సీరియల్ నటి సమీరా షెరిఫ్ బాల్యంలో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. సమీరా మాట్లాడుతూ.. నా చిన్నతనంలో మా ఎదురింట్లో ఉన్న ఆంటీ వాళ్లింటికి బంధువులు వచ్చేవారు. వారిలో ఒక అంకుల్ లాంటి అన్న కూడా వచ్చేవాడు. అంటే ఆయన వయసు కొంచెం పెద్దది. ఆయన నా బుగ్గలు పట్టుకుని ఎక్కువ ముద్దు చేసేవాడు.
దాగుడుమూతలు
ఆ వయసులో నాకర్థం కాలేదు. మేము రైల్వే క్వార్టర్స్‌లో ఉండేవాళ్లం. ఆ బిల్డింగ్‌లో పైన టెర్రస్‌కు వెళ్లే మెట్ల దగ్గరకు మాత్రం ఎవరూ ఎక్కువగా రారు. ఆయన మనం దాగుడుమూతలు ఆడుకుందాం అనేవారు. అప్పుడది చాలా ఫన్‌గా అనిపించేది. పిల్లలందరం కలిసి ఆడేవాళ్లం. మాతోపాటు ఈ అన్న కూడా జాయిన్ అయ్యేవాడు.
కోరికలు తీర్చుకున్నాడు
మనం ఇక్కడ దాక్కుందాం అని నన్ను టెర్రస్ పైకి తీసుకెళ్లేవాడు. అక్కడ దాక్కున్నాక నాకు ముద్దులు పెట్టేవాడు. ఒకానొక సందర్భంలో నాకు అసౌకర్యంగా అనిపించేది. కాస్త వయసు వచ్చాక నాకు అర్థమైందేంటంటే.. ఆయన నన్ను ముద్దుచేసేవాడు కాదు, తన కోరికలు నాపై తీర్చుకున్నాడు అని! చెప్పాలంటే ఇది కూడా పిల్లలపై జరిగే లైంగిక దాడిలాంటిదే! ఆ సమయంలో మనకు అంత అవగాహన లేదు.
భయంతో చెప్పలేదు
పిల్లలకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ నేర్పించాలి, వాళ్లకు తెలియాలి అని మా తల్లిదండ్రులు అనుకోలేదు. ఒకవేళ ఇలా జరిగిందని నేను వెళ్లి చెప్పినా ముందు నన్నే ప్రశ్నిస్తారు.. అసలు నువ్వు అక్కడికెందుకు వెళ్లావ్? అని తిడతారు. మన పిల్లలకు అలాంటివి జరిగితే నీకు నేనున్నా.. అని ధైర్యం చెప్పాలి.. అలా కాకుండా తిట్టేస్తే వాళ్లు ఏదీ బయటకు చెప్పరు. నేనూ భయంతో చెప్పలేదు.
చాలామంది జీవితంలో..
ఇలాంటి సంఘటన నాకే కాదు చాలామందికి జరిగింది. వాళ్లు పిల్లలపై ప్రేమ చూపించడం లేదు, కోరిక తీర్చుకుంటున్నారు అని సమీరా చెప్పుకొచ్చింది. సమీరా.. జీవితం, అభిషేకం, భార్యామణి, మనసు మమత, ఆడపిల్ల వంటి పలు సీరియల్స్‌లో నటించింది. నటి సన కుమారుడు అన్వర్‌ను పెళ్లి చేసుకుని వైవాహిక బంధంలో స్థిరపడింది. తనకు ఇద్దరు కుమారులు సంతానం.
చదవండి: త్వరలో బిగ్ న్యూస్ చెప్తానంటున్న చిన్నారి పెళ్లికూతురు


