యువతరం నటీనటులకు సుహాసిని, ఖుష్బూ సలహా
గోవాలో జరుగుతున్న 56వ భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో భాగంగా నిర్వహించిన ఓ వర్క్ షాప్ సందేశాత్మక సంభాషణకు వేదికైంది. ప్రముఖ తారలు సుహాసిని–ఖుష్బూ ఈ వర్క్‌షాప్‌లో తమ అనుభవాలు, అబీప్రాయాలు, నటనలో మెళకువలను పంచుకున్నారు. తన ప్రశ్నలు తానే వేసుకుని తానే సమాధానాలు చెప్పడం ద్వారా సుహాసిని ఆసక్తిని పెంచగా, ఖుష్బూ తన అనుభవాలను పంచుతూ, హాజరైనవారిని అలరించారు. సంపూర్ణంగా అంకితం కావాలి... నటన అంటే ఏ కేటగిరీ అయినా సంపూర్ణ అంకితభావం తప్పనిసరి అని వీరిద్దరూ స్పష్టం చేశారు. ‘‘పారలల్ సినిమా–కమర్షియల్ సినిమా అని తేడా లేదు. ఏ సినిమా కైనా పని తీరు మాత్రం ఒకటే’’ అని ఖుష్బూ స్పష్టం చేశారు.
చిత్రకళ, కెమెరా టెక్నిక్‌లలో శిక్షణ పొందిన సుహాసిని సాంకేతిక అంశాలపై సూచనలు ఇచ్చారు. ‘‘ఐ లైన్స్, టైమింగ్, కెమెరా ఎలా పని చేస్తాయో తెలుసుకోండి. కెమెరాను ఎలా డీల్ చేయాలో నేర్చుకోండి. రియలిజయ్ కూడా ఓ స్థాయి దాటకూడదు’’ అని సూచనలు చేశారు. నటీనటులు సంభాషణలను ఎప్పుడూ తమ స్వభాషలో నేర్చుకోవాల్సిందేనని ఆమె పేర్కొన్నారు. ఇద్దరూ తమ తరానికి చెందిన క్రమశిక్షణను నేటి యువతకు చెప్పారు. ‘‘15 నిమిషాల్లో మేకప్ పూర్తి చేయడం, సమయాన్ని గౌరవించడం వంటి విషయాల్లో బాధ్యతగా ఉండాలి’’ అని ఖుష్బూ తెలిపారు.
సుహాసిని తనకు ఎదురైన తొలి వైఫల్యం గురించి చెప్పిన విషయం ప్రేక్షకుల నుంచి చప్పట్లను అందుకుంది. ‘‘నా తొలి తెలుగు సినిమా (కొత్త జీవితాలు) సూపర్ ఫ్లాప్. కానీ 100 తెలుగు సినిమాలు చేశాను. అదృష్టాన్ని కాదు... నిరంతర కృషినే నమ్మాలి... విజయానికి మూలం అదే అన్నారు. ‘‘యాక్షన్–కట్ మధ్యలోనే జననం–మరణం అన్నట్టు ఉంటుంది’’ అన్నారు సుహాసిని.
‘మీలోని చిన్నప్పటి నటì ఇప్పుడు మీకు ఎదురైతే మీరు ఏం చెప్పాలనుకుంటారు?’ అన్న ప్రేక్షకుల ప్రశ్నకు ‘‘ఇంకా కొంచెం బాగా చేయమని చెబుతాను’’ అని ఖుష్బూ చెప్పగా, ‘‘నేను కొన్ని అర్థం చేసుకోవడంలో నా చిన్నప్పటి స్థితి చూసి సిగ్గుపడతాను. స్వేచ్ఛగా ఉండమని చెబుతాను’’ అన్నారు సుహాసిని. ఇక ఓపాటకు ఖుష్బూ పెదాలు కదపగా, శాస్త్రీయ అభినయంతో సుహాసిని ఆకట్టుకున్నారు. – గోవా నుంచి ‘సాక్షి’ ప్రతినిధి


