఎస్. కిరణ్ కుమార్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. క్రితి ఎంటర్‌టైన్మెంట్ ప్రొడక్షన్స్‌పై రూపొందిన ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఈ సందర్భంగా కిరణ్ కుమార్ మాట్లాడుతూ– ‘‘నేను సివిల్ ఇంజనీర్‌ని. అయితే నేను అనుకునే కథలు, ఆలోచనలను సినిమా రూపంలో చెప్పాలనే ఆసక్తే నన్ను దర్శకుణ్ణి చేసింది.
ఈ ‘జాన్ సే’ మూవీ లైన్‌ను తొమ్మిదేళ్లుగా అనుకున్నాను. ఆరు నెలల క్రితం పూర్తి స్క్రిప్ట్ రెడీ అయింది. క్రైమ్ థ్రిల్లర్ స్టోరీనే అయినా ఈ సినిమాలో మంచి లవ్ స్టోరీ కూడా ఉంది. మోక్షగుండం విశ్వేశ్వరయ్య లాంటి తెలివి, ఝాన్సీ లక్ష్మీబాయి తెగువ ఉన్న అమ్మాయి ఈ సమాజాన్ని ఎలా ఎదుర్కొంది? అనేది మెయిన్ లైన్. ‘జాన్ సే’ రిలీజ్ డేట్ త్వరలో చెబుతాను’’ అన్నారు.