
కమల్‌హాసన్, ఆయుష్మాన్ ఖురానా,పాయల్ కపాడియాకి ఆహ్వానం
‘‘ప్రపంచ సినిమాకి చెందిన నటీనటులను, సాంకేతిక నిపుణులను అకాడమీలోకి ఆహ్వానిస్తున్నందుకు మాకెంతో థ్రిల్‌గా, ఆనందంగా ఉంది. అంకితభావం, నిబద్ధతతో ప్రపంచ చలన చిత్ర పరిశ్రమ పురోగతికి కృషి చేస్తున్న ప్రతిభావంతులు వీరు ’’ అంటూ ఆస్కార్ అకాడమీ కమిటీ సీఈవో బిల్ క్రామర్, ప్రెసిడెంట్ జానెట్ యాంగ్ పేర్కొన్నారు. 98వ ఆస్కార్ అవార్డు వేడుక వచ్చే ఏడాది మార్చి 15 (భారతీయ కాలమానం ప్రకారం మార్చి 16)న లాస్ ఏంజెల్స్‌లో జరగనుంది. ఈ నేపథ్యంలో ఆస్కార్ అవార్డు కమిటీ ఈ వేడుకకు సంబంధించిన పనులు మొదలుపెట్టింది.
ఇందులో భాగంగా విజేతల ఎంపిక ఓటింగ్ కోసం అకాడమీలో సభ్యులుగా చేరాలంటూ దేశ, విదేశాలకు చెందిన సినిమా తారలకు ఆహ్వానం పంపింది కమిటీ. ఆ జాబితాను విడుదల చేసింది. ఈ ఏడాది కొత్తగా 534 మందికి సభ్యత్వం ఇస్తున్నట్లుగా పేర్కొంది. వారిలో యాక్టింగ్ విభాగంలో ఇండియన్ స్టార్స్ కమల్‌హాసన్, ఆయుష్మాన్ ఖురానాలకు, దర్శకురాలుపాయల్ కపాడియా, సినిమాటోగ్రాఫర్ రణబీర్ దాస్, క్యాస్టింగ్ డైరెక్టర్ కరణ్, ఫ్యాషన్ డిజైనర్ మ్యాక్సిమా బసు, డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్ స్మృతీ ముంద్రాలకు ఆహ్వానం పంపారు.
ఆస్కార్ అవార్డు విజేతల ఎంపిక ప్రక్రియలో వీరికి ఓటు హక్కు లభిస్తుంది. నామినేషన్ల దశ నుంచి విజేతల ఎంపిక వరకూ సభ్యులు ఓటింగ్‌లోపాలు పంచుకోవాల్సి ఉంటుంది. కాగా కొత్తగా ఎంపిక చేసిన 534 మంది సభ్యుల్లో స్త్రీల సంఖ్య 41 శాతం ఉన్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. జనవరి 12 నుంచి 16 వరకు నామినేషన్ ప్రక్రియ జరుగుతుంది. నామినేషన్ దక్కించుకున్నవారి జాబితాను జనవరి 22న ప్రకటిస్తారు.