వినోదాల కనువిందు | December 2025 Release Movies in Tollywood | Sakshi
Sakshi News home page

వినోదాల కనువిందు

Nov 23 2025 12:14 AM | Updated on Nov 23 2025 12:14 AM

December 2025 Release Movies in Tollywood

డిసెంబరు నెలలో సినీ జాతర 

క్రిస్మస్‌ పండక్కి థియేటర్స్‌లో ఐదారు సినిమాలు

ఈ ప్రపంచమే నిశ్శబ్దం
డిసెంబరు తొలి వారంలో ముందుగా ‘అఖండ 2: తాండవం’ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ కూడా విడుదలైంది. ‘‘కష్టం వస్తే దేవుడు వస్తాడు అని నమ్మే జనానికి కష్టం వచ్చినా దేవుడు రాడు అని నమ్మించాలి..’ అనే డైలాగ్‌తో మొదలైంది ‘అఖండ 2: తాండవం’ సినిమా ట్రైలర్‌. హీరో బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన ‘అఖండ’కు సీక్వెల్‌గా ‘అఖండ 2: తాండవం’ చిత్రం రూపొందింది. సంయుక్త, ఆది పినిశెట్టి, హర్షాలీ మల్హోత్రా ఈ చిత్రంలోని ఇతర ప్రధానపాత్రల్లో నటించారు.

ఎం. తేజస్విని నందమూరి సమర్పణలో రామ్‌ ఆచంట, గోపి ఆచంట నిర్మించిన ఈ చిత్రం డిసెంబరు 5న విడుదల కానుంది. తాజాగా విడుదలైన ఈ చిత్రం ట్రైలర్‌లో ‘‘ఎనిమిది కంఠాలు తెగాలి... రక్తం చిందాలి, నేను చని పోయిన రోజున వాడొచ్చి కొరివి పెడితేనే ఈ కట్టె మట్టిలో కలిసేది..., ఈ ప్రపంచంలో ఏ దేశం వెళ్లినా మీకు అక్కడ కనిపించేది ఒక మతం... ఈ దేశంలో మీరు ఎటు చూసినా కనిపించేది ఒక ధర్మం... సనాతన హైంధవ ధర్మం..., దేశం జోలికి వస్తే మీరు దండిస్తారు... దేవం జోలికి వస్తే మేం ఖండిస్తాం... మీ భాషలో చెప్పాలంటే సర్జికల్‌ స్ట్రైక్‌.., ఇప్పటివరకు ప్రపంచపటంలో నా దేశం రూపాన్ని చూసి ఉంటావ్‌... ఎప్పుడూ మా దేశ విశ్వరూపాన్ని చూసి ఉండవ్‌... మేం ఓసారి లేచి శబ్దం చేస్తే... ఈ ప్రపంచమే నిశ్శబ్దం’ అన్న డైలాగ్స్‌ ఈ ట్రైలర్‌లో ఉన్నాయి.

సమయంతో  పోరాడే కథ 
శర్వానంద్‌ హీరోగా నటించిన మల్టీ జనరేషనల్‌ ఫ్యామిలీ డ్రామా సినిమా   ‘బైకర్‌’. 1990–2000 మధ్య కాలంలో సాగే ఈ చిత్రం మూడు తరాల నేపథ్యంలో ఉంటుంది. ఈ మోటోక్రాస్‌ రేసింగ్‌ ఫిల్మ్‌లో శర్వానంద్‌ బైకర్‌గా నటించారు. ఈ సినిమాలోని లుక్‌ కోసం శర్వానంద్‌ ప్రత్యేకమైన శిక్షణ తీసుకుని సన్నబడ్డారు. స్పోర్ట్స్‌ అంశానికి కుటుంబ భావోద్వేగాలు మిళితమైన ఈ సినిమా డిసెంబరు 6న విడుదల కానుంది.

మాళవికా నాయర్‌ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో రాజశేఖర్, బ్రహ్మాజీ, అతుల్‌ కులకర్ణి ఇతర ప్రధానపాత్రల్లో నటించారు. విక్రమ్‌ సమర్పణలో అభిలాష్‌ రెడ్డి కంకర దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్‌ పతాకంపై వంశీ–ప్రమోద్‌ నిర్మించిన చిత్రం ఇది. ‘బైకర్‌’ ఫస్ట్‌ల్యాప్‌ పేరిట ఈ సినిమా గ్లింప్స్‌ను ఇటీవల విడుదల చేశారు మేకర్స్‌.       ‘‘ఇక్కడ ప్రతి బైకర్‌కి ఒక కథ ఉంటుంది. సమయంతో  పోరాడే కథ. చావుకి ఎదురెళ్ళే కథ. ఏం జరిగినా పట్టువదలని మొండివాళ్ళ కథ, ఇక్కడ గెలవడం గొప్పకాదు. చివరి దాకా  పోరాడటం గొప్ప’ అనే డైలాగ్స్‌ ఈ గ్లింప్స్‌లో ఉన్నాయి.

ఫారెస్ట్‌ లవ్‌స్టోరీ 
రోషన్‌ కనకాల, సాక్షీ మడోల్కర్‌ హీరో హీరోయిన్లుగా నటించిన ప్రేమకథా చిత్రం ‘మోగ్లీ 2025’. ఫారెస్ట్‌ నేపథ్యంలో సాగే ఈ యూనిక్‌ రొమాంటిక్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ సినిమాకు సందీప్‌ రాజ్‌ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో బండి సరోజ్‌ కుమార్‌ విలన్‌గా నటించగా, వైవా హర్ష ఓ కీలకపాత్రలో నటించారు. ఓ అమ్మాయి ప్రేమకోసం ఓ అబ్బాయి ఫారెస్ట్‌లో ఎలాంటి సాహసాలు చేశాడు? తన ప్రేయసి కోసం ఎలాంటి త్యాగాలు చేశాడు? అన్నది ‘మోగ్లీ 2025’ సినిమాలో చూడొచ్చు. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్, కృతీ ప్రసాద్‌ నిర్మించిన ఈ చిత్రం డిసెంబరు 12న రిలీజ్‌ కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి ‘మోగ్లీ 2025 వరల్డ్, మోగ్లీ 2025 టీజర్‌’లను రిలీజ్‌ చేశారు మేకర్స్‌.  

శంబాల ప్రపంచం 
క్రిస్మస్‌ ఫెస్టివల్‌కి ‘శంబాల’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు ఆది సాయికుమార్‌. ఈ మిస్టికల్‌ థ్రిల్లర్‌ సినిమాను యుగంధర్‌ ముని దర్శకత్వంలో షైనింగ్‌ పిక్చర్స్‌ బ్యానర్‌పై రాజశేఖర్‌ అన్నభిమోజు, మహీధర్‌ రెడ్డి నిర్మించారు. ఈ చిత్రంలో అర్చన అయ్యర్‌ హీరోయిన్‌గా నటించగా స్వశిక, రవివర్మ, మధునందన్, శివ కార్తీక్‌ ప్రధానపాత్రల్లో నటించారు. ఈ సినిమా డిసెంబరు 25న రిలీజ్‌ కానుంది. ఇటీవల ఈ  సినిమా ట్రైలర్‌ను రిలీజ్‌ చేశారు మేకర్స్‌.

‘కొన్ని వేల సంవత్సరాల క్రితం పరమశివుడికి, అసురుడికి మధ్య జరిగిన ఓ భీకర యుద్ధం ఈ కథకి మూలం, అగ్ని పురాణం ప్రకారం ఆకాశంలో సంగ్రామం జరిగినప్పుడు దుష్ట శక్తులు జంతువుల్ని సైతం ఆవహిస్తాయి, వాళ్లేమో చీమ కుట్టినా శివుడి ఆజ్ఞ అని నమ్ముతారు... విక్రమ్‌ ఏమో చావులో సైతం సైన్స్‌ ఉందనే రకం’..,  ‘మీరు చెబుతున్న శాస్త్రం మితం... మీరు తెలుసుకోవాల్సిన మా శాస్త్రం అనంతం’... వంటి డైలాగ్స్‌ ఈ సినిమా ట్రైలర్‌లో ఉన్నాయి. ఈ చిత్రకథ ప్రధానంగా ఓ గ్రామం నేపథ్యంలో సాగుతుందని, దుష్టశక్తులు, దైవం, సైన్స్‌ వంటి అంశాల మేళవింపుతో కథనం సాగుతుందని తెలుస్తోంది. అలాగే ఈ సినిమా కథనం విభిన్న కాలమానాల్లో సాగుతుందని   తెలిసింది.

చాంపియన్‌ ప్రేమకథ 
రోషన్‌ మేకా (ప్రముఖ హీరో శ్రీకాంత్‌ తనయుడు) హీరోగా నటించిన తాజా చిత్రం ‘చాంపియన్‌’. ఈ చిత్రంతో అనస్వర రాజన్‌ హీరోయిన్‌గా పరిచయం అవుతున్నారు. ఈ సినిమాలో స్వాతంత్య్రానికి ముందు హైదరాబాద్‌లో నివసించే ఆర్మీ మ్యాన్, ఫుట్‌బాలర్‌ మైఖేల్‌ సి. విలియమ్స్‌గా రోషన్‌ కనకాల నటించారు. మైఖేల్‌ ఎంతటి ప్రతిభావంతుడైన ఫుట్‌బాల్‌ ప్లేయర్‌ అంటే అప్పట్లో ఇంగ్లండ్‌లో రాణి ఎలిజబెత్‌ను కలుసుకునే అవకాశం అతనికి లభిస్తుంది.

కానీ అతని ధ్యాస అంతా తన ప్రేయసి చంద్రకళ (అనస్వర రాజన్‌పాత్ర పేరు) పైనే. మరి... చంద్రకళతో మైఖేల్‌ ప్రేమకథ ఏమైంది? అన్నది క్రిస్మస్‌ ఫెస్టివల్‌ సందర్భంగా డిసెంబరు 25న థియేటర్స్‌లో చూడాల్సిందే. జీ స్టూడియోస్‌ సమర్పణలో ప్రదీప్‌ అద్వైతం దర్శకత్వంలో స్వప్న సినిమా, ఆనంది ఆర్ట్‌ క్రియేషన్స్, కాన్సెప్ట్‌ ఫిల్మ్స్‌ సంస్థలు ఈ సినిమాను నిర్మించాయి. ‘‘హిస్టరీ, స్పోర్ట్స్‌ డ్రామా, లవ్‌ స్టోరీ, భావోద్వేగాలు, యుద్ధం వంటి అంశాలతో ‘చాంపియన్‌’ సినిమా ఆడియన్స్‌ను ఆకట్టుకుంటుంది’’ అని ఇటీవల ఈ సినిమా గురించి యూనిట్‌ పేర్కొంది.

యూత్‌ఫుల్‌ యుఫోరియా 
యూత్‌ఫుల్‌ ‘యుఫోరియా’ చిత్రంతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధం అయ్యారు ప్రముఖ దర్శకుడు గుణశేఖర్‌. భూమిక చావ్లా, సారా అర్జున్, నాజర్, రోహిత్, విఘ్నేష్‌ గవిరెడ్డి, లిఖిత యలమంచలి, అడ్డాల పృథ్వీరాజ్‌ ప్రధానపాత్రధారులుగా నటించిన సినిమా ‘యుఫోరియా’. రాగిణి గుణ సమర్పణలో గుణశేఖర్‌ దర్శకత్వంలో నీలిమ గుణ, యుక్తా గుణ ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రాన్ని డిసెంబరు 25న రిలీజ్‌ చేయనున్నట్లుగా చిత్రయూనిట్‌ ఇటీవల ప్రకటించింది.

నేటి యువతకి, ఫ్యామిలీ ఆడియన్స్‌కి కనెక్ట్‌ అయ్యేలా వైవిధ్యమైన కాన్సెప్ట్‌తో ఈ ‘యుఫోరియా’ సినిమాను తెరకెక్కించామని, ఈ సినిమాలో మంచి సందేశం కూడా ఉందని యూనిట్‌ పేర్కొంది. కల్పలత, సాయి శ్రీనికా రెడ్డి, అశ్రిత వేముగంటి, మాథ్యూ వర్గీస్, ఆదర్శ్‌ బాలకృష్ణ, రవి ప్రకాశ్, నవీనా రెడ్డి, లికిత్‌ నాయుడు ఈ చిత్రంలోని ఇతర కీలకపాత్రల్లో నటించారు.  ఇక ‘ఒక్కడు’ (2003 – ఈ చిత్రంలో మహేశ్‌బాబు హీరో) చిత్రం తర్వాత భూమిక చావ్లాతో కలిసి దర్శకుడు గుణశేఖర్‌ రెండు దశాబ్దాల తర్వాత మళ్లీ ఈ ‘యుఫోరియా’ సినిమాకు కలిసి పని చేయడం విశేషం. 

పతంగుల  పోటీ 
పతంగుల  పోటీ నేపథ్యంలో రూపొందిన కామెడీ స్పోర్ట్స్‌ డ్రామా చిత్రం ‘పతంగ్‌’. వంశీ పూజిత్, ఇన్‌స్టాగ్రామ్‌ సెన్సేషన్‌ ప్రీతి పగడాల, ‘జీ సరిగమప’ రన్నరప్‌ ప్రణవ్‌ కౌశిక్‌ ప్రధాన తారలుగా ప్రముఖ సింగర్‌ ఎస్పీ చరణ్‌ మరో కీలకపాత్రలో నటించిన చిత్రం ఇది. ప్రణీత్‌ ప్రత్తిపాటి దర్శకత్వంలో విజయ్‌ శేఖర్‌ అన్నే, సంపత్‌ మక, సురేష్‌ కొత్తింటి, నాని బండ్రెడ్డి సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం కూడా క్రిస్మస్‌ సందర్భంగానే డిసెంబరు 25 రిలీజ్‌ కానుంది. ఈ సినిమా కథే మెయిన్‌ హీరో అని, థియేటర్స్‌లో ఈ ‘పతంగ్‌’ సినిమా యూత్‌కి ఓ యూత్‌ ఫెస్టివల్‌గా ఉంటుందని చిత్రయూనిట్‌ పేర్కొంది. 

కులవ్యవస్థపై దండోరా 
అగ్రవర్ణాలకు చెందిన అమ్మాయిలు ప్రేమించి పెళ్లి చేసుకున్నా, అగ్రవర్ణాలకు ఎవరైనా ఎదురు తిరిగినా ఎలాంటి దౌర్జన్యకాండలు జరుగుతాయనే అంశాల నేప థ్యంలో రూపొందిన సినిమా ‘దండోరా’. శివాజీ, నవదీప్, బిందు మాధవి, రవికృష్ణ, మోనికా రెడ్డి ఈ చిత్రంలోని ప్రధానపాత్రల్లో నటించారు. మురళీ కాంత్‌ దర్శకత్వంలో లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ నిర్మించిన ఈ చిత్రం డిసెంబరు 25న రిలీజ్‌ కానుంది. ‘తెలంగాణ గ్రామీణ నేపథ్యంలోని ఆచారాలు, సాంప్రదాయాలను ఆవిష్కరిస్తూ ‘దండోరా’ ను తెరకెక్కించామని, ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చిత్రయూనిట్‌ పేర్కొంది. 
ఈ డిసెంబరు నెలలో రిలీజ్‌ కానున్న సినిమాలు, రిలీజ్‌ అయ్యేందుకు సిద్ధం అవుతున్న చిత్రాలు మరికొన్ని ఉన్నాయి.  

తెలుగు బాక్సాఫీస్‌ వద్ద ఈ డిసెంబరు నెలలో డబ్బింగ్‌ 
సినిమాలు కూడా గట్టిగానే సందడి చేయనున్నాయి. 
ఆ సినిమాలు ఏమిటో ఓ లుక్‌ వేద్దాం...

కార్తీ  పోలీసాఫీసర్‌గా నటించిన తాజా చిత్రం ‘వా వాత్తియార్‌’. ఈ చిత్రంలో కృతీ శెట్టి హీరోయిన్‌గా నటించగా, సత్యరాజ్, మధుర్‌ మిట్టల్, ఆనంద రాజ్, రాజ్‌ కిరణ్, శిల్పా మంజునాథ్, కరుణాకరణ్‌ ప్రధానపాత్రల్లో నటించారు. ఈ ‘వా వాత్తియార్‌’ మూవీకి తెలుగులో ‘అన్నగారు వస్తారు’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ యాక్షన్‌ కామెడీ కథకు నలన్‌ కుమారస్వామి దర్శకత్వం వహించగా,  స్టూడియో గ్రీన్‌ పతాకంపై కె. ఇ. జ్ఞానవేల్‌ రాజా ఈ నిర్మించారు. కాగా, ఈ సినిమాను డిసెంబరులో రిలీజ్‌ చేయనున్నట్లుగా చిత్రయూనిట్‌ ఇటీవల ప్రకటించింది. గతంలో ఈ ‘వా వాత్తియార్‌’ సినిమాను డిసెంబరు 5న రిలీజ్‌ చేయనున్నట్లుగా మేకర్స్‌ ప్రకటించారు. అయితే ఇప్పుడు ఈ రిలీజ్‌ డేట్‌లో మార్పు ఉంటుందని, డిసెంబరు 12న ఈ చిత్రం థియేటర్స్‌లోకి రావచ్చని కోలీవుడ్‌ టాక్‌. 

‘లవ్‌టుడే, రిటర్న్‌ ఆఫ్‌ ది డ్రాగన్, డ్యూడ్‌’ వంటి చిత్రాలతో ప్రేక్షకులకు దగ్గర అయ్యారు ప్రదీప్‌ రంగనాథన్‌. ఈ యువ కథానాయకుడు హీరోగా నటించిన తాజా చిత్రం ‘ఎల్‌.ఐ.కే’ (లవ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ). ఈ సైన్స్‌ ఫిక్షన్‌ రొమాంటిక్‌ కామెడీ డ్రామా సినిమాకు విఘ్నేష్‌ శివన్‌ దర్శకత్వం వహించగా, నయనతారతో కలిసి లలిత్‌కుమార్‌ నిర్మించారు. కృతీ శెట్టి హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో ఎస్‌జే సూర్య, యోగిబాబు, గౌరీ జీ కిషన్‌ ఇతర ప్రధానపాత్రల్లో నటించారు. ఈ సినిమా డిసెంబరు 18న రిలీజ్‌ కానుంది. దీపావళి సందర్భంగా ఈ ‘ఎల్‌.ఐ.కే’ సినిమాను రిలీజ్‌ చేయాలనుకున్నారు. కానీ ఈ పండగ సందర్భంగానే ప్రదీప్‌ రంగనాథన్‌ నటించిన మరో సినిమా ‘డ్యూడ్‌’ కూడా విడుదలైంది. ఈ నేపథ్యంలో ‘ఎల్‌.ఐ.కే’ సినిమాను రిలీజ్‌ వాయిదా వేయక తప్పలేదు. 

హాలీవుడ్‌ దర్శకుడు జేమ్స్‌ కామెరూన్‌ డైరెక్షన్‌లోని ‘అవతార్‌’ సిరీస్‌ నుంచి వస్తున్న తాజా చిత్రం ‘అవతార్‌:ఫైర్‌ అండ్‌ యాష్‌’. ప్రపంచవ్యాప్త సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ సినిమా డిసెంబరు 19న థియేటర్స్‌లో రిలీజ్‌ కానుంది. తెలుగులోనూ ఈ చిత్రం రిలీజ్‌ కానుంది. సామ్‌ వర్తింగ్టన్, జోయ్‌ సల్దానా, సిగోర్నీ వీవర్, స్టీఫెన్‌లాంగ్, ఊనా చాప్లిన్, కేన్‌ విన్స్‌లెట్, క్లిఫ్‌ కర్టిస్, జాక్‌ చాంపియన్‌ వంటి హాలీవుడ్‌ నటులు ఈ ‘అవతార్‌ 3’ చిత్రంలో నటించారు. జేమ్స్‌ కామెరూన్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహించడంతోపాటు ఓ నిర్మాతగా ఉన్నారు. జూన్‌ ల్యాండో ఈ సినిమాకు మరో నిర్మాత. 

మోహన్‌లాల్‌ హీరోగా నటించిన హిస్టారికల్‌ యాక్షన్‌ డ్రామా ‘వృషభ’. రాగిణి ద్వివేది, సమర్జిత్‌ లంకేష్, నయన సారిక ఈ చిత్రంలోని ప్రధానపాత్రల్లో నటించారు. తొలుత ఈ సినిమాను దీపావళికి, ఆ తర్వాత నవంబరు 6న రిలీజ్‌ చేయాలని ΄్లాన్‌ చేశారు. కానీ వీలుపడలేదు. అయితే ఇటీవల ఈ చిత్రాన్ని డిసెంబరు 25న రిలీజ్‌ చేయనున్నట్లుగా మేకర్స్‌ ప్రకటించారు. శోభా కపూర్, ఏక్తా ఆర్‌ కపూర్, సి.కె. పద్మ కుమార్, వరుణ్‌ మాథుర్, సౌరభ్‌ మిశ్రా, అభిషేక్‌ ఎస్‌ వ్యాస్, ప్రవీర్‌ సింగ్, విశాల్‌ గుర్నాని, జూహి పరేఖ్‌ మెహతా ఈ సినిమాను నిర్మించారు. తండ్రీ కొడుకుల ఎమోషన్, మానవ అనుబంధాల మేళవింపుతో ఈ చిత్రం ప్రేక్షకులను అలరిస్తుందని చిత్రయూనిట్‌ పేర్కొంది.  
వీటితోపాటు ఈ నెలలోనే మరికొన్ని ఇతర భాషల చిత్రాలు తెలుగులో రిలీజ్‌ అయ్యేందుకు సిద్ధం అవుతున్నాయి.  – ముసిమి శివాంజనేయులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement